Tuesday 17 July 2018

సాయిబోళ్ల పిల్ల

సాయిబోళ్ల పిల్ల

మా తాటాకు కప్పు కన్నాల్లోనుంచి అల్లం వాసన వస్తుందంటే, సాయిబుగోరు ఇంటికొచ్చారని నాకిట్టే అర్ధమయ్యేది. చెంపలెంబడి కారుతున్న ఇసుక కబడ్డీ ఆనవాళ్ళని, వీపుకేసుకున్న యూరియా బడిసంచిలోని మట్టిపలక కేకలను ఎడంచెవినెట్టి, గుమికి గుమికిమంటూ ఇంటికి పొయ్యేవాడిని.  పొయ్యిమీదున్న సట్టి ముందు ముక్కుపెట్టి, వేడిఆవిరికి మొఖమంతా చెమటలు పట్టేంతవరకూ ఉండటం ఇష్టం. “అమా, నాకీరోజు పద్ద గ్లాసులో అల్లం టీ పోయాల” అనే నా కేకకి, “అది శొంఠి కాపీ” అనే సాయుబు గోరు నవ్వు జతకలిసేది. టీ పోసిందే అదునుగా, గుప్పు గుప్పుమని ఊదుకుంటూ తాగేవాళ్ళం. ఎక్కడ నాది ముందే అయిపోతుందనే భయంతో, తాగుతున్నట్టు రెండు మూడు మిటకలేసి, సాయిబు గోరి గ్లాసులోంచి ఎంచక్కా టీని ఆరితేరిన గజదొంగకిమల్లే ఒంపుకునేవాడిని చాలాసార్లు. 

నాకు ఊహతెలిసినకాన్నుంచి మా ఇంట్లో మా గూడెపోల్లు తప్ప టీ తాగేది ఒక్క సాయిబుగోరు మాత్రమే. ఆయనది, నాన్నది స్నేహం ఒక 20 యేళ్ళ నాటిది.

సంపాదించిన పదిరాళ్లు ముండలకు తగలేస్తూ, నోరుమెదుపుతోందని రేతిరికాగానే బొక్కలవిసేలా అమ్మని గొడ్డును బాదినట్టు కొట్టేవాడట నాన్న. ‘తాగుబోతు నాకొడుకు ఈ పిల్లను ఎక్కడ చంపేస్తాడనే భయంతో’, నాన్నమ్మ  ఒక నడిజాముకాడ సడీ సప్పుడు లేకుండా కాలిబాటన అమ్మని పుట్టింట్లో దిగబెట్టిందట. “వంట్లోకెక్కిన సారాయి నిషా, నెత్తికెక్కిన ఆ మదం తగ్గగానే, నీ మొగుడు నీ కొంగుకాడకి వస్తాడే పిచ్చిదానా” అని అమ్మకి ధైర్యం చెప్పి, ఈ ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిందట.

కాలం వీచిన వేడి గాడ్పులకు జీవమంతా ఇంకిపోయి, కొన్నాళ్లకే వళ్ళంతా నెర్రలు బారిపొయ్యింది. వెర్రి బాగులోడి నవ్వొకటి ఆ చీకిపోయిన దవడబొక్కలకు అతికించుకొని, కొద్ది కాలం జీవితాన్ని నెట్టుకొచ్చాడు ఒంటరిగా. విలువ తెలిసొచ్చిన తరువాత, తన ‘విషపు మగతనపు గుర్తులను’ ఆనవాలుగా దాచుకున్న  కమిలిన దేహపు మనిషికోసం, ఈ ఊరికి వలసవచ్చాడు నాన్న, శవం కింద చల్లగా పారే నెత్తురికిమల్లె . 

అదిగో, ఆ నిస్సత్తువ క్షణాన, నాన్నకు ఈ సాయుబుగోరు పరిచయం.

తెల్లారుజామున గుంజలు నరకటం కాన్నుంచి, మాపటేళ తాటాకు అద్దేసి ఇల్లు కప్పేసేదాకా సావాసం సాగింది. పందిరి గుంజ కింద కిరసనాయిలు బుడ్డి వెలుగులో సారా తాగుతూ, చియ్య కూర నంజుకుంటూ “ఎప్పటికైనా నీ  ఇల్లు నేనే కడతానని” సాయిబుగోరు, “20 ఏళ్ల యెంబడి తాపీ మేస్త్రి ఐనా నీకే సొంతిల్లు గతిలేదు, ఇంకా నాకేం కడతావ్ నువ్వు?” అని నాన్న, ఒకళ్ళనొకళ్ళు పరాచికాలాడేదాకా వెళ్ళింది వాళ్ళ బంధం.


“ఎక్కడో ఊరికి దచ్చినాన ఎంగిలి విస్తరిలా విసిరేసిన మా గుడిసెకి, ఎండాకాలంలోనైనా అడుగంటని నీటికుంటల్లే ఉత్తరానుండే మీ మట్టి కోటకి మనసెలా కుదిరిందని” నేనడిగినపుడు , సిమెంట్ అంటిన చేత్తో నా కర్రిబుగ్గను గిల్లి, గభాలున నన్ను ఒంటి చేత్తో అమాంతం పైకి లేపాడు. గిర్రున తిప్పి, నేలపై దింపినపుడు పట్టుదొరగక నేను తుళ్ళిపడబోతుంటే, బూడిదంటిన నా రొడ్డచేతిని గట్టిగా పట్టుకొని నాకర్ధంకాని  మాటొకటి చెప్పాడు- “ఎప్పుడోకప్పుడు ముక్కలయ్యే ఈ అడ్డగోలు జీవితానికి ఒక ఆసరానే మా స్నేహం”.

బహుశా మా ఇళ్ల మధ్య దూరంవల్లనేమో గానీ, మేమంత దగ్గరగా మసులుకున్నా, మా పిలుపులు మాత్రం “సాయిబుగోరు” దగ్గరే ఆగిపోయేవి. ఆ దూరంవల్లనేమోగాని, ఆయనెపుడు వాళ్ళ పిల్లలను మా ఇంటికి  తీసుకురాలే.

‘వానొత్తే గుడ్డలుతీసి లోపలెయ్యమని చెప్పి’ అమ్మ పనికి పొయ్యింది. చిన్నబడికి, గూడేనికి దూరంఎంతంటే, ఓ రెండు పాటలు స్పీడుగా పాడుకునెంత. మా తొడపాశం కమలాకర్ సార్ పాఠం చెప్తుంటే, “డాం...” అని ఉరిమింది. వానెక్కువయితే సరుకారు కంపపై  ఎండేసిన పూలచొక్కా తడుస్తుందని ఇంటికి ఉరికా. గుడ్లలో నీళ్లు కుక్కుకుంటూ సాయిబుగోరు, కళ్ళు నేలకి గిరాటేసి బయటికి పోతున్నాడు మా గుడిసెలోనుంచి. అమ్మోళ్ళు ఇంట్లోనే ఉన్నట్టున్నారు, అయినా బట్టలు తీయలేదని కోపమొచ్చింది ఇద్దరిమీదా. నులకమంచపు తాడు ఒరుచుకుని నాన్న వళ్ళంతా ముద్రలు. తాటాకు సూరుకంటిన పొయ్యిమసిలో ఆయన చూపు దేన్నో వెతుక్కుంటున్నట్లు అనిపించింది. గ్లాసుల్లో పోసిన టీమీద ఈగలు వాలకుండా పైటకొంగుతో విసురుకుంటూ, సాయిబుగోరు వెళ్లిన వైపే దిగాలుగా చూస్తూ పై కూర్చోనుంది అమ్మ.

వయస్సుకుమించిన విషయాల్లో తలదూర్చి ఇదివరకిట్టే రెండుమాట్లు ఒళ్ళుసాపు చేసుకున్నా. అప్పుడబ్బిన జ్ఞానంతో, మారుమాట్లాడకుండా కంపమీదనుండి తీసిన బట్టలన్నీ దండెం మీద వేసి, ఆ సోషలోడి  గోస వినడానికి మూలుగుతూ బడికెళ్ళా.

మూడురోజుల తరువాత మా చెవిటి ముసల్ది “సాయిబోళ్ల  పిల్లెవరో గూడెంకి వచ్చిందట కదరా” అని అరిచింది. మాకెదురుగానున్న పాకలో జనం గుమిగూడారని గమనించలేదు. ఆత్రం ఉండబట్టలేక, ఒక్క ఉదుటున మా కొంపకి, ఎదురు పాకకి మధ్య ఉన్న రెగ్గంపను దూకా. ఎముకల గూళ్ళ గుంపుని పక్కకి జరిపే సత్తువలేక, చుట్టూ ఒక తూపు తిరిగి, తాటిచెట్టంతుండే మా చిట్టితాత కాళ్ళెంబడి మా హన్మంతుగాడి పాకలోకి దూరా .

ఆ సంజెళ వెలుగు, మొత్తలదగ్గరున్న ఆకారాలతో పోట్లాడి చిన్న చిన్నగా, తన ఉనికిని పాక అంచులదాకా విస్తరించుకుంటూ పోతుంది. ఆ వెలుగులో నా కళ్లన్నీ పెద్దవిగా చేసి చూసినా ఆ మనిషి  రూపం సరిగా కనిపించట్లేదు. పైగా ఆ పిల్ల పైనుంచి కిందదాకా నల్లని గుడ్డొక్కటే కప్పుకొని ఉంది. కళ్ళకాడున్న రెండు బొక్కలగుండా నన్నే చూస్తున్నట్టనిపించింది. 'ఈ ఎండాకాలంలో సల్లపూట నిక్కరేత్తేనే ఉక్కబోసి వగరుపడుతుంటే, ఈ మనిషికి ఉక్కెక్కడ పోయట్లేదా’ అని గొణుక్కుంటూ తిరిగొస్తున్నా. పందిరి చీకట్లో నిక్కరెవరో గుంజి పరాచికాలు ఆడుతుంటే, వచ్చిన బూతులన్నీ వాళ్ళమీదకి ఇసిరేస్తూ ఇంటిబాట పట్టా. 

ఆ రాత్రి చింతచారుతో  అన్నం తిని, నాన్న వీపును బర్రా  బర్రా గోకుతున్నా. గోళ్ళల్లో చిక్కుకున్న నల్లని ఉప్పుమట్టిని పళ్లతో పట్టి తీస్తున్నపుడు, ఆ పిల్లెవరో బలుబువెలిగింది నాకు.

“అమా , ఆ పిల్ల మన సాయిబోరి పిల్లా”  అని నోరెళ్లబెట్టా. “పిల్లిచెవులు పెట్టి, ఇలాంటి పనికిమాలిన మాటలు వినకపోతే, ఆ లెక్కలసారి పాఠాలువిన్నా ఆ తొడపాశం బాధ తప్పిద్ది   కదరా” అని నా తెలివిని పొగుడుతుంది అమ్మ. ఉప్పుబస్తాయెక్కి ముందుకి వెనక్కి ఊగుతూ, “నీయమ్మ నానో చెప్పవే ఎవరో ఆ పిల్ల” అని గారాబం పోయినా లాభంలేకపోయింది. “చెప్పకపోతే నీ వంటిమీద చెమటకాయలు గీకను పో ఇక” అని బెదిరించేసరికి దారికొచ్చాడు. 

సాయిబుగోరుకి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయట. పెద్దమ్మాయికి అంతో, ఇంతో కట్నం పెట్టి, బరువు తీర్చేసుకున్నాడట ఎప్పుడో. మట్టిల్లులు కూలిపోతేతప్ప, కొత్తిల్లులు కట్టుకోవడం గుర్తుకురాని మావూళ్ళో, సాయిబుగోరుకి పనిదొరకడం కష్టమైపోయుందట. అప్పటినుండి ఇల్లు గడవక, ఈ చిన్నమ్మాయిని  5వ తరగతికే బడి మాన్పించాడట. వాళ్ళమ్మ కుట్టు మిషను పనుల్లో సహాయంగా ఉండేదట ఈ పిల్ల. ఊరి చివర చెరువుగట్టు దగ్గర మిషను కొట్టు పెట్టుకొని, తల్లీకూతుళ్లు బండి లాగిస్తున్నారు. ఎట్టా కుదిరిందో గాని, మా హన్మంతుగాడికి, ఈ చిన్నపిల్లకి జోడీ కుదిరిందట. మా హన్మంతుగాడు ఆటో తోల్తాడు.

మా గూడెంలోనున్న కర్రిమొకాల్లో అంతో, గింతో సక్కగుండేది వాడే. వాడు నాకు బాబాయి వరసైనా, వాడు నాకు హన్మంతుగాడే. మేమిద్దరం దోస్తులకుమల్లే ఉంటామని మా అన్నగాడికి కోపం. ఎప్పుడూ నా మీద, హన్మంతి గాడి మీద నాన్నకి  పితుర్లు చెప్పి నన్ను కొట్టియ్యాళ్ళని చూసేవాడు ఆ వివరంతక్కువగాడు. ఏ మాట కామాట, మా హన్మంతిగాడికి సోకులు గూడ ఎక్కువే. పైగా నన్ను కూడా ఆ తెల్లటి జిగట కీములు, ఆ కంపు పౌడర్లు రాసుకునేమనేవాడు. నా అందం ఎక్కడ పాడవుతుందేమోనని భయంతో అసలు ముట్టుకొనేవాడిని కాను నేను. 

సాయిబుగోరు డబ్బుల్లేక ఈ చిన్న పిల్లను, రెండోపెళ్లి వాడికిచ్చి కానిచ్చేద్దామనుకున్నాడట. ఆ సంబంధం కుదిరిన రాత్రే, మా హన్మంతుగాడు, ఈ పిల్ల పారిపోయి ఎక్కడో పెళ్లి చేసుకున్నారట.

ఈ మాట వినగానే నాకు హన్మంతుగాడి మీద మాబాగా కోపం వచ్చేసింది. 'మా అన్నగాడిమీద పోట్లాడి గుంజుకున్న ముడుసుబొక్క తెల్లటిగుజ్జును, నాకెంతో ఇష్టమైన ఎండుతునకల కూరని వాడికి మిగిల్చి ఇచ్చాకదా, నాకెందుకు వాడి పెళ్లి విషయం చెప్పలేదని' తెగ ఇదైపోయా. ఇప్పుడన్నం తినబట్టి సరిపోయింది కానీ, లేకపోతె ఆ బాధతో ఒక్కమెతుకైనా తినబుద్ధయ్యేదా నాకసలు?

మత కట్టుబాట్లు కాదని ఒక ‘సూదరోడితో’ లేచిపోయిందని, ఆ పిల్ల మతపోల్లు మా సాయిబుగోరుని వెలివేశారట. ఊళ్ళో తిరగొద్దని సూటి పోటి మాటలతో ప్రాణం తీసారు. ఎదిగిన చెట్టు కొమ్మలు నరికితే కాండం కూడా మాడిపోయినట్టు, సాయిబుగోరి కుటుంబమంతటిని కూకటివేళ్లతో సహా పెకిళించి  వలసవెళ్ళేలా చేశారు. 

మనుషుల్లో దాగున్న చీకటి సంద్రాలకు, సంఘపు కుటిలనీతి గుయ్యారమునకు భయపడి, పశ్చిమానికి సూర్యుడు పారిపోతున్నాడు. విషాదపునవ్వుతో సాయిబుగోరు మా ఇంటికొచ్చారపుడు. కళ్ళెంబడి ఉబికివస్తున్న నీటితో, నన్ను సైగచేసి దగ్గరకు రమ్మన్నాడు. ఆ కిరసనాయిలు బుడ్డి నీలపు వెలుగులో సాయిబుగోరి ముఖం సగం కాలిన శవమల్లె తోచింది. ఒడ్డుకువచ్చిన అలకుమల్లే  ఒక నిముషం గంభీరంగామారి,” మా అమ్మాయిని ఒకసారి పిలుచుకురావు” అని నన్ను బ్రతిమిలాడాడు. ‘ఎప్పుడూ నాతో పరాచికాలాడే సాయిబుగోరి గొంతు ఇది కాదని’ నేను అయోమయంగా అమ్మకేసి చూసా. ఆయన కుడిచేయి నా వైపు సాచి, “నీ చిన్ని చెయ్యి నాకిప్పుడు ఆసరా రా” అని తీక్షణంగా నా వైపే చూస్తూన్నాడు. చాచిన ఆ చెయ్యి నీడ, ఆ దీపపు కాంతిలో గుడిసెంతా వ్యాపించి, మెల్లగా నన్ను బయటకు తోసింది. 

గెట్టురాయి మౌనంగా ఇద్దరినీ చూస్తుంది. మాటలకందని భావమేదో ఇద్దరి మొహాల్లో ఉన్నట్టుంది. లోకం ఒక పది నిముషాలు ఆగినట్టయింది.

“నీ దారి నువ్వు చూసుకున్నావ్  కదా, ఇంకా ఆ దొంగ ఏడుపెందుకన్న” సాయిబుగోరి మాటకు, ఆ పిల్ల ఏడుపు ఆపింది.

ఇంకో రెండు నిముషాల నిశ్శబ్దాన్ని చీకటి తనలో కలిపేసుకున్నాక, సాయిబుగోరు ఏదో గుర్తుకువచ్చినవాడికిమల్లే, వడివడిగా నడచుకుంటూ వెళ్ళిపోయాడు.

మూడు రోజులుగా వాళ్ళమ్మ నాన్నలని తలచుకొని ఏడ్చి ఏడ్చి, కళ్లన్నీ లొట్టలుపొయ్యాయి. లోపల దాగున్న వెలుగునంతా ఇప్పుడు కళ్ళలో నింపుకొని, సాయిబుగోరువెళ్లిన వైపే చూస్తూ నిలబడింది ఒక్కసారైనా వెనుతిరిగి చూస్తాడన్న పిచ్చి ఆశతో. ఈ లోపు ఎవరో పిల్చారని గబుక్కున వెళ్తుంటే , ముళ్ళు గుచ్చుకుందనుకుంటా, "అబ్బా.." అని ఒక క్షణం ఆగింది. ఏడుపుకి ఒక కారణం దొరికినట్టయింది తనకిప్పుడు. ఆ క్షణాన ఎక్కడో ఒక మెరుపు మెఱసి పిడుగు పడింది శాశ్వతంగా తెగిపోయిన వాళ్ళ బంధానికి గుర్తుగా.

అదే నే చివరిసారి సాయిబుగోరిని చూడటం. అది మొదలు ఇప్పటివరకు మా సాయిబుగోరి ఊసేలేదు ఊర్లో. ఆ తరువాతి రోజే సాయిబుగోరు ఊరొదిలి వెళ్లారని అమ్మ నాన్నతో చెబుతుంటే విన్నా. "నేను ఒంటరై  వచ్చినపుడు తోడుగా నిలిచిన మనిషికి, ఆసరా కాలేకపోయాననే బెంగతో" నాన్న మంచం పట్టాడు.

గతకాలపు విపత్తులను, గడ్డుకాలాన్ని  తనలోనే కలిపేసుకుని, తనని తాను కొత్తగా మార్చుకుంటుందనుకుంటా ఈ ప్రకృతి. కానీ జీవంఉన్న మనం, ఆ మానని గాయపు గురుతుల జ్ఞాపకాలను కడదాకా మనవెంటే మోసుకెళ్తామనుకుంటా! 

హన్మంతిగాడు  కాస్త బాబాయి అయ్యి, నాకొక సాయిబు పిన్నం దొరికింది. బాబాయి దగ్గరున్న చనువుకొద్దీ, పిన్నం చుట్టూ తిరిగేవాడిని. ఎక్కడ నన్ను ముట్టుకుంటే నా కర్రితనపు  చారలు తన ఎర్రటెరుపు వంటికి అంటుకుంటుదనే భయంతో, దగ్గరకు తీసుకుంటున్నా, సిగ్గుపడుతూ దూరం దూరంగా జరిగేవాడిని. “నీక్కూడా మావోల్ల పిల్లనొకదాన్ని చూస్తానని ఆటపట్టిస్తే” నాకొచ్చే ఆ పిల్లని మసిబారకుండా ఎట్టా ముట్టుకోవాలనే ఊహల్లో తేలిపోయేవాడిని నేను.

గూడెంలో సొంత భూమంటూ ఎవరికీ లేదు కనుక అందరూ కమ్మోళ్ల పొలంలో పనులకు పొయ్యేవాళ్ళు. పిన్నం ఎలాగూ పొలం పనులు చేసిన అలవాటు లేదు కాబట్టి, ఒక మిషను తెచ్చుకొని బట్టలు కుట్టడం మొదలెట్టింది. మిషను గూడెంలో ఉండేసరికి ఊళ్ళోవాళ్ళు  ఎక్కువుగా వచ్చేవాళ్లు కాదు. ఐనా మా గూడెంలో ఏముంటాయి కుట్టడానికి నాలుగు పిలకలైన రవికలు, చింకిపోయిన లుంగీలు తప్ప.

ఆ ఏడాది నేను పదో తరగతి. పొద్దున్న స్పెషల్ క్లాసుకి వెళుతున్నప్పుడు మొదలెట్టేది పిన్నం తన పని. మళ్ళా నేను తిరిగి సాయంత్రం వచ్చేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. అమ్మలక్కలందరు ఆదివారం పెబుయేసు గుడికివెళ్తున్నా, తాను మాత్రం ఆ రోజు కూడా ఎదో ఒక చింపిరిగుడ్డ కుడుతూనే  ఉండేది.

మా హన్మంతిగాడికి ఇంకా యవ్వనపు ఛాయలు పోలేదు. ఆటో కిరాయిడబ్బులు వాడి ఎచ్చులకు, తిరుగుళ్లకే సరిపోవడం లేదు. పిన్నం కడుపులో ఒక కాయ పడ్డాక  ఇక ఆమె వంటితో పని అయిపోయందని, తనని పట్టించుకోవడమే మరచిపోయాడు. ఇల్లుగడవకపోతే, తనకు చేతకాని వరికోతకి , మిరపతోటకి కూడా వెళ్ళింది పిన్నం. అప్పుడు తను  గర్భిణీ కూడా.

“తొలిచూరి కాన్పు అమ్మవాళ్ల ఇంట్లో జరగాలిరా” అని నాకు చెప్పి ఏడ్చింది. “మా ఇంటికి తీసుకుపోతా పద పిన్ని” అని చెప్పినపుడు, రెక్కాడితే గాని డొక్కాడని మా స్థితి తెలిసి, నవ్వుతూ “వద్దులేరా మీకెందుకు ఆ కష్టం” అని చెప్పింది.

నా ఇంటర్ మొదట్లో అనుకుంటా తనకి ఒక బాబు పుట్టాడు. వాడే లోకంగా అప్పటి నుండి ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలెట్టింది పిన్నం. 

ఇంట్లో గడవని విషయం, కిస్మస్ పండక్కొచ్చిన వదినలకు తెలియకుండా, తాను దాచుకున్న మిషను డబ్బుల్లోంచి కొంత దీసి , వాళ్ళకి చీరలు పెట్టింది. ఎప్పుడూ ముట్టుకోని గొడ్డుమాంసాన్ని కడిగి, కూర చేసి పెట్టింది ఇంటిల్లిపాదికి.

కట్నమేమి తీసుకురాలేదనే అత్త సూటిపోటి మాటలను తన నవ్వులోనే కలిపేసుకొనేది. కాలు విరిగి అత్త మంచాన పడితే, బువ్వ కాన్నుంచి, అత్త పీతురు గుడ్డలు కూడా ఉతికి, చంటి బిడ్డల్లే సాకింది. మామ చీపుర్లు అల్లిపెడితే, వాటినమ్మి పదో పరకో సంసారానికి వాడేది.

డిగ్రీ చదవడానికి నేను హైద్రాబాద్ వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో పిన్నంతో కలిసి మాట్లాడింది చాలా తక్కువ. వయస్సు పెరిగేకొద్దీ చనువు తక్కువయిద్దో లేక బంధాలు బలహీన పడతాయో నాకు తెలియదు కానీ, పిన్నం గుర్తొచ్చినప్పుడల్లా నాకు నేను ఒక దోషిలా కనపడేవాడిని. ‘తన ఊసులు, గోడు, బాధలు, ఇష్టాలు చెప్పుకోవడానికి తనకంటూ ఎవరూ లేరు కదా గూడెంలో ’ అని బాధపడేవాడిని.

మొన్నరేతిరి ఇంటికి ఫోన్ చేస్తే అమ్మ చెప్పింది- “పిన్నం ఇప్పడు  కడుపుతో ఉందని”. పోయినేడాదికూడా ఇలాగే కడుపుతో ఉన్నప్పుడు వరిపొలం గెనం  మీద కాలుజారి పడితే, గర్భం తీసేశారట. 'డాక్టర్లేమో రెండు నెలలు మంచం దిగకూడదు' అని చెప్తే, “నాతోనే పనులన్నీ చేయించుకుంటున్నావటే, ఓ లంజముండా” అని అత్త అనరాని మాటలు అంటుంటే, రెండోవారానికే వరినూర్పులకి పోయిందట. పాపం పిన్ని. అసలు ఆ ‘రెండో సంబంధమే’ చేసుకుంటే ఇలానే ఉండేదా తన జీవితం?. పిన్నం కి ఎప్పుడైనా అనిపించిందా ‘ఇలా కులం కాని కులం, మతం కాని మతం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఏమి సుఖపడ్డానని?’.

ఇంటికొచ్చిన మరుక్షణమే పిన్నం ని చూడటానికి పరుగెత్తుకెళ్లా. వాన చినుకులు తెరలు, తెరలుగా పడుతుంటే, తనలో తానేదో గొణుక్కుంటూ దండమ్మీద ఆరేసిన బట్టలు తీస్తుంది. ఆ మిషను మీద ఎడతెరపిలేకుండా వంగోని కుట్టటంవల్లనేమో లేక మోయలేనంత బరువు చిన్న వయస్సులోనే మీద పడిపోవడం వల్లనేమోగాని, గూని వచ్చినట్టుంది పిన్నం కి. కుంటుకుంటూ ఇంటిలోకెళ్తున్న పిన్నం ని చూస్తుంటే, ‘ఐదు సంవత్సరాలక్రితం ఆ నల్లగుడ్డ పరదా వెనుకాల, బిక్కు బిక్కుమంటూ, కన్నార్పకుండా నన్ను చూసిన మనిషేనా ఈ మనిషి’ అని అనిపించింది నాకు.

ఏదో గుర్తుకు వచ్చినట్టు వెనక్కి తిరిగింది. నేను కనిపించిందే  తడవు, నల్లకప్పేసిన ఆ మొహంలోని కనుగుడ్లన్నీ ఇంత పెద్దవిగా చేసి, సాయిబుగోరిమల్లె దగ్గరికి రమ్మని సైగ చేసింది. నా చింపిరి జుట్టుని పట్టుకొని “మా సాయిబోళ్ల పిల్ల ఉందిగాని, పెళ్లి చేసుకుంటావా” అని ఒక్క సారిగా గుండెలనిండా నవ్వింది.

ఆ నవ్వులో గడిచిన ఐదారేళ్ళ తన జ్ఞాపకాలు, ఒక్కొక్కటై నా ఒడిలోకి చేరుతున్నట్టనిపించాయి.