Tuesday, 18 September 2018

తిరిగిరాని ఆ ప్రేమ కావాలని మళ్ళీ అడగకు నన్న

అనువాద కవిత.

ప్రియా, ఒకప్పటి మనదైన ప్రేమని  ఇవ్వమని మళ్ళీ అడగకు.
కేవలం నీ వల్ల అప్పుడు లోకమంతా బంగారం రంగు కాంతులతో తళుక్కుమనేది. అదే నిజమని నమ్మా కూడా.
నీ ప్రేమ తాలూకా గాయాలకోసం కాకుండా వేరే వాటికోసం ఎవరు  కుమిలిపోతారు చెప్పు?
అసలు ఇంకా ఈ లోకంలో బాధపడాల్సినవి ఏముంటాయి చెప్పు నువ్వు జ్ఞాపకంగా వదిలెళ్లిన బాధలు తప్ప?
ఈ ఆందోళనలు, అన్యాయ ఆక్రందనల గోల ఏంటి?
నీ మొముపై గునిసియాడే ఆ వెలుగే కదా వసంతకాల రాకకి గుర్తు.
అదేంటో కానీ, ఆకాశాన్ని ఎప్పుడు చూసినా నీ రెండు కళ్లలాగే తోచేది.
నా ఒడిలోకి నువ్వు జారిపడితే, ఆ తలరాత కూడా స్తబ్దుగా, అసహాయతతో చూస్తూ ఉండిపోదా చెప్పు.
నీ మీద ఉన్న ప్రేమవల్ల ఇవన్నీ ఆలోచించేవాడిని, ఇవి నిజమని నమ్మేవాడిని కూడా.
కానీ, ప్రేమే కాకుండా ఇంకా వేరే బాధలు, ఆనందాలు ఉన్నాయ్ ఈ లోకంలో.
ధనికులు ఒక మాయ ముసుగుని చరిత్ర మీద కప్పేసారు ఎప్పుడో.
చీకటి రహస్యాలన్నీ తీగల్లా చుట్టి అందమైన అలంకరణలాగా అల్లారు లోకం గోడలమీద.
ఎప్పుడైతే నేను వెలుగు ప్రసరించని ఇరుకు సందుల్లోకి, మార్కెట్ స్థలాల్లోకి వెళ్లానో, మింగుడుపడని, ఇప్పటివరకు బయటపడని నిజాలన్నీ నా ముందు వచ్చి వాలాయి.
ఆ గల్లీల్లో నేను సగంకాలిన మనుషులను, రక్తమోడుతున్న ప్రాణాలను చూసా.
వాళ్ళని అక్కడే పదే పదే అమ్మడం, కొనడం నే చూసా.
ఈ కఠోర వాస్తవాలు కూడా గుర్తించాల్సిన సమయం వచ్చింది.
అక్కడనుండి తిరిగొచ్చిన తర్వాత వాళ్ళకోసం “నేనేం చేయాలనే” అనే ఆలోచన తప్ప ఇంకో తలంపే రావట్లేదు నాకు.
ప్రేమ మిగిల్చే భాదలు, ఆనందాలు కన్నా ఇంకా వేరే చీకటి వాస్తవాలెన్నో ఉన్నాయ్ ఈ లోకంలో.
ప్రియా, తిరిగిరాని మన ఆ ప్రేమ కావాలని మళ్ళీ అడగకు నన్ను .

మూలం -ఫైజ్ అహ్మద్ ఫైజ్. లింక్ 

Saturday, 1 September 2018

స్వేచ్ఛా గీతికఈ కథ సారంగలో ప్రచురితం అయింది. లింక్

క్లాసులు మొదలయ్యు వారం రోజులయినా ఇంకా తెమల్లేదే అయ్యగారు- ఫోనులో నరేష్ గాడి ఆదుర్దా బాకా హోరుకి అలసిపోయి అలా కన్నారుతుందో లేదో కానీ, తడిక చప్పుడికి మెలుకువొచ్చింది.
“చైతాను బావా... ఏదో సదువుకున్నోడివని సూడమంటే, మరి రెండంటే రెండే పేర్లేనా? నీ...” అని దీర్ఘంతీస్తూ, పెళ్ళాం అయిష్టత తాలూకా టిక్కురక్కులను మొకానికి ముసుగుగా పూసుకొని వచ్చాడు మా గోపిగాడు.
పేడి మొహం నుండి గోదుమ్మీసాలు వచ్చేదాకా టీరింగ్ తిప్పి మొద్దుబారిన బండ చేతులతో నే కప్పుకున్న రెక్కదుప్పటి అమాంతం లాగేసరికి, మంచంక్కోడుకి పట్టి అది కాస్త బరుక్కుమంది.
రేప్పొద్దున్న జమలక్క పీతురు మాటల కంపు ముందే పసిగట్టి, కిరాయి సగానికి తెగ్గొట్టడిగే పీసువెధవలమీదకి విసిరే తొర్రి పళ్ళ నవ్వుని ఒకటి ఇప్పుడు పెదాలకు అతికించుకొని, మంచం పట్టె మీద చల్లగా కూసున్నాడు. అసలికే ముక్కదైపోయిన మా ముసల్దాని మంచం, నిశ్శబ్దంగా మూలిగి ఇంకొంచెం జోలగయ్యింది.
తాలింపెయ్యని ఉల్లిగడ్డకారం మూడు పూట్ల గోళ్ళతో పళ్లెంలో గెలుక్కుతినేలా చేసిన అమ్మ ఊరి పయనాల మీద ఉన్న కడుపు(లో) మంటంతా, గోపిగాడి మీదకి కక్కేయాలనేంత మా చెడ్డకోపం తన్నుకొచ్చింది.
“అయినా మీ మొండితోకోల్లకి పెట్టేంత పేషను పేరు మాకేం తెలిసిద్దిలేరా! వచ్చింతరువాత మీ జమలక్కని అడుక్కో, మీ సోకుకి తగ్గట్టు ఇచ్చిత్రం పేరు పెడతాది”. పనికిరాని ఆవేశం వల్ల పిడసగట్టుకుపోయిన గొంతులో నీళ్ళు నింపేసుకుంటున్నాను.
ఇంటిపేరును ఎచ్చరిక చేయగానే ఎక్కడలేని ఇది గొంతులోకొచ్చి “మా అక్కనెందుకు అడగటం, మీ అయ్య నీకు టైలీసు పేరు పెట్టాడుగా, చైతాను అని, ఓ ఆడంగోళ్ళ పేరు” అని, టీవీ బల్ల మీదున్న పుత్తకం పేజీలు విసురుగా ఒక నిముషంలో చివరిదాకా తిప్పేసాడు.
ఇంకొక మాట జారితే, రేప్పొద్దున టేషనులో దిగపెట్టడనే భయంతో, ఎక్కడలేని పెద్దతనాన్ని అరువుతెచ్చుకొని, “మరేందిరా, మీ అమ్మాయి పేరు కోసం మా క్లాసోళ్లందరికి లంచంగా టీ పోయించగా వచ్చిన పదమూడు పేర్లలో, రెండు చూడసక్కనివి నీకు చెబితే, నడిజాముకాడ వచ్చి నన్ను నిలదీస్తావా?” అంటూ వేడిగా ఒక చూపు చూశాను.
నా డాబుసరి మూటల బుట్టలో పడిపోయి, రెండేళ్లకింద ఆటో యాక్సిలెంట్ గుర్తుగా మిగిల్చిన ఎడమచేయి కుట్లుని బర్ర బర్ర గీకుతూ “అదిగాదు బావా, మా జోతేమో పొయ్యి మా వదినకి చెప్పింది. ఆమేమో బాగానే ఉన్నాయి కానీ, కొంచెం వోల్డుగా ఉన్నాయని ఈమెగారికి నూరిపోసింది”- ఇద్దరాడోళ్ల మధ్య రాపిడికి ఒకింత మెత్తగయ్యినట్టున్నాడు.
పండబెట్టి కోత్తే గూడెంమొత్తానికి మూడ్రోజులు వత్తాడు గానీ, పెళ్ళాన్ని గదిమిచ్చి ఏదోక పేరు పెట్టలేడు. ఇక్కడికొచ్చి లోపలనుసుకున్నకోపాన్ని సకిలిస్తున్నాడు వీడు.
పొద్దునుతుక్కున్న కడ్డాయర్లు పెట్టుకున్నానో లేదో అని, మళ్లొకసారి బ్యాగంతా కల్లిబిల్లి చేసి, గుడ్డలన్ని ఉండల్లా చుట్టి, దాని నోటిలో కుక్కాను. దెబ్బకు పొట్టపగిలి జిప్ పేలయింది.
అసలీ పెంటంతా వీడి పిల్లపేరు వల్లే వచ్చిందని, “మీ అయ్య పేరు కలిసేట్టు కిట్టమ్మనో లేక అమ్మపేరు కలిసేట్టు మరియమ్మనో పెట్టుకోండి ఇక. అయినా, మీ రమేశన్నోళ్లకి కూడా పేరు కావాలి కదరా. ఆయన్నడుగు, మా మంచి తేటగున్న పేరు చెప్తాడని” నల్లదారం సూదిలో ఎక్కించి, బ్యాగుమీద యుద్ధం ప్రకటించాను.
“ ఓ అయ్యా సక్కగాడా, ఆయన్ని అడిగేదానికైతే నీకెందుకు చెప్తానయ్యా సామీ? అయితే అయిందిలే కానీ, రాత్రి ఇదేదో పేరు ఇంగిలీసులో వాటుసాపులో పంపాడు సూడు” అని పోను నా కళ్ళలో పెట్టాడు.
ఎప్పుడూ వినని, చూడని ఆ పేరుని చూసేసరికి బహుశా ఎక్కువ ఎటకారంగా నవ్వాననుకుంటా, సూదొచ్చి బ్యాగుని అదిమిపట్టుకున్న ఎడమచెయ్యి చూపుడువేలిలో పుటుక్కున గుచ్చుకుంది. రొడ్డచెయ్యి వేలిని నోట్లో చప్పరిస్తూ, పసుపుకోసం “వంటగదనే” ఒక మూలగా అమర్చిన డబ్బాలన్నీవెతికాను.
సిన్నపిల్ల ఉసురు తగిలిందని సంకలు గుద్దుతూ మిగిలిపోయిన ఆ కాస్త బ్యాగు కన్నాన్ని పూడుస్తూ, “వాళ్ళిద్దరి పేర్లు కలిసేట్టు పెట్టుకున్నారటయ్యా, నీకేంది నొప్పి ఇప్పుడు? ఆ నెట్లోనో, గిట్లోనో వెదుక్కొని పట్టుకున్నారట ఆ పేరు. ఆ సొదంతా ఎవడు పడతాడని నీకు చెబితే, ములగ చెట్టెక్కుతున్నావ్ గా” అని నాకెళ్లి చూసి కిసకిస నవ్వుతున్నాడు.
ఇక గొడవాడలేక, సరేలేరా పుట్టి పదిరోజులే కదా అయ్యింది, రేపు నేను యూనివర్సిటీకి పొయ్యిన తర్వాత ఇంకొన్ని పేర్లు పంపిస్తాలే అని చీరముసిగేసిన పక్కబట్టల్లోంచి ఇంకొక చద్దరు కప్పుకొన్నాను.
మునగదీసుకొని పడుకునేసరికి పక్క బొంత కాస్త సగం కిందకి వాలి, వళ్ళు విరుచుకొని పడుకుంది. మధిరలో అందుకోవాల్సిన సాతవాహన కోసం అలారం అయిదున్నరకే గావుకేకలు పెడుతుంది. బద్దకంగా నోరు తెరిచిన నవారు మంచం కన్నాల్లోనుంచి చెయ్యిపోనిచ్చి, ఫోనుని ఒక దెబ్బేసాను. కుయ్యి కుయ్యి మంటూ, బోర్లాపడింది అది.
కాళ్ళుజాపి నిండా చద్దరు కప్పుకుంటుంటే, కళ్ళల్లో దూరుతున్న అమాస చీకట్ల తాలూకా తలపునెట్టుకొని ఇటుపడ్డాడు గోపిగాడు చేతిలో ఫోనుతో. పెపంచం ఆగిపోతుందన్న ముక్క ముందే తెలుసనట్టు  పిచ్చి పాటలు అల్లే మా జంగమోళ్ళ కనకం తాతకున్న నిచ్చలత్వం, వాడి ముఖంపై చిందులు తొక్కుతున్నట్టుంది.
ఏమైందిరా అని లేద్దామనుకున్నలోపే, ఏమి పట్టనట్టుగా “రమేశన్నోళ్ల పిల్ల సచ్చిపోయిందట బావా” అని, తెల్లారుజాము చీకట్లో కన్నీళ్ళని కలిపేసుకుంటున్నాడు.
స్తల, కాలాలేవీ పట్టనట్టుగా గోపిగాడు నడిచివెళుతుంటే, వాడి అడుగులతోపాటు, వాకిట్లో విషాద సంద్రంలో మునిగిన పొద్దు ఉదయిస్తున్నట్టనిపించింది.
ఏ సడి, సప్పిడి లేకుండా వచ్చిన గాలి దుమారానికి తేరుకొని మొత్తల్లోకొచ్చిన నాకు, బొలెరో ఇంజిను శబ్దం వినిపించింది. మాయ్యేళ్ళకి చెప్పవరా అని అడుగుతున్నా, అసలేమీ వినపడనట్టు, ఎనకమాల టక్కువైపు నడిచాడు. నిన్న ఏరుకొచ్చిన కట్టెలదుంపలు, వాళ్ళ సీనన్న సెంట్రింగ్ ఇనుప షీటులను, ఏది నిజమో, ఏది అబద్దమో, అని తూకం వేస్తున్నట్టు మెల్ల మెల్లగా బయటకు లాగుతున్నాడు. డూటీకి పోతున్న వాళ్ళన్నని మధిరలో దింపినపుడు, వీడి కళ్ళముందే వీడియో కాలు చేసి మురిసిపోయాడని చెప్పాడు. అట్టా పంపించి, మా అమ్మ ఎలాగూ లేదని మా ఇంటికొచ్చి పడుకున్నానని, ఇంకా ఏదేదో అర్ధం కాకుండా గొణుక్కుంటున్నాడు లో, లోపలే.
వాడు ముక్కు చీదడంలోనే ఏమి చెయ్యాలో తెలిసొచ్చి, నేను కూడా మిగిలిన చెత్తంతా తీసి, చీపురుతో బాడీ మొత్తం ఊడ్చి, బులుగు పట్టా ఒకటి వేశాం కింద కూర్చునే విధంగా.
ఇంటికెదురుగానున్న వేపచెట్టుపుల్లొకటి వేసుకొని, రెండు నిముషాల్లో పళ్ళుతోముకొని బులెరో దగ్గరికెళ్ళా. అందరెక్కిన తరువాత డోరువేసి, వెనక అడ్డంగా పెట్టిన కడ్డీ పట్టుకొని నిలబడ్డా.
“ఎట్టాగూ కాలిగానే ఉన్నావ్ కదరా, ఆ రమేశయ్య బిడ్డని చూసిరారాదు?”. నిన్న ఆటో ఎక్కే ముందు అమ్మన్న మాటలు గుర్తొచ్చాయి.
“మూణ్ణెల్ల పిల్లని నాకు ఎత్తుకోవడం చేతకాదే, కొంచెం పెద్ద అయినా తరువాత ఒకేసారి చూసి ఎత్తుకుంటాలే”-నా పేలవ మాటలు పెడేల్మని మొహానికి తగిలాయి. వెనుకటైరు ఎత్తేత్తే , కర్ర పట్టు తప్పి, ఎడమ చెయ్యి డోరు రేకుకి గుచ్చుకుంది. ఎన్నడూ గమనించని, గతుకుల గుంతలు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నాయి.
బులెరో ఆరను శబ్దం, ఏడుపాపుకోవడానికి నోట్లో పెట్టిన చీర కొంగు గాలికిచేస్తున్న టపటప శబ్దం, మా లోకమయ్యాయిప్పుడు. చెప్పాపెట్టకుండా వచ్చిన ఆపద, బండిలోనున్న వాళ్ళందరిని కొంచెం కొంచెం కోసుకుతింటున్నట్టుంది.
ఆగకముందే దిగి డోరు తీయాలనే తొందరలో కిందకి దూకేసరికి, బుడుగులో కాలుపడి ప్యారాగాను చెప్పు తొడిమ తెగింది. పిన్నీసు పెట్టి సరిచేసే టయిము లేక టక్కులో జత పడేసి, ఆదరాబాదరాగా ఉరుక్కుంటూ వెళ్ళా మిగతావారిని అందుకోవాలని.
గుమ్మానికి ఇంకో పదడుగులు ఉందనగానే, ఎదో తెలియని కారుమబ్బొక్కటి నా ఇంద్రియాలన్ని మొద్దుబారేలా చేసి, నాకే తెలియకుండా ఇంటిలోపలికి లాక్కుపోతున్నట్టనిపించింది.
అమ్మలక్కల గోసపెడుతున్నా చెవుల్లో “గీ” అనే మోత తప్ప ఏమి వినిపియ్యట్లే. వీళ్ళ గోలతో తనకేమి సంబంధం లేనట్టు, అందరూ రొమ్ములకత్తుకొని ఊపుతున్నా ఆ చిన్ని తల్లి ఏడవకుండా ఉంది.
నాకు గుర్తెరిగి ఒక చిన్నపిల్లను ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటసారి. అది కూడా ఇలా.
పారేసుకున్న కళ్ళు. రెప్పలు అదే పనిగా మూసుకొని ఉండటంవల్ల, కనుబొమ్మలు ఉబ్బి నవ్వుమొహంలా అనిపించింది. గుక్కపట్టి ఏడుస్తున్న ఇన్ని గుండెల రాపిడికి ఒరుసుకుపోయి కమిలిన తన లేత చర్మం.
“నలుపైనా, ఎంత కళ మొగమో, మా బుడ్డదానిది”-వాళ్ళ అమ్మమ్మ, వంకర్లుపోతున్న చిన్నివేళ్ళను అతిసుతరంగా నొక్కుతుంది. చిన్న పిల్ల చనిపోయిన దగ్గరనుంచి, ఏడ్చి, ఏడ్చి, గేరొచ్చి, శారదా కూడా చలనం లేకుండా పడుంది పిల్లకిమల్లే. ఇంకా ఏడిస్తే, బిడ్డతో సహా తల్లి దక్కదని గోపిగాడిని బయటకు లాక్కొని వచ్చా.
ఈ లోగా సీను గాడు, మధిరపొయ్యి రమేష్ ని బండిమీద ఎక్కించుకొని వచ్చాడు. నిన్న రాత్రే, తనకి మాత్రమే అర్ధమయ్యే బాసలో కబుర్లెన్నో చెప్పి, పొద్దుటకల్లా ఎవరికీ అర్థంకానీ నిశ్శబ్దమైన కదలికలు మూటకట్టివెళ్లిపోయిందని, వాడు బావురుమంటున్నాడు. ఎక్కడ బొందబెట్టాలని తజ్జన బజ్జన పడుతుంటే, ముసలోళ్ళందరూ తమ జీవితానుభవాలనుండి కూడ బలుక్కొని చెప్పిన మాట “ఇంటి దగ్గర్లో పెడితే, మళ్ళీ కాన్పు తొందరగా అందుకుంటుందని.”
గాబు పక్కనున్న గుబ్బ చెట్టుకాడ గుంత తీద్దామంటే, “ఒకేల, మా వదినకు ఎప్పుడైనా ఈ ఇషయం తెలిస్తే, పరగడుపునే ఇక్కడే కూలబడి లేవదు. ఇంకేదైనా తలం చూడండి” అన్న గోపిగాడికి, ఆడున్న పెద్దోళ్ళందరూ 10 గజాల్లో ఉన్న ఎన్నెస్పీ కాలువ చూపించారు.
ఆడోళ్ళేవరిని రావొద్దని చెప్పి, వాళ్ళ నాన్న ఏంతో మురిపెంగా కొనుక్కొచ్చిన గులాబీ దూది దుప్పట్లోనే తనని తీసుకెళ్లారు పెద్దోళ్ళు.
ఆవల గట్టుకానుకొనే ఎవరో ప్రవారి కట్టుకున్నారు కాలువ మీదే. అందాజగా ఒక నాలుగడుగులు తవ్వి పిల్లని పడుకోబెట్టారు. బడి అయిపోయుందనుకుంటా, ఇక్కడున్న పిల్లోళ్ళందరూ బులెరో ఎక్కి, ఆ కడ్డీలు పట్టుకొని వేలాడుతూ కళ్లెళ్లబెట్టి చూస్తూ, గోల చేస్తున్నారు.
“ఓరి పోరగాల్లరా, ఎందుకురా అరుత్తున్నారు, ఆ ఇంటోళ్లు బయటకొత్తార్రా” అని, మీదున్న కండువాతో గింజల్ని తినడానికి వచ్చే పిట్టల్లకిమల్లే పిల్లల్ని అదిమిస్తున్నాడు.
ఇంకో రెండు పారల మట్టి అయితే అయిపోయిద్దనగా, గోడకిటుపక్క చేతులేసి ఆ ఇంటామె అరవడం మొదలెట్టింది. “ఏమయ్యా, మీకు వేరే ప్లేస్ దొరకనట్టు ఇక్కడ పెట్టారు. అసలు మీకు బుద్ది ఉందా? మీ స్మశానానికి పోవొచ్చు కదా? నేను ఇప్పుడే ఎస్సై కి ఫోను చేసి, న్యూసెన్స్ కంప్లైయెంట్ ఇస్తా” అని లోపలి విసురుగా వెళ్ళిపోయింది.
ఈ చీదరింపులు మనకెలాగూ అలవాటే అన్నట్టుగా, ఇంట్లోకొచ్చి, లోటాతో కాళ్ళు కడుక్కొని, కిరసనాల దీపానికి దండంబెట్టుకున్నాం. “దైర్యం జేసుకొని, శారదని కడుపులో పెట్టుకొని ఉండాలన్న మరిమ్మక్క మాటకు, రమేష్ గాడు తలూపుతుంటే, బొట బొట మంటూ, కన్నీళ్లు చెంపలమీదకి కారుతూనే ఉన్నాయి. అంత అయిపోయుందనుకున్న తర్వాత అందరు టక్కుకాడికి పోతుంటే, “బీ స్టాంగు” అని వాడికి చెప్పి, వెనక్కి తిరిగి చూసే దమ్ములేక బండి ఎక్కినా. ఏందిరా బిడ్డా, ఇవాళ కూడా రాలేదన్న నరేష్ గాడి మెసేజికి, జరిగిందేంటో పొడి పొడిగా చెప్పి, ట్రక్కులో సతికిలపడ్డా.
ఎర్రటగ్గిలో రోజంతా ఎండిపోయి, సాయంత్రం చెడు వానలో తడిసిన కరెంటు కోడిపిల్లకిమల్లే రెక్కలు ముడుచుకొని ఇంటికి చేరుకున్నాం.
కాలేజీకి పోదామని సర్దిన బ్యాగునిపక్కకి తన్ని, రెండు ముద్దలు గొడ్డుకారం నోట్లో వేసుకుంటున్నానో లేదో, గోపిగాడు రొప్పుతూ వచ్చి తెల్ల తెల్లగా ఎదో మాట్లాడుతున్నాడు. ఎంగిలి చెయ్యి పళ్లెంలోనే కడిగి, ఈ సారి ఉత్తకాళ్లతోనే బండిమీద పొయ్యాం వైరాకి.
మేం పొయ్యేసరికి ఎస్సై గారు గట్టిగ కేకలేస్తున్నారు. “ఏం రా? మీ అయ్యా జాగీరురా ఆ కాలువా? కేసుపెట్టి బొక్కలో తొయ్యమంటారా లేక ఇంకెక్కడైనా పాతేసుకుంటారా” అని, సిగరెట్ వెలిగించుకున్నారు.
“అట్టగాదు సార్. ఇంటి దగ్గర్లో పెడితే, కడుపు తొందరగా అందుకుంటుందంటే పెట్టినాం. మళ్ళా , ఇప్పుడు తీస్తే, పాపం తగిలిద్ది సార్. అయినా, వాళ్ళ గోడ కూడా ఎన్నెస్పీ కాలువమీదే కట్టారు కదా” అని, గోపిగాడు నసిగాడు దూరం, దూరంగా జరుగుతూ.
కుడిచేతి బొటనవేలితో టచ్చు ఫోను నొక్కుతున్న ఆయన, ఒకదమ్ము పొగ గట్టిగ వదిలి “ఏందిరో, నోరు లెగుస్తుంది. ఆ ఇళ్లెవరిదో తెల్సునా? ఎమ్మెల్యే గారి బామ్మర్దిది. అవసరమైతే ప్రొక్ లేనరు పెట్టి, ఆ బొందని తవ్వించమని చెప్పిండు. లమ్మిడి కొడుకుల్లారా, గుద్దమూసుకొని, 5 నిముసాల్లో పని కానియ్యాలి” అని, గోపిగాడి కాలర్ పట్టుకొని లాగేసరికి అది కాస్త చినిగిపోయింది. ఏమైందో నాకు పదినిముషాల్లో కాల్ చేసి చెప్పమని, అక్కడున్న ఐదారు కానిటేబులకి చెప్పి, బండెక్కి వెళ్ళిపోయాడు.
గడ్డపారతో తొవ్వితే ఎక్కడ చిన్ని పాపకు తగులుతుందనే భయంతో, కొంచెంసేపు పార, ఇంకొంచెంసేపు వట్టిచేతులతోనే తిరగతోడాం బొందంతా. ఎడమచేయికున్న నల్ల దిష్టి పూసలు కనపడగానే గోపిగాడు ఆ చేతిని ముద్దెట్టుకుంటూ, వాడి నెత్తిని మట్టిలోకి కూర్సుకుంటున్నాడు. పక్కనున్న ఇద్దరొచ్చి వాడి రెక్కపట్టుకొని ఈడ్చుకెళ్లారు దూరంగా.
మట్టికొట్టుకుపోయిన ఆ చిన్న పిల్ల మొఖం చూడలేక ఫోన్ లైట్ బంజేయమని చెప్పినా. బొందలోనుండి అమాంతంగా తనని రెండు చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు, నేలకూలి లోపలికి కూరిపోతే బాగుండనిపించింది.
కాలువకాన్నుంచి గాబు గుంతదాకా తనని ఎత్తుకొని నడుస్తుంటే, పుట్టినప్పటినుండి ఇప్పటిదాకా నడచిన అడుగులన్నీ వెనక్కి వేస్తున్నట్టనిపించింది. ఎక్కడ శారదా లేస్తుందనే కంగారులో, ఆ దూదిదుప్పటి మునుపటిదగ్గరే కంగారులో వదిలేశాం. కండువకటి కింద పరచి మెల్లగా మట్టిపోసాము. మట్టి అదునుగా సదురుతుంటే, ఆ చిన్ని తల్లంతా చిల్లు, నా గుండెల్లో పడినట్టు అనిపించింది.
మట్టి చేతులు కడుక్కొని ఇంట్లోకొచ్చేసరికి, శారదకి ఆర్.యం.పి డాక్టరు ఏయ్యె మందులు ఇచ్చి, ఇంజిషను పొడుస్తున్నాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండలేక, వెంటనే ఇంటికి వచ్చేసాం.
ఈ రోజంతా చీకటిలోతులకి అలవాటైన కళ్ళకి, బండి లైట్ తో పని ఏమి లేకుండా పోయింది ఈ అర్ధరాత్రప్పుడు.
“పట్నంలో ఉంటే మాత్రం ఏమంత బాగుపడ్డార్రా మనోళ్లు, సరైన బొందలగడ్డే లేదు అసలు. ఈ సిటివోల్లు పీనుగులని కూడా తినేరకం రా” అని, ఎస్సై మీదున్న కోపం బుగ్గనేసుకున్న పొగాకు మీద చూపిస్తున్నాడు కిట్టమాయ్య.
నాకెందుకో ఈ రోజు జరిగిన వాటిని తలచుకుంటే అదే నిజమనిపిస్తుంది.
నేను పెద్ద బళ్లోకి పోయిన సంవత్సరం అనుకుంటా, చుట్టింటి గోపులతాత నిద్రలోనే చనిపోయాడు. నేను పొద్దున్న లేచి బొగ్గుతో పళ్ళు తోముకొని పోయేసరికి, చాలామంది గూమిగూడి ఉన్నారు ఇంటి ముందు. ఆఖరుకు అంతకుముందు రోజు రాత్రి పాటలు పాడిన దండోరా హైద్రాబాదు అన్నలతో సహా.
డబ్బులన్నీ జమచేసి, బొంగుపేలాలు, బాంబులుకొని, బుక్కాయి చల్లుకుంటూ పీతిగొద్దెలు  తొక్కకుండా డొంకలో గడ్డి దోవెమ్మటి బొందలగడ్డకి పోయినాం. దండోరన్నలు చాల సేపు మాట్లాడి, ఎయ్యయ్యో పాటలు పాడారు. మా పొట్ట అయ్యగారు పార్దన చేసి అందరికంటే ముందు మూడంటే మూడుసార్లు మట్టేసారు. మా బామ్మర్ది గోపిగాడు, నేను మాత్రం పోటీపడి, పదిసార్లదాకా మట్టేసాం ఎవరికీ తెలియకుండా.
ఆ రోజు నెత్తిమీదకు ఎండొచ్చేదాకా బువ్వతినకపోయేసరికి, పాకలోకి పొయ్యి చూస్తే, అన్నం తపెలా, కూర సట్టే ఖాలిగా వెక్కిరించాయి. నీ యమ్మో నాకు ఆకలెత్తుందని కల్లెపు మీదబడి పొర్లుతుంటే, మా అమ్మమ్మోచ్చి నిక్కరుబొంది పట్టుకొని పైకి లేపింది.
“ఎవరైనా సచ్చిపోయినపుడు బువ్వ తింటే, ఆ సాతానొచ్చి తీస్కపోతాడు రా. అందుకే, గూడెంలో ఎవరు మాటేల వరకు అన్నం వండుకోరు రా” అని, వీపుకంటిన పేడనంతటిని దులిపింది. అప్పటిసంది ఇప్పటిదాకా నా చుట్టుపక్కల్లో ఎవరైనా చనిపొతే, నాకు అన్నం తినబుద్దికాదసలు.
మా గూడెం చేరుకున్నామో లేదో కిట్టమాయ్య బండిమీదనుండి దూకి, పొగాకును తుపుక్కుమంటూ ఊసి “ఏం బదుకులో ఏందో? పుట్టిందగ్గర్నుంచి ఊడిగం చేయడమే. ఆకరుకు ,సచ్చిపోయిన మనిషిని పెశాంతంగా బొందకుండా పెట్టుకోలేకపోయిన బ్రదుకులాయే” అని, నీళ్ళు పుక్కిలిస్తున్నాడు.
రేప్పొద్దున గోల్కొండకైనా బోనకల్ వెళ్లి పోవాలనుకొని, బయట శబ్దాలేవి వినిపియ్యకుండా, దుప్పటితో రెండు చెవులను గట్టిగా మూసుకున్నా. పొద్ద్దున్నే, గోపిగాడు ఊరిచివర చెరువుదగ్గరకొచ్చాడు. ఆటో ఎక్కి వాడిని ఇంటికి వెళ్లిపొమ్మన్నాను నిన్నటి బరువు జ్ఞాపకాలు నాతో తీసుకెళ్లేంత శక్తిలేక. సాయంత్రం ఆరింటికి హాస్టల్ కి చేరుకొని, సోయలేకుండా నిద్రపొయ్యా.
ఈ మాయదారి కోర్సులో జాయినయ్యి, ఒక సంవత్సరం అయినా, ఇంగిలీసుతో ఇంకా కుస్తీలు పడుతూనే ఉన్నా. ఇంటి దగ్గరనుండి వచ్చిన తర్వాత కోర్స్ వర్కులో పడి ఒక నెల రోజులు ఎలా గడిచాయో గుర్తు లేదు.
ఇంటిదగ్గరనుండి వచ్చిన కొత్తలో, నా దిగులంతా ఎవరికి చెప్పిన అర్ధం చేసుకోలేరన్న బాధతో, రాత్రి మెస్ లో అన్నం తిన్న తర్వాత ఒక్కడినే రోడ్లన్నీ నా మాటలతో నింపుకుంటూ నడచేవాడిని. ఓ ఆదివారం రాత్రి, నా గరుకు గొంతుతో ఎదో పాత పాడుకుంటూ బఫెల్లో లేక్ దగ్గరికి వెళుతుంటే, చీకట్లో ఎవరో నీళ్లలో బుటక్ , బుటక్ మని, గులకరాళ్లేస్తున్నారు.
జులపాలు చూసి తెలుగోడు కాదనుకొని, “కోన్ రే” అని నాకొచ్చిన ఇందీలో కేకేసా.
రాళ్లు పక్కన పడేసి, పేంటు అడ్డ దిడ్డంగా మడతలేసి ట్యూబులైట్ వెలుగులోకి వచ్చాడు.
“వాట్ ఆర్ యూ డూయింగ్ అలోన్, మ్యాన్” అని నేను అడగాల్సిన ప్రశ్నని, నన్నే అడిగి జీను పేంటు జేబులోంచి ఫోను తీసుకోని టయిము చూసుకుంటున్నాడు.
“ఐయామ్ లిజనింగ్ సాంగ్సు, వాకింగ్” అని ముక్తసరిగా బదులిచ్చి, ఇంకేదైనా అడిగితె ఇంగిలీషు పదాల కోసం వెతుక్కోవాలని, గిర్రున వెనక్కి తిరిగి హాస్టల్ కేసి పరుగులాంటి నడక మొదలెట్టా. రెండు నిముషాల తరువాత వెనకాలే పరుగెత్తుకుంటూ వచ్చి, ఎక్కడ ఉంటావ్ అని అడిగితె, “హెచ్ హాస్టల్” అని చెప్పి నిల్చుండిపోయాను.
ఉరుకులాంటి నడకతో రెండు అడుగులువేసి, నేను పక్కన లేనని రియలైజ్ అయ్యి, వెనక్కిదిరిగి చూసి ఏమైందన్నాడు. ఏమిలేదని ఎంచక్కా భుజాలెగిరిసి, ఈ సరి ఇంగిలీసులో ఏమడగాలా అని నోట్లో అనుకుంటున్నాను.
“ఐయామ్ రజనీష్, ఇంగ్లీష్ డెప్ట్. వాట్స్ యువర్స్, మ్యాన్” అని, చేయిజాపాడు.
పేంటు జోబులో దోపుకున్న చెయ్యిని బయటకు తీసి, “చైతన్యా, ఫిలాసఫీ” అని రెండు, మూడు సార్లు చెయ్యి,పైకి కిందకి ఊపా.
రెండు క్షణాల మౌనం తరువాత ఎదో గుర్తుకు వచ్చి, ఓషో అసలు పేరు రజనీషే కదా అని అడిగితె, “ యా మ్యాన్, బట్ దట్ ఫక్కర్ హ్యాజ్ లాట్ అఫ్ సెక్స్. అయామ్ స్టిల్ ఏ వర్జిన్” అని గట్టిగా నవ్వేసాడు.
ఆ రోజు నుండి, ఈ నెల రోజులు వాడు నాకు ఇంగ్లీష్ నేర్పించడం, నేను వాడికి తెలుగు బూతులు నేర్పడమే పని.
పోయిన సుక్రోరం కలిసినపుడు, ఈ వారం పరీచ్చలు అని చెప్పి, రాత్రి కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని ముభావంగా చెప్పాడు.
ఎందుకంత సైలెంట్ గా ఉంటావ్, నీలాంటి వాళ్ళకోసమే “యూనివర్సిటీ హ్యాజ్ గివెన్ యాక్సిస్ టూ పోర్న్ సైట్స్ ” అని భుజంమీద చెయ్యేసాను.
“దట్స్ వై యువర్ హ్యాండ్స్ ఆర్ స్మెలింగ్ డర్టీ. గో అండ్ వాష్ యువర్ సెల్ఫ్ ముండ ” అని ఎద్దేవా చేశాడు.
సోమవారానికి పెన్నులేకపోతే వాడి బ్యాగ్ లో నుండి ఒకటి దొంగలించా.


x

డెకార్ట్ గురించి ఎదో సొల్లు రాసి, రజనీష్ కి మెస్సేజి పెట్టా ఎప్పుడు కలుద్దామని. బాబు దగ్గరినుండి సాయంత్రమయ్యేదాకా రిప్లయ్ లేకపోతె, నరేష్ గాడితో కలిసి సినిమాకెల్లా.
పనికిమాలిన పాటలు, అనవసరమైన ఫైట్లు మెదడులోని సగం గుజ్జు తిన్నాక, ఉచ్చపోసుకొనిచ్చి కుర్చీలో కూలబడుతుంటే, అరే మళ్ళా ఎవడో హాస్టల్ లో చచ్చిపోయిండటరా అని నరేష్ గాడు చెప్పాడు. రీజనేంటి రా అని అడిగితె, ఎదో ప్రేమ విషయం అయ్యిఉండిద్దిలేరా అని సినిమాలో కళ్ళు బెట్టాడు మళ్ళీ వాడు.
సినిమా బోరుకొట్టి నెట్ ఆన్ చేయగానే, ఎన్నడూ లేని విధంగా వాట్సాప్ లో చాలా మెసేజిలు. ఓపెన్ చేసి చూస్తే, కామన్ గ్రూప్ లో “రిప్, రజనీష్” అని ఒక ముప్పైకిపైగా ఉన్నాయి. ఆ సినిమాహాలు చీకట్లో కళ్ళలో వెలుగు నింపుకొని చుస్తే, “M.A first year Rajanish has committed suicide” అని నోటిఫికేషన్ వచ్చింది.
తర్వాత నేను ఏమేమి చేసానో నాకు నాకు ఒక క్రమ పద్దతిలో గుర్తు లేవు. నరేష్ గాడు నన్ను సౌత్ క్యాంపస్ లో దించేసి, వాడి హాస్టల్ కి వెళ్ళిపోయాడు. ఆ పాటికే, రజనీష్ నీ పోస్ట్ మార్టం కోసం పంపి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు అసలేమీ జరగనట్టుగా.
ఇప్పుడు ఒక్కడినే సౌత్ నుండి నార్త్ వరకు నడుస్తున్నా వాడి మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ. కప్,సాసర్ జంక్షన్ దగ్గర కేకు మొఖానికి పూసుకుంటూ, ఫోమ్ స్ప్రే గాలిలో కొడుతూ, ఎవరో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బైక్ మీద ఎవరో అమ్మాయి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, గట్టిగ వాటేసుకొని చెవిలో ఎదో గుస గుసలు చెప్తుంది. పేరు మోసిన స్టూడెంట్స్ నాయకులు, పంపుసెట్టు బాగుచేశామని, మెస్ ఫుడ్ కోసం ప్రొటెస్ట్ చేశామని FBలో పోస్టు చేస్తున్నారు.
తెల్లారేసరికి నిన్నటిదాకా మనతో ఉన్న ఒక మనిషి ఇవాళ లేడే అనే ఆలోచనే లేకుండా, ఎవరి క్లాసులకు వాళ్ళు పోవడంలో బిజీగా ఉన్నారు. మాయదారి అటెండన్స్ కోసం నేను కూడా క్లాసుకి పోవాల్సివచ్చింది.
రెండు సార్లు బొంద తీసేలా చేసిన వైరావోల్లు, సచ్చిన మనిషిని పక్కనెట్టుకొని సంబరాలు చేసుకుంటున్న యూనివర్సిటీవాళ్ళు ఒక వైపు, ఒక ఇంట్లోని దుఃఖం అందరూ పంచుకోవాలని అని నమ్మే నేను ఎరిగిన గూడెపోల్లు ఇంకొక వైపు, రెండు భిన్నమైన మనుషుల గుంపులుగా, నా బుర్రలోపలి విలువల కాటాలో ఊగుతున్నారు.
వెనకెక్కడో కూర్చున్న నాకు, ప్రొఫెసరు చెప్పేది లోనికి పొవట్లేదు. కిటికీ సువ్వల గుండా బయటకు చూస్తే, బయట కారిడార్ లో ఒక అమ్మాయి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎదురుగా గోడకానుకొని. వాడి దగ్గర తీసుకున్న పెన్నుతో ఇప్పుడు నాకు ఏమి రాయాలనిపించట్లే. నోట్స్ తీసుకోకుండా దిక్కులు చూస్తున్న నన్ను ప్రొఫెసరు నిలబెట్టాడు. ఫోన్ వైబ్రేట్ అవుతుంటే, ఆయన ఏమంటున్నాడో ఏంటో అంతగా పట్టించుకోకుండా బయటకొచ్చేసా.
ఈ టైం లో గోపిగాడేందుకు కాల్ చేస్తున్నాడునుకొని లిఫ్ట్ చేసి సైలెంట్ గా వింటున్నా. “ఓ బావో, మా శారదొదిన ఫోన్ చేసింది పిల్లకు ఏమి పేరు పెడుతున్నారని అడిగింది. కొత్త పేర్లు ఏమైనా చూసినవా” గద్దిచ్చినట్టుగా అడిగాడు.
గొంతులో తడి కనిపెట్టనీయకూడదనుకొని గట్టిగా ఒకసారి దగ్గి “లేదు గోపి ఇంకా. రేపటికల్లా చెప్తాలే ఎదో ఒకటి అని” ఫోన్ పెట్టేయబోతుంటే, బావా … బావా… కట్ చేయకు అన్నాడు.
“అసలు నువ్వు ఇంతకూ ముందు చెప్పిన రెండు పేర్లలో ఒక పేరు వదినకు బాగా నచ్చిందట. వాళ్ళ అమ్మాయికి పెడదామని ఏమి బాలేదని చెప్పిందట. ఇప్పుడు, ఆ పేరే పెట్టమని చెప్తుంది” అని, గట్టి గట్టిగ అరుస్తున్నాడు, సిగ్నల్ లేదనుకుంటా.
“మీ అమ్మాయిని కూడా నేను చూడలేదు కదా రా, ఒకసారి ఫోటో వాట్సాప్ చేయరా” అని అడిగిన వెంటనే మెసేజి రింగ్ స్టోన్ వచ్చింది.
సరిగ్గా నెలరోజుల క్రితం ఈ రెండు చేతుల్తో మోసిన పాపల్లె తోచింది ఈ చిన్నితల్లి కూడా.
స్క్రీన్ ని గట్టిగా ముద్దెట్టుకొని, నాకే తెలియకుండా “స్వేచ్చా గీతికా” అని గట్టిగా అరిచా.
క్లాస్ టయిం అయిపొయింది అనుకుంటా, మా ప్రొఫెసరు డోరు తీసి, నన్ను వింతగా చూసుకుంటూ మెట్లెక్కి వెళ్లిపోయాడు.

Wednesday, 1 August 2018

రెండో ఉత్తరం

డియర్ C ,
ఎలా ఉన్నావ్ రా?


శరత్కాలపు వెన్నెల రాత్రులలో , చిరిగిన మబ్బుల్లోంచి అసంబద్ధంగా ఊడిపడిన నా వెర్రి ఆశల చిరుజల్లులు, నీ  దరి చేరాయో లేదో నాకు తెలియదు. పోనీ, ఆ అలజడుల ఘోష విన్నాక కూడా, కాలపు తిరోగమన క్రమంలో ఏ నక్షత్ర ధూలో నీ లోకాన్ని వదిలి వెళ్ళలేక విడిచిన ఆఖరి వేడి నిట్టూర్పుగా భావించి, వెంటనే ఆ నిశ్వాస ఈదురుగాలుల సెగకి, సగం కూలిపోయిన నీ  ఆశల సౌధం గుర్తొచ్చి, ఓ క్షణం మిన్నుకుండిపోయావేమో అని కూడా నాకు తెలీదు.


కానీ, గడిచిన సంవత్సర కాలపు ఆవర్తనా ప్రకంపనలలో, మిథ్యారేఖ అంచులపై  వ్రేలాడుతున్న నీ ఆనవాళ్ల అనంత బింధువుల గాళ్ళుని, క్షితిజ సమాంతరరేఖపై లంబంగా నిల్చొని అందుకోవాలని ఆత్రపడ్డాను. తీరా, నా చేతికందిన మరుక్షణమే, వేళ్ల కొనలలోనుండి తీతువు పిట్టల్లే జారిపోయిన నీ  రూపాన్ని వెదుక్కుంటూ, మరోక్కసారి నా అంతః కలహాలన్నీ ఈ రెండో ఉత్తరంలో కుమ్మరిస్తున్నాను. ఈ సారి తెగిన గాలిపటాన్ని ఫట్టున విసిరేసిన మొదటి ఉత్తరం మాదిరిలా కాకుండా , ఎండాకాలంలో అకస్మాత్తుగా నల్లటి దూదిపింజల్లా మారే మేఘంలా నున్న ఈ ఉత్తరంవైపు, ఓ నిశ్శబ్ధమైన చూపు చూసి, మరలా నీదైన ధ్యాసలో పడిపోతావని భావిస్తున్నా.C, మొన్నరాత్రి ఎదో పనుండి ఛందానగర్ రైల్వే స్టేషన్ లో దిగాల్సి వచ్చింది. రోజంతా ముక్కిన విలువల ముసుగులు ధరించిన బడలికతో, వగరు మొఖాలను మెడ లో లోపలికి దోపుకుంటూ, అరువుతెచ్చుకున్న గంభీరం కాస్తా  అడుగంటగా మిగిలిన పీలిక గొంతుతో, మర్నాడు వేయాల్సిన ఎత్తుగడలను గొణుక్కుంటూ కాళ్ళీడుస్తున్న ఆదర్శవంతులతో పోటిపడలేక, కాలివంతెన కింద ఉన్న ఇనుప చప్టా మీద కూర్చొని, కుడిచేతిలో ఉన్న తాళంతో ఇనుప దిమ్మ చర్మం మీద పరా పరా రక్కాను.

కొత్తగా బిగించిన ఆ నియాన్ లైట్ల కాంతిలో ఏదో మసగ్గా మెరిసినట్లనిపిస్తే, సరిగ్గా మూడేళ్ళ కింద ఒక చలికాలపు సాయంత్రం మనం వదిలెళ్లిన జ్ఞాపకాల దొంతరల కొస చేతికి తగిలింది. నువ్వు చెప్తే నమ్మవు గానీ, నువ్వా ఆ రోజు పదే పదే  దిద్దిన నీ పేరులోని ఆ దీర్ఘం ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది. నా పేరు తాలూకా జాడలు ఏమైనా కనిపిస్తాయేమోనని వెతికా. పోనీ, నీ పక్కన నేనుండటం చూసి ఓర్వలేని వాళ్ళు, నా మీద అసూయపు సిల్వర్ రంగు వేశారనుకొని, తాళంతో నీ చూట్టూ పక్కల పొరలన్నీ గాడులు పొడిచా. వృథా ప్రయాస వల్ల వేడిగా ఐన నా చేతి వేళ్ళ చమట చారికలు తప్ప, నాదంటూ చెప్పుకోదగ్గ ఏ స్మృతి శకలం నీ  దగ్గర దొరకలేదప్పుడు నాకు.

ఐనా కాల ప్రవాహనీకెదురుగా నిశ్చలంగా ఉండాలనుకోవడం నా పిచ్చితనం కదా, C .

నిన్ను ఎలాగైనా మర్చిపోవాలనే ఇదిలో , నువ్విచ్చిన బులుగు చుక్కల చొక్కా చెరనుంచి నా వంటిని కాపాడుకున్నా. కానీ, హాస్టల్ పక్కనున్న ఆ జిల్లేడు చెట్టుకి ,పీలికల్లా వేలాడుతూ నా అమాయకత్వాన్ని చూసి రోజూ వెక్కిరిస్తూనే ఉంది.

C, మరొకసారి నువ్వెప్పుడైనా కనిపిస్తే నీకు చెప్పాలనుకుంటున్న మాట ఇప్పుడు చెపుతా విను. మళ్ళీ  విన్న తరవాత నవ్వ కూడదు మరి, వీడు ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని నీ కనుబొమ్మల సైగలతో నన్ను వేళాకోళమాడకూడదు మరి. అయితే  కళ్ళు మూసుకో ఒక మారు.

You can’t force someone to love you and coerce them to be with you.

ఈ చిన్న విషయం నాకు బోధపడేలోపే, ఓ రెండు, మూడు సార్లు నా విషపు మాటల నురగ, కోపాద్రేక కుబుసపు ముద్రలు నీ వంటిపై వాలాయి. ఆ నిర్జీవ క్షణాలు ఇప్పుడు  తలచుకుంటే, నువ్వు చెప్తే నమ్మవు కానీ, నన్ను నేను రెండుగా కోసుకోని, ఆ పాత నన్ను ఎక్కడో దూరంగా, డొంక జాలులో పడేయాలనేంత పిచ్చి కోపం వస్తుంది నాకు.

నాకో ఒకొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ వర్షపు చీకట్లో కనిపించని నీటి చారికల సాంద్రతని అందుకోవాలనే ఉబలాటంలో ఇలాంటి హేతుబద్ధ తర్కాలన్నీ వెతుక్కుంటున్నామేనని భయమేస్తుంది.

ఇప్పుడు  నా బ్రదుకు, చరమాంకంలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని మాతృభాషల మల్లే తోస్తుంది నాకు. కాలానుసార మార్పు వలయాలను, కళ్ళు మూసుకుని గెంతకుండా, ఏమి పట్టనట్టు స్తబ్దుగా ఉన్నంత మాత్రాన, పైకెగిరిన అల, ఇసుకులో మిన్నుకుండిన ఆల్చిప్పని మింగేయకుండా ఉంటుందా ఏంటి ?

నీకు నిజం చెప్పాలా C, కొన్ని సార్లు చేస్తున్న పనులన్నింటిని వదిలేసి, నేను ఎవరు యెరుగని ఊరుకి పారిపోవాలనిపిస్తుంది. తీరా, అదే కనుక జరిగితే ఇక్కడ వదిలెళ్లిన అనుభవాలన్నింటిని, ఓ బొంతలో మూట కట్టుకొని వెళ్ళిపో, నేను మనసు మార్చుకొని మరలా వచ్చేలోపల.

ఎవరో తలపు గట్టిగా కొడుతున్నారు, ఫోన్ ఇందాకల నుండి వైబ్రేట్ అవుతూనే ఉంది.
బహుశా, ఈ ఉత్తరం కూడా ఇంకా ఎక్కువ బరువుని మోయలేదేమో మరి.

C , ఇక ఉంటా.

Take Care, my dear.

Tuesday, 17 July 2018

సాయిబోళ్ల పిల్ల

ఈ  కథ సారంగ పక్ష పత్రికలో 15 జూలై ,2018 లో ప్రచురితమైనది. నాటా–సారంగ కథల పోటీలో బహుమతి పొందిన కథ.


మాతాటాకు కప్పు కన్నాల్లోనుంచి అల్లం వాసన వస్తుందంటే , సాయిబుగోరు ఇంటికొచ్చారని నాకిట్టే అర్ధమయ్యేది. బడిలో ఆడిన కబడ్డీ ఆటకు  ఆనవాలుగా ఇసుక నెత్తినుండి చెంపలెంబడి మెల్లగా  జారుతుంటే , వీపుకేసుకున్న యూరియా బడి సంచిలోని మట్టిపలక  గగ్గోలు పెడుతున్నా లెక్కచెయ్యకుండా , గుమికి గుమికిమంటూ, రెండు క్షణాల్లో టీ సట్టి ముందు ముక్కుపెట్టి , దాని వేడి  ఆవిరికి మొఖమంతా చెమటలు పట్టేంతవరకూ తదేకంగా ఆ మరుగుతున్న టీ వైపే  చూస్తూ ఉండేవాడిని . అమ్మా , నాకీరోజు పద్ద గ్లాసులో అల్లం టీ పోయాల అని నేను కేకలు వేస్తుంటే, అది శొంఠి టీ అని సాయుబు గోరు , కాదు అల్లాన్ని ఎండబెట్టి టీలో వేస్తారని అని నేను , ఒక పదినిముషాలు పోట్లాడుకున్నతరువతా , ముక్కుపుటాలెగిరేలా , గుప్పు గుప్పుమని ఊదుకుంటూ టీ తాగేవాళ్ళం. ఎక్కడ నా టీ ముందు అయిపోతుందనే భయంతో , తాగుతున్నట్టు రెండు మూడు మిటకలేసి , సాయిబు గోరి గ్లాసులోంచి ఎంచక్కా టీని  ఆరితేరిన గజదొంగకిమల్లే ఒంపుకునేవాడిని.
నాకు ఊహతెలిసినకాన్నుంచి మా ఇంట్లో మా గూడెపోల్లు తప్ప టీ తాగేది ఒక్క సాయిబుగోరు మాత్రమే. సాయుబుగోరిది, నాన్నది  స్నేహం ఒక 20 యేళ్ళ  నాటిది.
సంపాదించిన పదిరాళ్లు  ముండలకు  తగలేస్తూ, నోరుమెదుపుతుందని రేతిరికాగానే బొక్కలవిసేలా అమ్మని రోజూ  గొడ్డును బాదినట్టు చింత పరకతో సంపుతుంటే, తాగుబోతు నాకొడుకు ఈ పిల్లను ఎక్కడ చంపేస్తాడనే భయంతో , నాన్నమ్మ  ఒక నడిజాముకాడ , సడి సప్పుడు లేకుండా కాలిబాటన అమ్మని పుట్టింట్లో దిగబెట్టింది. వంట్లోకెక్కిన సారాయి కైపు, వయస్సుకాలికి  తగిలిన ఆ మదపుటేదుర్రాయి సురుకు తగ్గగానే, నీ  మొగుడు నీ  కొంగుకాడకే వస్తాడని ధైర్యం  చెప్పి, అమ్మని ఈ ఊర్లో వదిలెల్లింది నానమ్మ.
కాలం వీచిన వేడి గాడ్పులకు జీవమంతా ఇంకిపోయి , తనువంతా నెర్రలు బారినవేళ , ఒక వెర్రి బాగులోడి నవ్వును, ఆ చీకిపోయిన దవడబొక్కలకు అతికించుకొని , తన విషపు మగతనపు గుర్తులను ఆనవాలుగా దాచుకున్న , ఆ కమిలిన దేహపు మనిషికోసం ఈ ఊరికి వలసవచ్చాడు నాన్న , శవం కింద చల్లగా  పారే నెత్తురికిమల్లె .
అదిగో, అనిస్సత్తువ క్షణాన , నాన్నకు ఈ సాయుబుగోరు పరిచయం.
తెల్లారుజామున గుంజలు నరకటం కాన్నుంచి, మాపటేళ తాటాకు అద్దేసి , ఆమర్నాడే కప్పేసి, పందిరి గుంజకాడ , కిరసనాయిల  బుడ్డి వెలుగులో, చియ్య కూర నంజుకునేదాకా వాళ్ళ సావాసం సాగింది. ఎప్పటికైనా నీ  ఇల్లు నేనే కడతానని సాయిబుగోరు, 20 ఏళ్ల యెంబడి   తాపీ మేస్త్రి ఐనా నీకే  గతిలేదని ఇంకా నాకేం  కడతావని సారాయి మత్తులో నాన్న పరాచికాలాడేదాకా వెళ్ళింది వాళ్ళ బంధం.
ఎక్కడో ఊరికి దచ్చినాన ఎంగిలి విస్తరిలా విసిరేసిన మా గుడిసెకి, ఎండాకాలంలోనైనా అడుగంటని నీటికుంటల్లే ఉత్తరానుండే మీ మట్టి కోటకి మనసెలా కుదిరిందని నేనెప్పుడైనా అడిగితే , సిమెంట్ అంటిన చేత్తో నా కర్రిబుగ్గను గిల్లుతూ, గభాలున నన్ను ఒంటి చేత్తో అమాంతం పైకి లేపి , గిర్రున తిప్పి, నేలపై ఆనించినపుడు, పట్టుదొరగక నేను తుళ్ళిపడబోతుంటే, బూడిదంటిన నా రొడ్డచేతిని గట్టిగా పట్టుకొని, ఎప్పుడోకప్పుడు ముక్కలయ్యే ఈ అస్తవ్యస్తపు జీవితానికి ఒక ఆసరానే ఈస్నేహం అని , ఏవేవో పిచ్చి మాటలు చెపుతుండేవాడు సాయిబుగోరు.
బహుశా మా ఇళ్ల మధ్య దూరంవల్లనేమో  గానీ , మేమంతా దగ్గరగా మసులుకున్నా, మా పిలుపులు మాత్రం “సాయిబుగోరు” దగ్గరే ఆగిపోయేది. ఆ దూరంవల్లనేమో ఆయనెప్పుడూ వాళ్ళ పిల్లలను మా ఇంటికి ఎప్పుడూ  తీసుకురాలే.
మబ్బు ముసురుకమ్మి చినుకులు పడితే, సరుకారు కంపపై  ఎండేసిన  నా పూలచొక్కా తడుస్తుందేమోననే భయంతో , మా తొడపాశం కమలాకర్ సార్ ని అడిగి ఇంటికెళ్తుంటే, గుడ్లలో నీళ్లు కుక్కుకుంటూ సాయిబుగోరు, మా కమలాకర్ సారూ బోర్డు మీద లెక్కచేయమన్నప్పుడు నాకు మల్లే , కళ్ళు నేలకేసి గిరాటేసి, నీటకంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు మా గుడిసెలోనుండి. నాన్నేమో  నులకమంచపు తాడు ఒరుచుకుపోగా వంటిమీద ఏర్పడిన అచ్చులెంబడి ఎడమచేతి చూపుడువేలితో వలయాల్లాగా తిప్పుతూ, తాటకూ సూరుకంటిన పొయ్యిమసిలో దేన్నో వెతుకుంటున్నట్లు అనిపించింది. అమ్మోమో, రెండు గ్లాసుల్లో పోసిన టీమీద ఈగలు వాలకుండా , పైటకొంగుతో విసురుతూ, సాయిబుగోరు వెళ్లిన వైపే దిగాలుగా చూస్తూ కుర్చోనిఉంది .
వయస్సుకుమించిన విషయాల్లో తలదూర్చి ఇదివరకిట్టే రెండుమాట్లు ఒళ్ళుసాపు చేసుకున్న తరువాత అబ్బిన జ్ఞానంతో, మారుమాట్లాడకుండా కంపమీదనుండి తీసిన బట్టలన్నీ దండెం మీద వేసి, ఆ సోషలోడి  గోస వినడాకిని ఇదమిత్థంగా బడికెళ్ళా.
మూడురోజుల తరువాత మా చెవిటి ముసల్ది సాయిబోళ్ల  పిల్ల ఎవరో గూడెంకి వచ్చిందట కదరా అని అరిచి చెప్తే గాని తెలియలేనాకు, మాకెదురుగానున్న పాకలో జనం గుమ్మిగూడారని. ఆత్రం ఉండబట్టలేక, ఒక్క ఉదుటున మా కొంపకి, ఎదురు పాకకి సరిహద్దుగానున్న రెగ్గంపను దూకి, ఆ యెముకల గూళ్ళ గుంపుని పక్కకి జరిపే సత్తువలేక, చుట్టూ ఒక తూపు తిరిగి, తాటిచెట్టంతుండే మా చిట్టితాత కాళ్ళెంబడి మా హన్మంతుగాడి పాకలోకి దూరా .
ఆ సంజెళ వెలుగు, మొత్తలదగ్గరున్న గుంపుతో పోట్లాడి చిన్న చిన్నగా, తన సామ్రాజ్యాన్ని పాక అంచులదాకా విస్తరించుకుంటూ పోతుంది. ఆ  వెలుగులో నా కళ్లన్నీ పెద్దవిగా చేసి చూసినా ఆ సాయిబోళ్ల  పిల్ల రూపం సరిగా కనిపించలే. పైగా ఆ పిల్ల పైనుంచి కిందదాకా నల్లని గుడ్డొక్కటే కప్పుకొని, కళ్ళకాడున్న  రెండు బొక్కలగుండా నన్నే చూస్తున్నట్లుంది. ఈ ఎండాకాలంలో సల్లపూట నిక్కరేత్తేనే ఉక్కబోసి వగరుపడుతుంటే , ఈ పిల్లకి ఉక్కెక్కడ పోయట్లేదా అని గొణుక్కుంటూ, ఆ చీకట్లో నిక్కరేవరో గుంజి పరాచికాలు ఆడుతుంటే, వచ్చిన బూతులన్నీ చదువుతూ ఇంటిదారి పట్టాను.
ఆ రాత్రి చింతాచారుతో  అన్నం తాగాక , నాన్న వీపును బర్రా  బర్రా గీకుతూ, గోళ్ళల్లో చిక్కుకున్న నల్లని ఉప్పుని మట్టిని , పళ్లతో పట్టి తీస్తునపుడు గాని తెలియరాలే, ఆ సాయిబోళ్ల  పిల్ల ఎవరోకాదని.
అవా, ఆ పిల్ల మన సాయిబుగోరి పిల్లా  అని నోరెళ్లబెట్టగానే, పిల్లిచెవులు పెట్టి, ఇలాంటి పనికిమాలిన మాటలు వినకపోతే, ఆ లెక్కలసారి పాఠాలువిన్నా , ఆ తొడపాశం బాధ తప్పిద్ది   కదరా అన్న అమ్మ పొగడ్తలు పట్టించుకోకుండా, కుడిచేత్తో నాన్న చెమటకాయలు గీకుతూ, ఎడమచేతిగోళ్లలో చిక్కుకున్న ఉప్పమట్టిని చప్పరిస్తూ తీక్షణంగా నాన్న మాటలు విన్నా.
సాయిబుగోరుకి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయట . పెద్దమ్మాయికి అంతో, ఇంతో కట్నం పెట్టి, బరువు తీర్చేసుకున్నాడు ఒక మూడు సంవత్సరాలకుముందే. ఇక ఈ చిన్నమ్మాయిని  5వ తరగతికే  బడి మాన్పించి , వాళ్ళమ్మ కుట్టు మిషను పనుల్లో సహాయంగా పెట్టాడు. కుండపోతగా వర్షం కురిసి మట్టిల్లులు కూలిపోతేతప్ప, కొత్తిల్లులు కట్టకోవడం గుర్తుకురాని మా వూళ్ళో , సాయిబుగోరుకి పనిదొరకడం కష్టమైపోయుంది. ఊరిచివర చెరువు  గట్టుదగ్గర మిషను కొట్టుపెట్టుకొని, తల్లీకూతుళ్లు బండి లాగిస్తున్నారు. ఎట్టా కుదిరిందో గాని, మా హన్మంతుగాడికి, ఈ చిన్నపిల్లకి జోడీ కుదిరిందట. మా హన్మంతుగాడు ఆటో తోల్తాడు.
మా గూడెంలోనున్న కర్రిమొకాల్లో అంతో, గింతో సక్కగుండేది వాడే. వాడు నాకు బాబాయి వరసైనా, హన్మంతుగాడు, నేను దోస్తులకుమల్లే  ఉంటామని మా అన్నగాడికి కోపం. ఎప్పుడూ  నా మీద, హన్మంతి గాడి మీద పితుర్లు నాన్నకి చెప్పి కొట్టియాళ్ళని చూసేవాడు ఆ వివరంతక్కువగాడు. ఏ మాటకు ఆ మాటకేగాని, మా హన్మంతిగాడికి సోకులు గూడ ఎక్కువే. పైగా నన్ను కూడా ఆ తెల్లటి జిగట పదార్దాలు, ఆ కంపు పౌడర్లు కొట్టుకోమనేవాడు. నా అందం ఎక్కడ పాడవుతుందేమోనని భయంతో అసలు ముట్టుకొనేవాడిని కాను నేను అప్పుడు.
సాయిబుగోరు డబ్బుల్లేక ఈ చిన్న పిల్లను, రెండోపెళ్లి వాడికిచ్చి కానిచ్చేద్దామనుకున్నాడు. ఆ సంబంధం కుదిరిన రాత్రే, మా హన్మంతుగాడు, ఈ పిల్ల పారిపోయి ఎక్కడో పెళ్లి చేసుకున్నారట. ఈ మాట వినగానే నాకు హన్మంతుగాడి మీద మాబాగా కోపం వచ్చేసింది. మా అన్నగాడిమీద పోట్లాడి గుంజుకున్న ముడుసుబొక్క తెల్లటిగుజ్జును, నాకెంతో ఇష్టమైన ఎండుతునకల కూరని వాడికి మిగిల్చి ఇచ్చాకదా , నాకెందుకు వాడి పెళ్లి విషయం చెప్పలేదని తెగ ఇదైపోయా. ఆ రోజుకి అన్నం తినబట్టి సరిపోయుంది కానీ, లేకపోతె ఆ బాధతో ఒక్కమెతుకైనా సహించేదా నాకు.
మత కట్టుబాట్లు కాదని ఒక సూదరోడితో లేచిపోయుందని, సాయిబోళ్లందరూ మా సాయిబుగోరుని వెలివేశారట.
ఎదిగిన మ్రానుని కొమ్మలు నరికితే మ్రానే మాడిపోయినట్టు, సాయిబుగోరు జీవితాలను కూకటివేళ్లతో సహా పెకిళించి  వలసవెళ్లాలా చేశారు  ఊళ్ళోవాళ్ళందరూ సూటి పోటీ మాటలతో.
మనుషుల్లో దాగున్న నిశిరాతిరి సంద్రాలకు, సంఘపు కుటిలనీతి చీకటి గుయ్యారమునకు భయపడి, పశ్చిమానికి సూర్యుడు పారిపోతున్నవేళ, విషాదపునవ్వుతో సాయిబుగోరు మా ఇంటికొచ్చారు. కళ్ళెంబడి ఉబికివస్తున్న నీటిచారికలతోటి నన్ను సైగచేసి దగ్గరకు రమ్మన్నాడు. ఆ కిరసనాయిలు బుడ్డి నీలపు వెలుగులో సాయిబుగోరి ముఖం సగం కాలిన శవమల్లె తోచింది నాకు. ఒడ్డుకువచ్చిన అలకుమల్లే  ఒక నిముషం గంభీరంగామారి, మా అమ్మాయిని ఒకసారి పిలుచుకురావు అని నన్ను ప్రాధేయపడ్డాడు. ఎప్పుడూ  నాతో  పరాచికాలాడే సాయిబుగోరి గొంతు ఇది కాదని నేను అయోమయంగా అమ్మకేసి చూస్తుంటే, ఆయన కుడిచేయి నా వైపు సాచి, నీ  చిన్ని చెయ్యి నాకిప్పుడు “ఆసరా” రా అని తీక్షణంగా నా వైపే చూస్తూన్నాడు. ఆ దీపపు కాంతిలో చాచిన ఆ చెయ్యి నీడ, గుడిసెంతా  వ్యాపించి, మెల్లగా నన్ను బయటకు తోసింది.
పదినిముషాలైనా ఒక్క పలుకు రాకపోయేసరికి, సరిహద్దుగానున్న ఆ రెగ్గంప, తండ్రి కూతుళ్ళ వంక ప్రశ్నర్ధకంగా చూసింది.
నీ దారి నువ్వు చూసుకున్నావ్  కదా, ఇంకా ఆ దొంగ ఏడుపెందుకన్న సాయిబుగోరి మాటకు, ఆ పిల్ల ఏడుపు ఆపింది. ఇంకో రెండు నిముషాల నిశ్శబ్దాన్ని చీకటి తనలో కలిపేసుకున్నాక, సాయిబుగోరు ఎదో గుర్తుకువచ్చినవాడికిమల్లే, వడివడిగా నడచుకుంటూ వెళ్ళిపోయాడు. మూడు రోజులుగా అమ్మ నాన్నలని తలచుకొని ఏడ్చి ఏడ్చి, కళ్లన్నీ లొట్టలుపోగా, అంతరాల్లోదాగున్న వెలుగునంతా ఇప్పుడు  కళ్ళలో ఆ  పిల్ల  నింపుకొని, సాయిబుగోరివెళ్లిన వైపే చూస్తూ నిలబడింది ఒక్కసారైనా వెనుతిరిగి చూస్తాడన్న పిచ్చి ఆశతో.
ఈలోపు ఎవరో పిల్చారని గాభరా పడితే , ముళ్ళు కుచ్చుకుందనుకుంటా, కుంటూ కుంటూ వెళ్ళిపోయింది. ఆ క్షణాన ఎక్కడో ఒక మెరుపు మెఱసి పిడుగు పడింది శాశ్వతంగా తెగిపోయిన బంధానికి ప్రతీకగా.
అదే నే చివరిసారి సాయిబుగోరిని చూడటం. అది మొదలు ఇప్పటివరకు మా సాయిబుగోరి ఊసేలేదు ఊర్లో. ఆ తరువాతిరోజే సాయిబుగోరు ఊరొదిలి వెళ్లారని అమ్మ నాన్నతో చెబుతుంటే విన్నా. తానూ ఒంటరై  వచ్చినపుడు తోడుగా నిలచిన మనిషికి, ఆసరా కాలేకపోయాననే బెంగతో నాన్న మంచం పట్టాడు.
గతకాలపు విపత్తులను, గడ్డుకాలాన్ని, ఈ ప్రకృతి  తనలోనే కలిపేసుకుని, తన్ను తానూ నూతనంగా యే ఏడాది కా యేడాది రూపాంతీకరణం చెందుతుందనుకుంటా. కానీ జీవంఉన్న మనం, ఆ మానిన గాయపు గురుతుల జ్ఞాపకాల దొంతరలను కడదాకా మనవెంట మోసుకొనివెళతాం కదా!
హన్మంతిగాడు  కాస్త బాబాయి అయ్యి, నాకొక సాయిబు పిన్నం దొరికింది. బాబాయి దగ్గరున్న చనువుకొద్దీ, పిన్నం చుట్టూ తిరిగేవాడిని. తన వంటి రంగు చూసి ఎక్కడ తాను నన్ను ముట్టుకుంటే నా కర్రితనపు  చారలు తనపై పడతాయనే భయంతో, తానూ దగ్గరకు తీసుకుంటున్నా, సిగ్గుపడుతూ దూరం, దూరంగా పోయేవాడిని. నీక్కూడా మావోల్ల  పిల్లనొకదాన్ని ముడేస్తానని ఆటపట్టిస్తే, నాకొచ్చే ఆ పిల్లని మసకబారకుండా ఎట్టా ముట్టుకోవాలనే ఊహల్లో తేలిపోయేవాడిని.
గూడెంలో సొంత భూమిఅంటూ ఎవరికీ లేదు కనుక అందరు కమ్మోళ్ల పొలంలో పనులకు వెళ్ళేవాళ్ళు. పిన్నం ఎలాగూ పొలం పనులు ఇదివరకు చేయలేదు కాబట్టి, ఒక మిషను తెచ్చుకొని బట్టలు కుట్టడం మొదలెట్టింది. మిషను గూడెంలో ఉందని ఊళ్ళోవాళ్ళు వచ్చేవాళ్లు కాదు. ఐనా  మా గూడెంలో ఏముంటాయి కుట్టడానికి  నాలుగు పిలకలైన  రవికలు, చింకిపోయిన లుంగీలు తప్ప. ఆ ఏడాది నేను పదో తరగతి. పొద్దున్న స్పెషల్ క్లాసుకి వెళుతున్నప్పుడు మొదలెట్టేది పిన్నం తన పని, మళ్ళా నేను తిరిగి సాయంత్రం వచ్చేదాకా ఎదో ఒక పని చేస్తూనే ఉండేది. అమ్మలక్కలందరు ఆదివారం పెబు యేసు గుడికివెళ్తున్నా , తాను మాత్రం ఆ రోజు కూడా ఎదో ఒక చింపిరిగుడ్డ కుడుతూనే  ఉండేది.
మా హన్మంతిగాడికి  ఇంకా యవ్వనపు ఛాయలు పోలేదు. ఆటో కిరాయిడబ్బులు వాడి ఎచ్చులకు, తిరుగుళ్లకు, ముండలకే సరిపోవడం లేదు. పిన్నం కడుపులో ఒక కాయ పడ్డాక  ఇక తన వంటి తోపని అయిపోయందని, తనని పట్టించుకోవడమే మరచిపోయాడు. ఇల్లుగడవకపోతే, తనకు చేతకాని వరికోతకి , మిరపతోటకి కూడా వెళ్ళింది గర్భిణీ అయ్యుండి కూడా పిన్నం.
తొలిచూరి కాన్పు అమ్మవాళ్ల ఇంట్లో జరగాలిరా అని నాకు చెప్పి ఏడుస్తుంటే, మా అమ్మకి చెప్పిన. మా ఇంటికి తీసుకుపోతా పదా పిన్ని అని అని నే చెప్పినపుడు, రెక్కాడితే గాని డొక్కాడని మా స్థితి తెలిసి, నవ్వుతూ వద్దులేరా మీకెందుకు ఆ కష్టం అని చెప్పింది. నా ఇంటర్ లో అనుకుంట తనకి ఒక బాబు పుట్టాడు. వాడే లోకంగా అప్పటి నుండి ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలెట్టింది పిన్నం.
ఇంట్లో గడవని విషయం, పండక్కోచ్చిన వదినలకు తెలియకుండా, తానూ దాచుకున్న మిషను డబ్బుల్లోంచి కొంత దీసి , వదినమ్మలకు చీరలు పెట్టింది, ఎప్పుడు ముట్టుకోని గొడ్డుమాంసాన్ని కడిగి, కూర చేసి పెట్టింది ఇంటిల్లిపాదికి.
కట్నమేమి తీసుకురాలేదని అత్తా సూటిపోటి మాటలను తన నవ్వులోనే కలిపేసుకొనేది. కాలు విరిగి అత్తా మంచాన పడితే, బువ్వ కాన్నుంచి, అత్త పీతురు  గుడ్డలు ఉతికి, చంటి బిడ్డల్లే సాకింది. మామ చీపుర్లు అల్లిపెడితే, వాటినమ్మి పదో పరకో సంసారానికి వాడేది.
డిగ్రీ చదవడానికి నేను హైద్రాబాద్ వచ్చిన ఈ మూడు సంవత్సరాలకాలంలో పిన్నంతో కలిసి మాట్లాడింది చాలా తక్కువ. వయస్సు పెరిగేకొద్దీ చనువు తక్కువయిద్దో లేక బంధాలు బలహీన పడతాయో నాకు తెలియదు కానీ, పిన్నం గుర్తొచ్చినప్పుడల్లా నాకు నేను ఒక దోషిలా కనపడేవాడిని. తన ఊసులు, గోడు, భాదలు, ఇష్టాలు చెప్పుకోవడానికి తనకంటూ ఎవరు గూడెంలో లేరు కదా అని బాధపడేవాడిని.
మొన్నరేతిరి ఇంటికి ఫోన్ చేస్తే అమ్మ చెప్పింది, పిన్నం ఇప్పడు  కడుపుతో ఉందని. పోయినేడాదికూడా ఇలాగే కడుపుతో ఉన్నప్పుడు వరిపొలం గెనం  మీద కాలుజారి పడితే, గర్భం తీసేశారట. డాక్టర్లేమో రెండు నెలలు మంచం దిగకూడదు అని చెప్తే, నాతోనే పనులన్నీ చేయించుకుంటున్నావటే,  ఓ లంజముండా అని అత్త అనరాని మాటలు అంటుంటే, రెండోవారానికే వరినూర్పులకి పోయిందట  పిన్ని.
కులం కానీ కులం, మతం కానీ మతం  వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి, పిన్ని ఎన్ని కష్టాలు పడుతుందో .
ఇంటికొచ్చిన మరుక్షణమే పిన్నం ని చూడటానికి పరుగెత్తుకెళ్లా. వాన చినుకులు తెరలు, తెరలుగా పడుతుంటే, తనలో తానేదో గొణుక్కుంటూ దండమ్మీద ఆరేసిన బట్టలు తీస్తుంది పిన్నం. ఆ మిషను మీద ఎడతెరపిలేకుండా వంగోని కుట్టటంవల్లనేమో లేక మోయలేనంత బరువు మీద పడిపోవడం వల్లనేమో గాని, గూని వచ్చినట్టుంది పిన్నం కి.  చిన్నగా కుంటూ, కుంటూ ఇంటిలోకి వెళ్తున్న పిన్నం ని చూస్తుంటే, ఐదు సంవత్సరాలక్రితం ఆ నల్లగుడ్డ పరదా వెనుకాల, బిక్కు బిక్కుమంటూ, కన్నార్పకుండా నన్ను చూసిన మనిషేనా ఈ మనిషి అనిపించింది నాకు.
ఎదో గుర్తుకు వచ్చినట్టు  వెనుతిరిగి చూడగానే, నేను కనిపించిందే  తడవు, నల్లకప్పేసిన  ఆ మోహంలోని కనుగుడ్లన్నీ ఇంత  పెద్దవిగా చేసి, సాయిబుగోరిమల్లె దగ్గరికి రమ్మని సైగ చేసి, నా చింపిరి జుట్టుని ఎగాదిగా చూసి, మా “సాయిబోళ్ల పిల్ల” ఉంది, పెళ్లి చేసుకుంటావా అని ఒక్క సారిగా గుండెలనిండా నవ్వింది.
ఆనవ్వులో గడిచిన ఐదారేళ్ళ తన జ్ఞాపకాలు, ఒక్కొక్కటై నా ఒడిలోకి చేరుతున్నాయి.

Saturday, 16 June 2018

సమ్మోహనం సినిమాపై కొన్ని ఆలోచనలు- Some Thoughts On Sammohanam


This is not a movie review at all. These are just my incipient understanding/observation of the film as such.


There is a faintish kind of embarrassing smile on Sameera’s face when Vijay asks her to “go away” from his home and eventually from his life too in front of his mother. We see her uncontrollable affection towards Vijay in her eyes and there is also an “internal emotional turmoil” inside her which kind of reflected in her demeanour and yet she doesn’t want to pour her heart to Vijay to explain what was actually happened. She holds back her emotions so gracefully that one would feel Vijay’s mother words about “accepting rejection” are metamorphosed into the Sameera’s faint smile.

Perhaps, this fraction of seconds of the frame defines the soul of the Sammohanam. There is a complex emotion behind this tiny smile yet the way in which it played out is so harmonic that one would feel it is as natural as a kid “longing” for a star in the faraway sky. And this marks Indraganti not only as a good writer but also as someone who can present the complex emotions in a simpler manner. This is evident in his most of the films given the fact that his films only have linear narratives. One of the difficult jobs of any artist is to present her art as simple as possible. Perhaps, to “be simple” is too complex. And to present these multitudinous mysterious emotions of a person in such a minimalistic manner (in that faint smile) is the biggest achievement for Indraganti as an artist.

సమీరా మోముపై లీలగా తచ్చాడూతూ క్షణభంగురంలో మాయమయ్యే ఆ నవ్వులో, తన ఊసులు, ఆకాంక్షలు మరియు తన అంతరంగిక మనసుని ఎరిగిన విజయ్ కి తన ప్రేమను వ్యక్తపరచాలనే ఉబలాటం, అదే క్షణంలో తన అంతః సంఘర్షణల వెగటు గాడ్పుల తీవ్రతని తన దరికి  చేర్చాలా వద్దా అనే ఊగిసలాట, ఇక ముందు విజయ్ తన జీవితంలో ఉండబోడేమోననే అనే తలంపు తెచ్చిన తానూ మునుపెన్నడూ భరించలేని బాధను లో లోపల దాచాలనే ఆత్రం ఉంది. వీటినన్నింటిని మించి విజయ్ వెళ్లిపొమ్మన్న మాటకు, లోపలనుండి ఉబికివస్తున్న కన్నీళ్ల విరహ ప్రవాహం, ఎక్కడ తన ఆత్మ గౌరవాన్ని నవ్వుల పాలేయ్యాలా చేస్తుందో అని ఎంత సావధానంగా ఆ నవ్వులో తన అర్ధతని దాచుకున్నా తీరు ఎంత సమ్మోహనంగా ఉందో. ఇంతటి హావభావాలను ఒక నటిలో కనిపించేలా చేశాడు  అంటే అది ఆ దర్శకుడి ప్రతిభకి ఒక నిదర్శనం.In addition, I was wondered by the way in which the director has used costume colour to represent the inner anxieties/attributes of a character. In the balcony scene, where a heartfelt conversation happens between Vijay and Sameera, Vijay was seen wearing a white kurta-pyjama, reflecting his serene and idealistic attitude, whereas Sameera was seen wearing a black dress printed with a lot of colourful flowers, reflecting her complex yet mature understanding. When she says “no” to him, then he was seen wearing more of dark colours in the rest of scenes like dark red (represents turbulence in his mind), black (represents as if his life is gazing at a meaningless abyss) and towards the pre-climax where he went to see Sameera in the hospital, he was wearing a darkish blue shirt (a sense of reconciliation with the reality, a sense of acceptance). In the climax, there is this blue suit, which kind of explain that he found the love of his life and joy.

Interestingly, Sameera character has always had colourful dresses which kind of makes her a mysterious person yet a complex human being. Sameera’s ethereal beautiful face was shown in such a way that I felt her vulnerability and belongingness for a beloved one was thrusting forth from her face.
In general, our Telugu cinema has this habit of giving “messages” out of nowhere. This preaching business might earn some brownie points to the appreciation of the film. However, most of the times these messages sound as giving “public lectures”.
Now, look at how beautifully the scene was played out between Vijay and his mother about “accepting rejections” in life. It doesn’t come off as a lecturing audience, but it comes as a part of her character (she narrates how she was rejected by his senior in her college days) and it makes the audience to feel more for her character.

చివర్లో వచ్చిన ఆ నక్షత్రం metaphor కూడా కథలో ఎంతో ఆకర్షణీయంగా  అబ్బింది. నిష్కల్మషమైన ఆ లేత ప్రాయంలో ఎవరుంటారు చెప్పండి ఆ చుక్కలని ఇష్టపడని వారు. అంతే ఇదిగా, అంతే తీవ్రంగా, ఒకరిని ఒకరు ఇష్టపడటం అంటే ఒకరి ఇష్టాలను ఇంకొకరు గౌరవించడం. ఇది వదిలిపెట్టి ప్రేమంటే, ఒకరు ఇంకొకరికోసం తమ ఇష్టాలను, కోరికలను, తమ జీవితాలనే త్యాగాలు  చేయాలనే ఒక వెర్రి ప్రేమ కథ ఇది కాదు. ఇద్దరి భావాల మధ్యనున్న భేదాలను హుందాగా ఒప్పుకొని, ఒకరి పర్సనల్ space ని మరొకరు హరించకపోవడమే ప్రేమ అని ఈ కథ తెలుపుతుంది.


I liked the music very much and I felt like mouthing the lyrics for the very first time while watching a Telugu film. I liked the background music too and how it was edited in the final cut. There is a particular scene where Vijay’s friend talking about how he always wanted to create a gossip website. In this scene, the moment the visual is cut to the hero’s home, his friend's voice is also smoothly dissolved into the newer frame as if we are hearing the echo of his voice in Vijay’s home. It seems Vivek Sagar has made a special music theme for Naresh’s character, which was in perfect sync with his hilarious punch lines. But, I felt the same theme music has downplayed the Naresh’s emotion in some scenes especially in the scene where he realises how he was being cheated by the movie makers. What he says in that particular scene was coming from his experience and the dialogue and the emotion have something significant to say. However, instead of lending a sympathetic ear to the character, the audience were seen burst into laughter even in this scene because of the theme music.

I felt the tiff between Vijay and his sister is a bit staged and the emotions that are carried out in this scene seems somewhat forceful. In addition, the sister’s dialogue comes off not as a part of the character itself, unlike the mother’s one. డైరెక్టర్ తనకు చెప్పాలనుకున్న భావాలను ఇలా ఈ పాత్ర నోటితో అసంబద్ధంగా చెప్పించడానికే, ఈ సన్నివేశాన్ని stage చేశాడేమో అనిపించింది. ఆ చెల్లెలి చెప్పిన పెద్ద పెద్ద మాటలు తన జీవిత అనుభవంనుండి కాక వెనక నుండి ఎవరో గొంతునులిమి ఇబ్బందిగా చెప్పించినట్టుగా అనిపించాయి. The director could have done this scene in a nuanced way.

And interestingly the movie talks about what is “being a man” or what is manliness as such. The mother character says “ To be a man is to accept the rejections gracefully”. In the films like “Bharat Anu Nenu”, the same subject matter was discussed. Interestingly, in both the films, it was the mother's character, who defines this notion of manliness. While in “Bharat…”, the notion of manliness still hinges onto the patriarchal overtones, whereas in this movie, the director seems to infuse this notion if not with effeminate characteristics but with some humane emotions. However, just like the earlier film, this film also seems to believe that there is something called ‘manliness’, which is natural to human beings. Instead of deconstructing this very notion of socially constructed phenomena, Indraganti takes a route to affirm this existence cultural myth but with a slight modification. Perhaps, he might be thought that the Telugu culture is not open enough to receive this radical idea so that he is merely redefining/refashioning it to serve to the commoners.

ఆ మేడ మీద విజయ్ చెప్పిన సంభాషణలు  బాగున్నాయి. ముఖ్యంగా తన దృష్టిలొ ప్రేమ అంటే ఏమిటో చెప్పడానికి తన తాత జీవితం ఉదహరించడం వలన, తన కోరుకుంటున్న  ప్రేమ కేవలం ఊహాజనితం కాదు అని (There by saying he is not an idealist), తన తాత నానమ్మల ప్రేమ అలాంటిదే అని చెప్పి, తాను కూడా ఎదో ఒక రోజు  అలాంటి ప్రేమని పొందుతాడని చెప్తాడు (There by he marks himself as a realist).

ఇంతవరకు నాకు బాగానే నచ్చింది. కానీ, నాకు ఈ సన్నివేశం అంతరార్ధం నాకు ఏమనిపించింది అంటే, ఈ విజయ్ అనే మనిషి, చాలా సినిమాలో కనిపించే మనుషులకి మల్లే  ఒక “నిజమైన ప్రేమ” (True Love )అనే బ్రహ్మ పదార్థం ఒకటంటూ ఈ లోకంలో ఉందని, అది దొరికే వరకు చెట్లు, పుట్టలు వెతుక్కుంటూ ఉండాలని (ఇంకా నయం ఈ విజయ్ కూడా అలాంటి పనులు ఎక్కడ చేస్తాడేమోనని హడలి చచ్చానునుకోండి) నమ్మినట్టు కనిపించాడు నాకు.

This idea of “True Love” is one of the “tropes” that keeps repeating on the silver screen in form or in another. I feel this very conception of true love (One soul-mate) is a chimaera and this in a way has worked as an oppressive tool to restrict women body and their sexuality in the history. This one-to-one relation places more restrictions on women because this very conception was defined by men and it has patriarchal overtones associated with it.

However, these small things can be overlooked given things that this film has achieved.And lastly a funny observation- In the trailer, Nandu says “ఈ టైపు అమ్మాయిలు అంత dependable  కాదు బాస్ (Hey boss, these heroines are not dependable at all)”. I thought this dialogue can accentuate the conflict between Vijay and Sameera. But, this scene didn’t make it to the final cut.

సాయిబోళ్ల పిల్ల

ఈ  కథ సారంగ పక్ష పత్రికలో 15 జూలై ,2018 లో ప్రచురితమైనది. నాటా–సారంగ కథల పోటీలో బహుమతి పొందిన కథ.   మా తాటాకు కప్పు కన్నాల్లోను...