Tuesday 25 May 2021

సమాధి తోట


కథ గోదావరి పత్రికలో పబ్లిష్ అయ్యింది.

ప్రతి ఆదివారంలాగే నిన్న కూడా ఇంట్లో చికెన్. ఎప్పుడులా కాకుండా ఈ సారి కూర బాగుందనిపించింది. కొంచెం పుల్లగా, కొంచెం ఘాటుగా. ఈ మధ్య తినేటప్పుడు నాకు అలవాటైన వంటని తిట్టే గొణుగుడు ప్రోగ్రాం కాకుండా, అమ్మకి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చినా. ఎప్పుడూలేంది మారు అన్నం కూడా పెట్టుకున్నా. అంత నచ్చింది మరి. తిన్న పది నిముషాలకే టీవీ కట్టేసి, ముఖానికి ఆవులింతలు తగిలించుకుంది అమ్మ. లైటు ఆర్పేసి ఇవతలగదిలోకి పాకాను నేను. గచ్చుమీద బొంత, కాళ్ళ దగ్గర ఒక స్పాంజీ దిండు, తలదగ్గర ఇంకో మెత్త. కప్పుకోడానికి రెక్క దుప్పటి. దోమలు ఎక్కువ ఉన్నాయని కిటికీలు వేశా. లైటు తీసేసి ఫోన్ డిస్ప్లే వెలుతురులో పక్క సర్ది పడుకున్నా. నిద్రపోయ్యేముందు వాట్సప్ ఓపెన్ చేశా. చదవకుండా వదిలేసిన గ్రూప్ మెస్సేజులు మాత్రమే కనిపించాయక్కడ. ఒంటరోడినని గుర్తు చేసింది ఫోన్ మళ్లీ.


ఎంత తన్నుకులాడినా నిద్రరావట్లే. కొద్దిసేపయిన తరువాత పొట్టమీద మీద ఎవరో కూర్చున్నట్టు, లోపలికి గుండె అంతా బిగుసుకుపోతున్నట్టు అనిపించింది. గాలి సరిగా ఆడనట్టు, గొంతు ఎండిపోతున్నట్టు, ఇలా. గాలి పీల్చుకోడానికని నోరు తెరిచాను. రెండు నిముషాలు పర్వాలేదనిపించినా మళ్ళీ అదే ఇబ్బంది. గొంతు పట్టేసినట్టు, పీక ఎవరో నులుముతున్నట్టు అనిపించింది. భయం దాచుకుంటూ లేచి కూర్చున్నా. వీపు ఆనుకున్న గోడ కంపిస్తున్నట్టుగా గుండె దడ లోపల. చల్లగవుతున్న పాదాలను చేతులతో అదుముకుని, గోడవార  పడుతున్న సన్నని వెలుతురు దగ్గరికి వెళ్ళా. గదిలో గాలి తక్కువ ఉందేమోనని కిటికీలు తెరిచా. తెరలు తెరలుగా గాలొచ్చి మొహానికి తగిలింది. ఈ సారి ఇంకా గట్టిగా నోరు తెరిచా. గాలి నోట్లోకి పొయ్యి, వెంటనే బయటికి వస్తున్నట్టనిపించింది. కిటికీ దగ్గర నుంచున్నా, అంత గాలి బయటనుండి వస్తున్నా, వళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అటు ఇటు వేగంగా నడిచా గదిలో, ఆ చీకట్లోనే. ఊపిరాడటం లేదని స్పష్టంగా అర్థమయింది నాకు. కాళ్ళు వణకడం మొదలైంది. నడకలో తత్తర. గొంతు ఎండిపొయ్యి మాట పెగలట్లేదు సరిగా. భయం భయంగా లైటు వేసి అమ్మని లేపా. నా గోలకి గోపిగాడు కూడా లేచాడు. గాలాడటం లేదని సైగ చేశా. మెల్లగా నడిచి గాలి పీల్చుకో సర్దుకుంటుందని చెప్పారిద్దరు. ఎంత నడిచినా లాభం లేదు. ఆ నడిచే తొందరలో చావుమీద జడుపు పట్టుకుంది. చేతులు, కాళ్ళు సల్లబడుతున్నాయి. మంచం మీద పడుకోబెట్టారు. గోపి చేతులు రుద్దుతుంటే, అమ్మ కాళ్ళు రుద్దుతుంది. మెల్ల మెల్లగా కాళ్ళనుండి ఒకొక్క శరీరభాగం సల్లబడుతున్నాయి. నేను ఇలా అవుతుందని చెప్పేసరికి గోపిగాడికి కూడా భయం వేసినట్టయ్యింది. మనిషి దిట్టంగా ఉన్నా భయాన్ని మాత్రం లోపల దాచుకోలేడు వాడు. నా మొహంలో చావుని చూసినట్టున్నాడు. అమ్మని లోపలకెళ్లి మంచినీళ్లు తెమ్మన్నాడు. చల్లదనం గుండె దగ్గరికి చేరుకుంది. ఇలా కుదిరేట్టు లేదని మంట వేద్దామని అమ్మతో చెప్పాడు. అమ్మ కన్నీళ్లు దాచుకుంటున్నట్టుంది. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏదో కథల పుస్తకం పేజీలు చింపి మంట వేశారు ముందు గదిలో. మంచం మీద నుండి నన్ను లేపి మంట ముందు కూర్చోబెట్టారు. కూర్చొని కూర్చొని నీరసం ఎక్కువయ్యి కళ్ళు పూర్తిగా మూసుకుపోతున్నాయి. అదిగో అప్పుడే గోపి గాడు 'చొక్కా తీసేద్దాం, వేడి డైరెక్టుగా లోపలికి పోతుంది' అని, నా చొక్కా గుండీలు విప్పాడు. తరువాత అమ్మ ఏడుపు గట్టిగా వినొచ్చి, నా కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తరవాతే నాకు మెలుకువ వచ్చింది. గుండె దడగా ఉంటునట్టు, గాలి సరిగా ఆడటం లేదని చెప్పా డాక్టర్ కి. ఇంకా ఏదో చెప్తుంటే నా మాటలేమి పట్టనట్టు గుండె మీద స్టెతస్కోప్ పెట్టి గట్టిగా అదిమాడు. కళ్ళు నొసలు చిట్లించి శ్రద్ధగా విన్నాడు గుండె చప్పుడిని. కంగారు పడాల్సింది ఏమి లేదని మందుల చిట్టి రాసాడు. అందులో స్ట్రెస్ కి కూడా మాత్రలు రాశానని, అవి వేసుకున్నప్పుడు మొదట్లో తిక్క తిక్కగా ఉండొచ్చని జాగ్రత్త చెప్పాడు.


ఏదీ సరిగా గుర్తుపెట్టుకోలేని నేను మందులు మాత్రం టైంకి తింటున్నా. మందులు వేసుకోవడం మొదలెట్టిన దగ్గరనుండి నాలో రెండు మార్పులొచ్చాయి. ఒకటి- ఎంత లేటుగా పడుకున్నా గంట కొట్టినట్టు తెల్లారుజామున నాలుగ్గంటలకే మెలుకువ రావడం. మరొకటి- గతంలో జరిగిన ఈవెంట్స్ ని తలచుకొని, వర్తమానాన్ని, భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకోవడం. ఒకటి ఫిజికల్ మార్పు, రెండోది మెంటల్.


ఆ రోజు రాత్రి అలా జరిగిన దగ్గరనుండి అమ్మ నా మంచం పక్కనే పడుకుంటుంది. నిద్రపోయినా రాత్రుళ్ళు లైట్ ఆర్పడం మానేశారు ఇంట్లో. మా అన్న నా ఫోన్ కి కాల్ చేస్తున్నాడు కొత్తగా. అమ్మకి ఎవరూ లేవకముందే నిద్రలేచి పని చేయడం అలవాటు. కానీ ఈ మధ్య నాకు, అమ్మకి కూడా మెలుకువ రాని పొద్దప్పుడే నిద్ర తేలిపోతుంది. మొదటిరోజు అమ్మని లేపి చెప్దామనుకున్నా. కానీ ఇప్పటికే భయపెట్టింది చాలులే అని ఊరుకున్నా. ఇక మంచంలో అటు, ఇటు మెసలడమే తెల్లారేదాక. పెచ్చులూడుతున్న ఇంటి కప్పుని చూస్తూ ఒక రోజు, కిటికీ పక్కున్న నిమ్మచెట్టు మీద నాకు తెలీని పిట్ట అరుపు వింటూ మరొకరోజు గడిపా. ఆ మరుసటి రోజు ఏమీ తోచక ఫోన్ ఓపెన్ చేశా. ఎప్పటినుండో చదవాలనుకుంటున్న 'హౌ నాట్ టు ఫియర్ అబౌట్ డెత్' వ్యాసం ఓపెన్ చేశా. అది రెండు పేరాల దగ్గరే ఆగిపోయింది. నేను లోలోపల కూడబలుక్కుంటున్న అక్షరాల శబ్దాలను ఎవరో పక్కన కూర్చుని నా బదులు చదువుతున్నట్టనిపించింది. మొన్నెప్పుడో ఫేస్బుక్ లో ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ కింద నే పెట్టిన కామెంట్ గుర్తొచ్చింది- చావు గురించి తెలుసుకోవడం నాకు భలే సరదా. కానీ మొన్నటి ఎక్స్పీరియన్స్ తో ఒకటి రియలైజ్ అయ్యా. నాకు చావు గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం కాదు, చావంటే చెప్పలేనంత భయం. అది ఒప్పేసుకోలేకే ఈ ముసుగేమో!


ఎవరి చావైనా టీవీలో చూసినా, సీరియస్ గా లెక్చర్ వింటున్నప్పుడు ప్రొఫెసర్ చావు గురించి, ఇంకా బుద్ధిస్ట్ లు నమ్మే

‘నైరాత్మావాదం’ కి సపోర్ట్ గా ఆర్గుమెంట్స్ ప్రెసెంట్ చేసినప్పుడైనా, నా ఆలోచనలన్నీ చావువైపు మళ్లుతాయి. నా చావు వైపు. నన్ను కట్టేసిన బంధాలు, నాకంటుకున్న స్నేహాలు, నాలో భాగమయిన మనుషులు, నా చావుతోనే మాయమవుతారా అని తోచేది. భయమేసేది. ఎంతో కష్టంగా వేరే విషయాల మీదకు నా ఆలోచనలను మళ్లించేవాడిని. అదొక నరకం. దెబ్బ తగిలితే రక్తం ఐనా కనపడుతుంది దాని ఆనవాలుగా. ఆలోచనల హింస మాత్రం ఎప్పటికీ బయటికి కనపడదు. నాకు చావు గురించి ఆలోచనలు ఎక్కువ రావడానికి ఒకానొక కారణం మా నాన్న.


ముందు మా నాన్న ఎలాంటోడో చెప్పాలి. పోనీ మా నాన్న అంటే నా దృష్టిలో ఏంటో మీకు తెలియాలి. ఎవరో తట్టినట్టుగా ఉదయం నాలుగింటికే లేచేవాడు నాన్న. దారంతా తెలిసినోడిలా దోవ తడుముకోకుండా ఇంట్లోంచి బయటకొచ్చి దొడ్లోకి పొయ్యేవాడు. పొగ తాగక నోరంతా పీకుతుందని ఉమ్మేసేవాడు. లుంగీ పైకిదోపి బీడీ వెలిగించేవాడు పొద్దు పొద్దున్నే. అప్పట్లో దొడ్డికి పైకప్పు ఉండేది కాదు. వాన, వెలుతురు, గాలి, అందరూ సమానమే దానికి. ఇష్టమొచ్చినప్పుడు వచ్చి పోతుండేవవి దానిలోపలికి. ఆ తెల్లారుజాము చీకట్లో ఎరుప్పచ్చని మిణుగురులా బీడీ వెలుగు. ఇంటికెదురు వేప చెట్టు నీడలో బీడీ ఆరిపోయేదాకా తిరిగేవాడు. గదిలోకి పోతూ, ఈ గదిలో ఉన్న నా మంచం దగ్గర ఒక్కోసారి ఆగేవాడు. మునగదీసుకుని పడుకున్న నన్ను పక్కకి జరిపి పడుకోవాలని చూసేవాడు. బీడీ వగరు వాసననో, బంకలా సాగే చర్మమనో, భరించలేని గురకనో చెప్పి, పడుకొనిచ్చేవాడిని కాదు నా దగ్గర ఆయనని. ఒక్కో రాత్రి సోయలేకుండా తాగొచ్చేవాడు. పొద్దున్నే బీడీకని లేచినప్పటికీ ఇంకా మత్తు దిగేది కాదు. అలాంటిరోజుల్లో నా దగ్గరకొచ్చి ముద్దు ఎక్కువ చేసేవాడు. మంచంకోడుని ఒక చేత్తో పట్టుకొని, బలంకొద్దీ నెట్టేవాడిని నా దగ్గర పడుకోవద్దని. నా ఉడుకుమోత్తనం చూసి ఇంకా నవ్వేవాడు. వాసనొస్తున్న నోటితో బుగ్గ మీద ముద్దుపెట్టేవాడు. గడ్డం అచ్చులు నా బుగ్గమీద పడేవి. (నేను ఇంటర్ లోకి వచ్చినప్పటికీ కూడా ఈ ముద్దులు ఆగలేదు). మా కుటుంబంలో మా నాన్నకొక్కడికే నిండైన గడ్డం. అమ్మతరపు ముగ్గురు మామయ్యలకి గడ్డిపోచల్లాంటి గడ్డం. వాళ్ళ కొడుకులకి అయితే పెళ్ళీడు వచ్చినా ఇంకా గోదుమ్మీసాలే. మా అన్నకి, నాకు వాళ్ళ పోలికే వచ్చిందనుకుంటా ఈ ఒక్క విషయంలో మాత్రం.


అసలు చిన్నప్పుడు మా నాన్నకు నా మీద ఇసుమంత కూడా ప్రేమ లేదని అనుకునేవాడిని. నా కారణాలు నాకున్నాయి మరి. నేను అయిదో తరగతి దాకా మా ఊరి చిన్నబడిలోనే చదువుకున్నా. తరువాత ఆరో తరగతికి పరీక్ష రాస్తే దూరంగా ఎక్కడో హాస్టల్ లో సీట్ వచ్చింది. కొత్త స్కూల్ యూనిఫామ్, పేజీలు నలగని నోటుబుక్కులు, మూడుపూటలా తిండి. నా ఇష్టంతో పనిలేకుండా పంపడానికే సిద్ధమయ్యారు ఇంట్లో వారందరూ. నాకంటూ ఒక ఇష్టం ఉంటుందని నాన్నకి అనిపించలేదు అప్పుడు. దసరా, సంక్రాంతికి వారం వారం రోజులు సెలవులుండేవి. ఉప్పుబిర్రాట, అయిసిరాట, వాలా వాలింకి ఆట, ఇవన్నీ తనివితీరా ఆడుకునేలోపే సెలవులయిపొయ్యేవి. హాస్టల్ కి వెళ్లే రోజు ఏడవని సంవత్సరం లేదు. హాస్టల్ కి పోవాలంటే మా మండలానికి నడిచి, అక్కడనుండి లారీ ఎక్కాలి. మాఊరి నుండి మండలానికి ఆరు కిలోమీటర్లు పైనే. అది కూడా మట్టి రోడ్డు. అడ్డదారిన రైలుపట్టాలెక్కి గేటు దగ్గరికి పోతే మూడు కిలోమీటర్లు తక్కువైద్ది. ఏడో తరగతిలోకి కొత్తగా పోతునప్పుడు, రైలు పట్టాల మీద మా నాన్నకి దొరక్కుండా చాలా దూరం ఉరికినా. వేగంగా పరుగెత్తాలని చెప్పులు తీసేసరికి పగులురాయి దిగబడి రక్తం విరగచిమ్మింది. తొందరలోనే నాన్న నన్ను దొరకబుచ్చుకున్నాడు. దగ్గర్లోనే కాలువ వంతెన ఒకటుండే. హాస్టల్ కి పోకపోతే గొంతుపిసికి కాలువలో నెడతా అని వీపు మీద రెండు దెబ్బలు గట్టిగా కొట్టిండు. ఏమనుకున్నాడో ఏమో గాని కాలువలో దించి దెబ్బ కడిగి, కండువతో కాలు కట్టిండు. ఆ దెబ్బతోనే హాస్టల్ కి ఏడ్చుకుంటూ వెళ్ళా. అప్పుడు అనిపించింది నాన్నకి నామీద ఏమాత్రం ఇష్టంలేదని.


కానీ, ఆయన మరీ ప్రేమ తెలియని గరుకు మనిషి కాదని ఒక పిల్లి వల్ల తెలిసొచ్చింది తర్వాతెప్పుడో నాకు. బొందలగడ్డ దగ్గర దొరికింది మాకా పిల్లి. పుట్టి ఎంతో కాలమయినట్టు లేదు. అప్పుడే విచ్చుకుంటున్న చిన్ని చిన్ని కళ్ళు. వళ్ళంతా ఇంకా పూర్తిగా కప్పెయ్యని బూడిదరంగు వెంట్రుకలు. పొట్టమీద అడ్డంగా రెండు మీగడరంగు గీతలు. ఎవరో గోనె బస్తాలో వేసి పారేశారక్కడ. బస్తా తాడువిప్పగానే నాన్న వళ్ళో వాలింది గోల చేసుకుంటూ. అది మొదలు నాన్నని విడిచిపెట్టింది లేదు అది. బ్రతుకులోనూ, చావులోనూ. దానికి లక్ష్మీ అని పేరు పెట్టాడు. కొంత కాలంలోనే నాన్న పళ్ళెంలో నాలుగు మజ్జిగన్నం మెతుకులు, పక్కమీద కొద్దిగా స్థలం, రెంటినీ ఆక్రమించేసింది అది. తను మా ఇంటికి వచ్చిన కొత్తలో నా దగ్గరకి వచ్చేది కాదు. మా ఇంటికొచ్చిన మూడోరోజు కళ్ళుమూసుకొని గాబు దగ్గర నీళ్లు తాగుతుంది. మెత్తగా తల నిమిరాను. అప్పటికింకా బెదురుతనం పోలేదు దానికి. రక్తమొచ్చేలా నా చేతులని గీరింది. నాన్న కూలికిపొయ్యి వచ్చేదాకా వాకిట్లోనే ఎదురుచూసింది. సాయంత్రంపూట ఇంటికిరాగానే నా మీద ఫిర్యాదు చేస్తున్నదానిలా నాన్న కాళ్ళలో తారకలాడింది చాలాసేపు.


అదంతా ఇంటికొచ్చిన కొత్తల్లో. తరవాత నాకు కూడా అలవాటు కావడానికి ఒక సంఘటన కారణమయ్యింది. ఓ రోజు మధ్యాహ్నం పిల్లులు పొడిచేవాళ్ళు బాడిశెలు పట్టుకొని మా గూడేనికి వచ్చారు. అప్పుడు అమ్మోళ్ళు మిరపతోటలో కలుపుకి పొయ్యారు. నేను గుడి దగ్గర సిర్రాట ఆడుతున్న. నాతో ఆడుతున్న అమ్మాయి మా పాక దగ్గర నుండి పిల్లి కేకలు వినొస్తున్నాయని చెప్పింది. తీరా చూస్తే మా లక్ష్మీ. పిల్లుల్ని వేటాడేవాళ్ళకి కనపడకూడదనే ప్రయత్నంలో సరుకారు కంపలో చిక్కుకుంది. ఎడం డొక్కకి ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతుంది. నే దగ్గరికెళ్లగానే సంజాయిషీ ఇస్తున్నట్టు తడి చూపు. కంపలోంచి తీసి, పసుపుతో కట్టు కట్టాను. కోళ్లు కప్పేసే తట్ట వెల్లకిలా వేసి, లోపల వెచ్చగా వేపాకులు వేసి పడుకోబెట్టా. సాయంత్రంకల్లా ఉషారుగా తిరిగింది. అప్పటినుండి నన్నూ దగ్గరికి రానిచ్చింది లక్ష్మి.


ఎంతైనా నాన్న దగ్గరే లక్ష్మికి చనువెక్కువ. ఒక్కోసారి లక్ష్మీ అలిగేది. ఎందుకు అలిగేదో ఎవరికీ తెలిసేది కాదు. ఇంట్లో ఎవరు పిలిచినా అన్నం తినడానికి వచ్చేది కాదు. అదే నాన్న సోయలేకుండా సారా తాగొచ్చి "లక్ష్మీ..." అని పిలిచినా, వళ్ళోకి దూకేది క్షణం ఆలస్యం చేయకుండా. కాలితో మొహమంతా తడిమేది. అలా నాన్నని తడుముతుంటే 'తాగుడు మానేయొచ్చుగా' అని బ్రతిమాలుతున్నట్లుండేది అది. పట్టలేనంత ఇష్టం వచ్చినపుడు మాత్రం పొట్ట కనపడేలా వెల్లకిలా పడుకొనేది. దగ్గరికి జరిగి వీపుమీద చెయ్యేసి ముద్దు చేయమని గోముగా కాళ్ళు జాపేది.


లక్ష్మి కడుపుతో ఉన్నప్పుడు నాన్న లోకమంతా దాని జాగ్రత్తలతోనే నిండిపోయింది. పొద్దున పనికి పొయ్యే ముందు దానికి హద్దులు చెప్పి, సాయంత్రం దాకా బయటకెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చేవాడు. లక్ష్మి కూడా నాన్న చెప్పేవన్నీ దానికి అర్థమవుతున్నట్టు చిన్నగా మూలిగేది. మధ్యాహ్నం పూట ఒక గొంతుకి బదులు, మూడు గొంతులు వినపడేసరికి తట్ట దగ్గరికి వెళ్లా. ఇంకా కళ్ళుతెరవని రెండు బుజ్జి ముండలు. ముట్టుకుందామని చెయ్యి పెట్టే లోపే కరుస్తా అన్నట్టు పళ్ళన్ని బయటపెట్టి పొగలు కక్కింది లక్ష్మి. నాటేసి అలసిపొయ్యి ఇంటికొచ్చారు అమ్మ, నాన్న. ఆయన మాట విని లక్ష్మి బయటకొచ్చింది. 'ఉన్నపళంగా వచ్చి నా పిల్లల్ని చూస్తావా? లేదా?' అని ఒకటే అరుపులు. ముట్టుకొని చూసిందాకా ఊపిరాడనీయలేదు నాన్ననప్పుడు.


అలాంటి లక్ష్మి ఇంటికి రావడం మానేసింది. నాన్న చనిపోయిన రోజు నుండి ఇంట్లో లక్ష్మి అలికిడి లేదు. అమ్మకి మాత్రం ఒక రోజు రాత్రి పూట కనిపించిందట. వెలుగు ఆరిపోయిన ఇంట్లో చీకట్లో వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోయిందట. నాన్న సమాధి కడుతున్న మేస్త్రీలకు బొందలగడ్డలో ఓ పిల్లి కనిపించిందని చెప్పారు. అది లక్ష్మినేమోనని వెతికా నేను. ఆచూకీ చిక్కలేదు. రోజులు గడిచేకొద్దీ రాత్రిపూట రావడం కూడా మానేసింది. పిల్లలు రోజురోజుకీ బక్కగయ్యాయి. రెండింటిలో ఒకటి ఇంటి ముందు రోడ్ మీద ఆడుకుంటుంటే ట్రాక్టర్ కింద పడి నుజ్జునుజ్జయింది. రక్తం కారిన దాని కనుగుడ్డు ఇప్పటికీ నాకు గుర్తే. ఆ దృశ్యం చూసిన వారికెవ్వరికైనా అన్నం సయించదు. మొదటిది చనిపోయిన తరువాత లక్ష్మీ ఒకసారి పగటిపూట ఇంటికి వచ్చింది. లోపలిగదిలో నేను కింద పడుకొని ఉన్నా. నా దగ్గరికి వచ్చి మౌనంగా తల పక్కన చేరింది. దాని బిడ్డని పిలిచింది ఇటు రమ్మని. అది కూడా వచ్చి నా పక్కన పడుకుంది. దాని చూపులో నాకెందుకో జాలి కనిపించింది. అదే చివరిసారిగా లక్ష్మీని చూడటం. మళ్ళీ కనిపించలేదు ఎవరికీ.  మిగిలిన ఇంకొక పిల్లి ముభావంగా ఉండేది. (దానికి పేరు పెట్టడం మర్చిపోయ్యాం. అసలు పేరు పెట్టేవాడు లేడు కదా!). పెడితే తినేది, అంతేకాని నా హక్కు అని పొట్లాడేది కాదు ఎవరిమీదా. అది కూడా వారంరోజులుండి చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది. నాన్న చావుతోనే పిల్లి అరుపులు ఇంట్లోనుండి మాయమయ్యాయి. ఇప్పటికీ రోడ్డుమీద పోతుంటే పిల్లి అరుపు ఎక్కడైనా వినిపిస్తే, బొందలగడ్డలో మా నాన్న ప్రేమని వెతుక్కున్న లక్ష్మినే గుర్తొస్తుంది నాకు. 


నాన్న మీద చిన్నప్పుడు అయిష్టత ఏర్పడడానికి పూర్తికారణం నాన్న చేష్టలే కాదు. దానికి ఇంకో కారణం మా పెదనాన్న ప్రేమ కూడా. మా పెదనాన్న కి ఇద్దరు మగ పిలగాళ్ళు, ఒక ఆడపిల్ల. అందరూ నాకంటే పదేళ్లు పైనే పెద్ద. ఇక మా ఇంట్లోనేమో నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. అందరికంటే నేనే చిన్న. మా ఇంట్లో కంటే ఎక్కువుగా నన్ను గారాబం చేసింది మా పెదనాన్న, పెద్దమ్మే. అసలు చిన్నప్పటినుండి నేను వాళ్ళని చెన్నూరమ్మ, చెన్నూరునాన్న అని పిలిచేవాడిని (చెన్నూరు వాళ్ల ఊరి పేరు). నేను హాస్టల్ కి వెళ్లకముందు అన్ని ఎండాకాలం సెలవులూ చెన్నూరులోనే గడిపా. గుంట గోలీలాట, డోకిచ్చులు, టెంకాటా ఆటలాడి ఆ ఊరు పిల్లాడినయ్యా. మొహం కడుక్కోగానే ఆ ఊర్లో ఇడ్లీల బండికాడకి పొయ్యి చెట్నీ అంతా చొక్కా మీద ఒలికించుకునేవాడిని. అప్పట్లోనే అక్కడ హోటల్ ఉంది, మా ఊర్లో ఇప్పటికి కూడా హోటల్ లేదు మరి. ముంజకాయలు, మామిడికాయలు తినడానికి తెంపే ఉండేది కాదు. వేడికి చెక్కగడ్డలు కాని వేసవి కాలం లేదు నా చిన్నప్పుడు. ఆయనకి కుడి కన్ను గనుపు దగ్గర పులిపిరి ఉండేది. దాన్ని గట్టిగా లాగి నా వంటిమీద అతికించుకోవాలని చూసేవాడిని. చెన్నూరునాన్న తెల్ల పంచె ఉదయం పట్టుకుంటే మళ్ళీ నిద్రపోయినప్పుడే వదిలేవాడిని. వానపడుతుంటే బట్టలు తీయలేదనో, వీపెనకాల చెమటకాయలు గీకలేదనో, పని దగ్గరనుండి ఇంటికొచ్చేలోపు బొచ్చలు రుద్దలేదనో నాన్న విసుక్కున్నప్పుడల్లా చెన్నూరునాన్న గుర్తొచ్చేవాడు నాకు. మా నాన్న చూపించని ప్రేమంతా చెన్నూరునాన్నలో వెతుక్కునేవాడిని.


నాకు చావంటే భయం అని చెప్పా కదా. అసలు అది చెన్నూరునాన్నతోనే మొదలయింది. నేను హాస్టల్ లో జాయినయిన ఏడాది చెన్నూరునాన్నని కాన్సర్ గడ్డ తినేసింది. ఈ విషయం నాకెవరూ చెప్పలేదు నేను హాస్టల్ లో ఉన్నప్పుడు. లాస్ట్ పరీక్షలు తరువాత ఇంటికొచ్చిన నాకు అమ్మ చెప్పింది. పెదనాన్న లేని చెన్నూరుని ఊహించుకోలేకపోయాను. అలిగిదాక్కున్న వడ్ల గుమ్ము, ఇద్దరం కూడబలుక్కొని బర్రెదూడలు కట్టేసిన కొబ్బరి చెట్లు, ఉప్పుబస్తా ఎక్కడానికి వీలుగా వంగిఉండే ఇంటిబయట బావిరాయి, వీటన్నింటికి అర్థాలు మారిపోతాయనిపించింది. నాకు ఆ మార్పు నచ్చలేదు. నచ్చడం కాదు, ఆ మార్పు వస్తే, దానితోపాటు పెదనాన్న కూడా అప్పుడప్పుడు తలచుకునే జ్ఞాపకం అయిపోతాడని భయం వేసింది. అందుకే నేను ఒకటి గట్టిగా అనుకున్నా అప్పుడే, ఆ ఊరికి వెళ్లకూడదని. ఇప్పటికి 13 సంవత్సరాలయింది ఆ ఊరిని చూసి. అక్కడికెళ్లి పెదనాన్న గుర్తులు కలుషితం చేసుకోవాలని లేదు నాకు. చావంటే నాకున్న భయం చెన్నూరునాన్న చెప్పాపెట్టకుండా కనపడని  రోజు నుండి మొదలయిందనుకుంటా.


నాన్న చనిపోయిన ముందురోజు రాత్రి తాగుడెక్కువైంది ఆయనికి. వీధిలో ఎవరితోనో పరాచికాలాడుతున్నాడు. ఇంటికి రమ్మని ఎంత బ్రతిమలాడినా రాలేదు. నాకు తెలిసి నేను గొంతు పెంచి నాన్నతో మాట్లాడింది అదే మొదటిసారి. అదే చివరిసారి కూడా. ఆ రాత్రి ఏదో పనుండి నేను మా ఇంట్లో పడుకోలే. ఆ రాత్రి తాలూకా చీకటి మచ్చలు ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయనుకుంటా. నిద్రపట్టక ఐదింటికే ఇంటిబాట పట్టా. చర్చీ మూల తిరుగుతుంటే  శ్రీనుగాడు ఉరుకులాంటి నడకతో నన్ను దాటేసి పొయ్యాడు. "ఆదాం మాయ్యా…" అని గొంతులో అదురు వినపడింది. మా ఇంటి బయటలైటు వేసుంది. అమ్మ ఏడుపు గట్టిగట్టిగా దగ్గరవుతుంది. నాన్న ఇవతలగదిలో కదలకుండా పడున్నాడు, నేను రోజూ మెదిలే మంచంలో, శాశ్వతంగా నిద్రపోతూ. ఏమి జరుగుతుందో ప్రాసెస్ కావడానికి టైం పట్టింది. మా అమ్మ ఏడుపులో నాన్న చివరి క్షణాల దృశ్యం కనపడింది. నాలుగింటికి దొడ్లోకని లేవడం, బీడీ ముట్టించడం, నా మంచం దగ్గరకొచ్చి నాకోసం వెతుక్కోవడం, పక్కమీద నా ఖాళీని పూరించడం, తొలిపొద్దు గుండెనొప్పి నాకు దూరంగా నాన్నని తీసుకెళ్లడం- ఇవన్నీ ఒక్కొక్కటిగా ముద్రపడుతున్నాయి నాలో.


మాటల్లో ఇమడ్చలేనంత శాంతం నాన్న ముఖంలో. చావు గడియ దగ్గరికొచ్చినప్పుడు నవ్వుతున్నట్టు అనిపించాడు. అసలు ఆ మంచం మీద నేనుంటే నాన్న ఇప్పుడు నాతోనే ఉండేవాడేమో? ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా అమ్మ ముఖం చూడటానికి నాకు ధైర్యం చాలేది కాదు. నాన్నని బొందపెట్టిన మరుక్షణం నుండి లక్ష్మీ మా ఇంటికి రావడం మానేసింది. తను ప్రేమించే మనిషి ఇక లేడుగా. 


నెలరోజులకి కొంత సర్దుకుంది ఇంట్లో. అమ్మ అప్పుడప్పుడు అంటుంది, నాన్న కల్లోకి వచ్చాడని, ఏదో చెప్పాడని. ఆ వెంటనే నా నుంచి బదులు రాదని తెలిసినా ఒక ప్రశ్న ఎప్పుడూ అడుగుతుంది "చిన్నోడా… నీకు రాడా కల్లోకి నాన్న?" అని. తనకి తెలీదు నాన్నతో పాటే, నాలో సగభాగం చచ్చిపోయిందని ఆ రాత్రి. ఆ స్పాంజిల దిండు, మంచి నీళ్లు తాగే రాగిబిందె, ముగ్గురం కల్సి దిగిన ఫోటో- ఇవన్నీ నాలోకం నుండి ఎంత బయటపడేద్దామనుకుంటానో, వాటి జ్ఞాపకాల గుర్తులు అంత లోలోపలికి విసురుగా వస్తాయి. బహుశా అప్పుడే చావు దాని ఉనికిని పూర్తిగా నా మీద వలలా కప్పేసింది.


డాక్టర్ ఇచ్చిన మాత్రల పవరు ఎక్కువుగా ఉందేమో, వేసుకోగానే మగత నిద్ర వస్తుంది రోజూ. మందులెందుకో చేదుగా అనిపించాయి ఇవాళ. ఏదో పనిగా వెతుకుతుంటే, టేబుల్ సొరుగులో నాన్న కళ్ళజోడు కనిపించింది. నల్ల ఫ్రేమ్, దానికి ఒక అద్దమే ఉంది. నాన్నతోనే ఇంకొకటి సమాధిలోకి జారుకుంది. అదే పనిగా వెతికితే, పాత ఉత్తరాలు కనిపించాయి. వానకి తడిసి ఎండకెండిన కాగితాలకి అంటుకునే మడతలు ఆ ఉత్తరాల నిండా. కొత్త ప్యాంట్ కొనివ్వమని ఒక దాంట్లో, కొబ్బరినూనె అయిపోయిందని మరొక దాంట్లో, క్రిస్మస్ కి ఇంటికి తీసుకుపొమ్మని ఏడుపు ఇంకొక దాంట్లో, కబడ్డీలో మోకాలి చిప్ప కొట్టుకుపోయిందని బాధ మరొక దాంట్లో- అన్నీ నేను రాసిన ఉత్తరాలే. నాన్న రాసినవి ఒక్కటి కూడా లేవు. ఆయన చదువుకుంది అప్పట్లో నాలుగే అయినా, బాగా తెలివుంది. నోటి లెక్కలు బాగా వచ్చు, నాకంటే బాగా. గొలుసు కొట్టు రాత కూడా. ఒకటికి రెండూ సార్లు చదివితే తప్ప అర్థమయ్యేవి కావు ఆయన ఉత్తరాలు అప్పట్లో. అన్నింటిలో ఒకటే రాగం- సరిగా తిను, ఎవరితో గొడవపెట్టుకోకు, బుద్ధిగా చదువుకో. ఈ ఉత్తరాలన్నీ నాన్నే దాచి ఉంచాడేమో? నా హాస్టల్ జీవితం, నాన్నతో నేను గడపని బాల్యం, ఆ ఉత్తరాల్లో చిక్కుకుంది.


నాలుగు రోజుల నుండి ఆగని వాన. ఇలా ఒకేసారి క్లైమేట్ మారిపోగానే నా తీరు మారిపోతుంది. ఇలాంటి ముసురు వాతావరణం బయట ఉన్నప్పుడు, వెంటనే దిగులు మేఘాలు కమ్ముకుంటాయి లోపల కూడా. ఇద్దరి నాన్నల జ్ఞాపకాలు దరిచేరతాయి. చావు నా రోజువారి జీవితంలో విడదీయలేనంతగా భాగమయిపోయిందని మెల్ల మెల్లగా స్పష్టమవుతుంది నాకిప్పుడు. 


Edvard Munch, Melancholy.


Saturday 15 February 2020

సిలకం డబ్బా


ఆ రాత్రి ముత్తయ్య వంతు. అసలైతే వాళ్ళ నాన్న చేయాల్సిన పని ఇది. పొట్టనిండా సారా తాగి సోయలేకుండా పడున్న నాన్నని తిట్టుకుంటూ ఇటొచ్చాడు. ఆ తొందరలో లాంతరు తెచ్చుకోవడం మర్చిపోయాడు. కళ్ళు కుట్టుకున్నా కనిపించనంత చిక్కటి చీకటి. ఆదరా బాదరా నడక. కుమ్మరోళ్ల మూలమలుపు దగ్గర ఎదుర్రాయి కొట్టుకుంది కుడికాలి రెండో వేలుకి. తెల్లతెల్లారి కుప్పనూర్పులకి పోయినప్పుడు కూడా తెలియని చలిసెగ ఇప్పుడు తెలిసొచ్చింది ముత్తయ్యకి. గత్తరపడుతూ ఎడంచేత్తో గట్టిగా నొక్కాడు దెబ్బ తగిలిన చోట. చేతినిండా వెచ్చని రక్తం చిమ్మింది. కింద కూర్చొని, లుంగీ పక్కకి జరిపి, లోన నిక్కర్ గుండీలు తీసాడు. కట కట మని పళ్ళు కొరుకుతూ, బొట్లు బొట్లు ఉచ్చ పోసాడు దెబ్బతగిలిన వేలి మీద. రోట్లో నూరిన ఎల్లిపాయ కారంలాంటి మంట. దీనికంతటికీ కారణమయిన వాళ్ల నాన్నని, కసితీరా అమ్మానాబూతులు తిట్టుకున్నాడు కొద్దిసేపు.

కర్ర పోటేస్తూ మెల్లగా నడిచాడు. చేతి పంపు పక్కనున్న డాబానే కరణం ఇల్లు. వసారా పక్క కిటికీలో గుడ్డి దీపం. అలజడి లేదు. ఎప్పుడో తలుపులేసుకొని పడుకున్నట్లున్నారు. వెంట తెచ్చుకున్న గోనె బస్తా పక్కలా వేసి చతికిలబడ్డాడు వడ్లు గుమ్ము పక్కన. చేతికందేంత దూరంలో పోటు కర్ర పెట్టి, ఇంటి నుండి మోసుకొచ్చిన రగ్గు కప్పుకున్నాడు.

తమది కాని సంపదకి ఎందుకు కాపలా ఉండాలో అర్థం కాదు. ఇప్పటిసంది కాదు, తన చిన్నప్పటినుంచి ఇదే తతంగం. రోజూ రాత్రి ఇంటికొకళ్ళు ఆ సొత్తునంతా కాపాడాలి. తను ముళ్లుగర్ర పట్టుకొని కమ్మోరింట్లో జీతం కుదిరిన మొదటి సంవత్సరం అమ్మమ్మని అడిగినట్టు గుర్తు “ఎందుకు గూడేపోళ్ళు కరణం వడ్లు గుమ్ములకి కాపలా కాయాలి?” అని. అప్పుడు అమ్మమ్మ ముత్తయ్య ఇంకా పుట్టనప్పటి కథొకటి తనకి చెప్పింది.

అప్పట్లో గూడెంలో ఏడంటే ఏడే ఇళ్లట- మూడు మొండితోకోళ్లవి, రెండు వేల్పులోళ్ళవి, ఒకటి మోదుగోల్లది, ఇంకొకటి గద్దలోళ్ళది. ఇప్పుడుమల్లే రోజూ వరన్నం దొరికేది కాదట. ఏ అమావాస్యకో పున్నమికో కమ్మోరింట్లో రెండు గింజలు తెచ్చుకొని వండటమో లేక పొరుగూరులో ఎవరిదయినా పెళ్లైతే ఆ బంతిలో కూర్చొని తినడమో. జొన్నకంకులు లేతగా కాల్చుకొని, వాటిని బంకమట్టితో ముద్దలుగా కలుపుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయట. మొక్కజొన్న చేనుకి పెట్టిన కరెంట్ తీగలకు తగిలిన గేద, గులకలు వేసిన పత్తిచేలో గడ్డితిన్న దూడ, గూడేనికి పండగ వాతావరణం మోసుకొచ్చేవట. చనిపోయిన వాటిని కోసుకుని, మాంసాన్ని ఎండబెట్టి ఇంటిల్లిపాది నెలరోజుల వరకు తినేవారట.

ముసలిదానికి బాగాగుర్తట, ముత్తయ్యవోళ్ళ నాన్న పుట్టిన ఏడు వర్షాల్లేవట. తిండిలేక బాలింతల పాలు ఎండిపోయేంత కరువట. ప్రభుత్వం గూడెపోల్లకిచ్చిన బీడు భూముల్లోవేసిన జొన్నలు, సూర్యుడి ఎండ పొడ పడకుండానే భూమిలోనే కుళ్ళిపోయాయట. కూలికి పోదామంటే రైతుల పొలాల్లో కూడా కాపు అంతంతమాత్రమేనట. రెండువారాలు తినకపోయేసరికి పిల్లలడొక్కలు లోపలికి ఈడ్సుకు పొయ్యాయి. చేసేదేమీలేక ఆడాళ్ళంతా ఒక మాటకొచ్చారు.

ఊరంతటిలో కరణం పొలమే పండింది. పాతవాటిలో వడ్లు పొయ్యడం ఇష్టంలేక, కొత్త వెదురుగుమ్ములు కొనుక్కొని వచ్చాడాయన. కుప్ప నూర్పులకి గూడెపోల్లని పిలిచాడు. ఆరోజు కుప్పకొట్లయ్యేసరికి చీకటిపడింది. కొంగుల్లో పట్టినంత వడ్లు మూటగట్టుకొని, ఒకరి తరువాత ఒకరు మధ్యమధ్యలో చెట్లుచాటుకి ఉచ్చపోసుకోడానికని వెళ్లారు ఆడోళ్లు. గడ్డి తోలేసరికల్లా నాలుగు కుండల వడ్లు పోగయ్యాయక్కడ. పనంతా అయిన తరువాత ఏమీ మాట్లాడకుండా, కూలికొచ్చినందుకొచ్చే మూడుసోల్ల వడ్లు తీసుకొని ఇంటికెళ్లారందరూ. రాత్రిపూట పెద్ద మాదిగ పొలానికి వెళ్లి దాచిన వడ్లు తీసుకొచ్చాడు. సమానంగా పంచుకున్న వాటితో నెలరోజులు సరిపుచ్చారు.

కరువైనా ఆ ఏడు కరణం, వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసాడు. బంతిలో తీరొక్క కూర. పెళ్లి తంతు అందరూ చూసేలాగా ఊరి సెంటర్ లో తెర కట్టించాడు. ఈ చివర నుండి ఆ చివర వరకు మెయిన్ రోడ్డు రెండువైపులా చిచ్చుబుడ్డి లైట్లు వెలిగించాడు. తాగినోడికి తాగినంత. అదిగో ఆ రందిలో పెద్దమాదిగ బాగా తాగి నోటికొచ్చినట్టు తిట్టాడట. పనిలో పనిగా కరణాన్ని ఆడాళ్ళంతా ఎలా మోసంచేశారో చెప్పేశాడు. తెల్లారే ఊరంతా పంచాయితీ పెట్టారు. 'బరితెగించిన ముండల మదం తగ్గించాలని' కమ్మోళ్ళు కూడా కరణంతో జతకట్టారు. కొరడా దెబ్బలైతే, వంటిమీద గాయాలన్నీ నెలరోజుల్లో తగ్గిపోతాయని, ఎన్నడూ వినని శిక్ష విధించారు- ఆడాళ్ళంతా పదేళ్లు కరణం ఇంట్లో ఒట్టిగా పనిచేసేట్టు, మగోళ్లంతా ఆయన సంపదని ఎల్లకాలం కాపలా కాసేట్టని తీర్పు.

అదిగో ఆ తరం నుండి ఈ తరం దాకా తాము అనుభవించలేని సంపదని బహు జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు గూడెపోళ్ళంతా.

ముత్తయ్యకి ఇదంతా చేయని తప్పుకి మోస్తున్న శాపమల్లే తోచింది. ఏమాత్రం అక్కరకిరాని ఈ కాపలా పని ఇంకా చేయిస్తున్నందుకు పెద్దోళ్లని కోప్పడ్డాడు మనసులో. నిద్ర కాచి కాచి అలసిపోయాడు.

ఊరంతా కమ్మేసిన నిద్రా మేఘం ముత్తయ్యని కూడా తన ముసుగులోకి లాక్కుంటూంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. కొట్టంలోనుండి దూడల మెడలో కట్టిన గంటల శబ్దం లీలగా వినపడుతుంది. రెప్పవాల్చి తెరచేలోగా, రెండు పొద్దుల జామును ఎవరో తినేసినట్టు అనిపించింది ముత్తయ్యకి. అంతకమునుపు లయబద్ధంగా వినిపించిన గంటల శబ్దం కాస్తా, శృతి తప్పినట్లయింది. పశువుల పాకనుండి శబ్దంలేని అడుగులు. కొద్దిక్షణాల మౌనం. వెనువెంటనే, రెండు బక్కపలచటి రూపాలు గోడదూకి చీకట్లో కలిసిపోయాయి. 'ఇదంతా కల కాబోలు' అని, ముత్తయ్య మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

తెల్లారుజామున కొట్టంలోనుండి కరణం అరుపు. తోకమీద వాల్తున్న ఈగలను అదిరేయకుండా, కదలకుండా పడుంది ఓ బర్రె దూడ. కళ్ళన్నీ ముత్తయ్యవైపే. 'గులకలు పెట్టి చంపేశాడనే' అభియోగం నెత్తినేశారు. తన మాట చెప్పుకోడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నిర్దోషిత్వం నిరూపణకి కాగే వేడి నూనె సిద్ధం చేశారెవరో. ముత్తయ్యని పదిమంది రాళ్లపొయ్యి దగ్గరికి నెట్టారు. నూనెలో చెయ్యి పెట్టగానే, పూర్తిగా నీళ్లు వడవని పిచ్చిరొట్టె పొయ్యిలో పెడితే వచ్చే వింత శబ్దం వచ్చింది. సచ్చిన బర్రెలను కూడా తినే గూడెంలో పుట్టినందుకు తన్ను తాను తిట్టుకున్నాడు. చెయ్యనితప్పుకి దెబ్బలు తిన్న మూగజీవల్లే ఇంటిబాట పట్టాడు. 

గూడెంలో పండగ సందడి. గొడ్డుమాంసం పచ్చివాసన. కరణమోళ్ళ ఇంట్లో సచ్చిన దూడ, ఇప్పుడు కుప్పలు కుప్పలుగా తాటాకుల మీద నిద్రపోతుంది. మెడ కోసిన చిలుంపట్టిన కత్తిని తాటాకు మూలకి విసిరేశారు. బేసిన్లో పట్టిన రక్తం గడ్డకట్టి చిన్ని చిన్ని ముక్కలుగా విరిగిపోతుంది. పోగులేసిందే తడవుగా చిల్లులుపడ్డ తపేలాలు, సొట్లు పడ్డ కూర సట్టెలు ఒకటే గోల. ముడుసుబొక్కల పంపకం దగ్గర ఎప్పటిలాగే గొడవ. అది నెమ్మదించిన తరువాత ఎవరి వాటా వాళ్ళు తీసుకొని, పొయ్యిగడ్డల వేడి మంటల దగ్గరకి గుమికుడారు, నిప్పులమీద పేగులు పెట్టి కాల్చుకోడానికి.

ఇదంతా ఏమీ తెలియని ముత్తయ్య, కుడిచేతికి కండువ కప్పుకొని, మూలుగుతూ ఇంటికెళ్లాడు. చేతి కట్టు చుట్టూ ఈగల గోల. ఇంట్లో ఎవరూ లేరు. తడిక దడివాలుకి ఆనించిన నులకమంచం వాల్చి పాకకింద నడుంవాల్చాడు. అప్పటికే బొబ్బలెత్తింది చెయ్యి. నొప్పి భరించలేక ఏడ్చాడు. ఎంతసేపున్నాడో తెలీదు కానీ, కన్ను వాలింది. మెలుకువ వచ్చేసరికి నాగరత్నం కొంగుతో చెంపలమీద ఎండిపోయిన నీటిచారికలను తుడుస్తుంది. చేతికి ఎదో పసర రాసినట్టుంది, చల్లగా ఉంది. వీపువెనకాల చెయ్యేసి కూర్చోబెట్టింది. ఇంటిదగ్గరనుండి తెచ్చిన మాంసంతో ముద్దలు కలిపి తినిపిస్తుంది. పళ్ళెంలో తెచ్చిన అన్నం పెడ్డలు అయ్యేంతవరకు తలదించుకుని మౌనంగా ఉంది. కంట్లో నిండి కారిన కన్నీటి చుక్క ముక్కు పుడకమీద పడి మెరిసింది. ముత్తయ్య తన కుడిచేతివేళ్ళ మధ్య నాగరత్నం ఉబ్బిన మొహాన్ని తీసుకొని తల పైకెత్తడానికి ప్రయత్నించాడు. వద్దన్నట్టుగా చేయ్యితో వారించి, ముత్తయ్య వళ్ళో తల పెట్టుకొని ఎక్కిళ్ళు పెట్టుకుంది. “నాకేం కాలేదే పిచ్చిదానా ఎందుకేడుస్తున్నావని” నాగరత్నంని ఊరడిస్తూ, ఆమె తలమీద ఇంకో చేత్తో నిమిరాడు, చెయ్యిమంటని మౌనంగా లోలోపలే భరిస్తూ.

***

నాగరత్నం మనుషుల్ని అంతతేలిగ్గా నమ్మే వ్యక్తి కాదు. కానీ ముత్తయ్యంటే ప్రాణం. కొవ్వొత్తి వెలుగులో మెరిసే వంటిరంగు, పంటిబిగువున అణుచుకున్నట్టుండే సన్నటి నవ్వు. మధ్య పాపిడి నుదుటి దగ్గర నెలవంకలాంటి సిలకం బొట్టు. దోవెంట నడుస్తుంటే, పట్టీల చప్పుడు సందడితో తన రూపం ముందుగానే అందరికి తెలిసిపోయ్యేది. గౌను లోంచి ఓణీలలోకి వచ్చేదాకా నాగరత్నం ఏ పొరుగూరూ పొయ్యింది లేదు. ఊహతెలిసిన దగ్గరనుండి ఇంటిదగ్గర ఉన్నట్టు జ్ఞాపకం కూడా లేదు తనకి. పత్తిచేను కలుపుల్లో దోస్తులతో వానగుంటలాడుకుంది. పాలమొక్కజొన్న బంగారు తీగలతో జడలు అలంకరించుకుంది. నారుమడి బురదలో సమర్తాడింది. తన వయస్సు పిల్లల్లో అందం పట్ల ఉండే శ్రద్ధ తనకి బొత్తిగా లేదు. తీరొక్క బట్ట కట్టుకుని మురిసిపోయ్యే స్తోమతా లేదు. అదేంటో కానీ, తను ఏమి కట్టినా బట్టకే అందమొచ్చినట్టుండేదని గూడెమంతా చెప్పుకునేది.

చీముడుకారే ప్రాయం నుండి చూసినోడే కాబట్టి ముత్తయ్యకి నాగరత్నం ఏమంత ఆకర్షణీయమైన మనిషిలా ఎప్పుడూ కనిపించలేదు. ఉప్పుబిర్రలాటలో వీపుమీద ఒక్కటేసినా, ఐసిరాటలో ఒకరి శ్వాస  వేడిగాలి ఇంకొకరికి  తగిలేంతలా దగ్గరగా మసులుకున్నా, ఇష్టం అనే తలంపు ఎప్పుడూ కలగలేదు. కానీ, మొన్నొక రోజు, పసుప్పచ్చటి రంగు చీరకట్టుకొని పెద్దమాదిగ కూతురి పెళ్ళికి వచ్చింది. ఎప్పటిలానే నూలుపోగోడా అని వెక్కిరించింది (ఇరవై సంవత్సరాలు వచ్చినా ఇంకా మీసం కూడా రాలేదని ముత్తయ్యకి తిరపమ్మమ్మ పెట్టిన పేరది). అన్నం బంతిలో ముత్తయ్య బగారా వడ్డిస్తుంటే, కూరగిన్నె తీసుకోమని చెయ్యిసాచింది. గరిటె వేడికి చెయ్యంతా చెమటపోసి, ముత్తయ్య చెయ్యి పట్టుతప్పి గిన్నె పడబోయింది. అది కిందపడకుండా చేస్తున్న ప్రయత్నంలో నాగరత్నం ఎడంచెయ్యి గాజు ముత్తయ్య చేతికి చిక్కింది. ఆ క్షణం ముత్తయ్యని మాటల్లో చెప్పలేని భావమేదో ఆవహించింది. ఇంతలో గబుక్కున తేరుకొని, రెండు చేతులతో గిన్నెని పట్టుకొని, నెత్తిమీద ఒక్కటి కొట్టింది నాగరత్నం. రెండడుగులు ముందుకేసి వెనక్కితిరిగి శబ్దంలేకుండా నవ్వింది. అదిగో అప్పటినుండి ముత్తయ్యకి మనస్సు ఉండబట్టడం లేదు. ఆ రాత్రి వంటిమీద కాసిన్ని నీళ్లు చల్లుకుని, నులకమంచంలో వాలి, చుక్కలు కప్పుకున్న మబ్బుల వైపు చూశాడు. ఇంతకిమునుపు వాళ్లిద్దరి మధ్య జరిగిన విషయాలన్నీ తనకిప్పుడు కొత్తగా కనిపించాయి. వాటికన్నింటికి ప్రేమ అనే పేరు పెట్టుకున్నాడు.

ఇదివరకు తనంటే ఇష్టమని గౌల్లోళ్ళ నాగులయ్య మనమడు వాగు దగ్గర నాగరత్నం చెయ్యి పట్టుకున్నాడు. అరిచి గోల చేసింది. పోయినేడాది ఎండాకాలంలో పెద్దబళ్ళో నాటకాలు చూట్టానికి రాత్రిళ్ళు పోతుంటే, పెద్ద కమ్మోరోళ్ల అబ్బాయి గోడపక్కకి లాగాలని చూసాడు. రాయిచ్చుక్కొట్టింది. అంతెందుకు, ఆఖరికి ఆర్.యమ్.పి డాక్టరోల్ల పత్తికి పోతే, మంచినీళ్లు తీసుకురావాలనే నెపంతో గది దగ్గరికి రమ్మని తలుపు గొళ్ళెం పెట్టాడాయన. వాడి భార్య ముఖం చూసి చేతికందిన కత్తితో చీరేయకుండా వదిలిపెట్టింది.

కానీ, ముత్తయ్య సంగతి వేరు. చాలామందిలా తన మీద మనసుపడి పిచ్చి పిచ్చి వేషాల జోలికి వెళ్లకపోవడంతో వెంటనే నచ్చేసాడు. ఆపైన వరస కూడా. అప్పటినుండి బాహాటంగానే ఇద్దరిమధ్య ఏదో ఉన్నట్టు తెలిసేలా నడుచుకునేవాళ్ళు. నిజం చెప్పాలంటే, ఇద్దరు ఒక్కదగ్గర ఉన్నప్పుడు లోకం గురించి వాళ్ళకి పట్టేది కాదు. ఆడదిక్కులేకుండా బోసిగా మూలుగుతుండే ముత్తయ్య ఇంటిముందు, కల్లేపు చల్లి ముగ్గులు పెట్టేది. ముత్తయ్యోళ్ళ నాన్న నోటినుండి కోడలుపిల్లా అని అనిపించుకోడానికి ఇంట్లోపనులు మచ్చటంగా చేసేది. "మా ముత్తిగాడికి ఎర్రగుండె పిల్లని చూసి పెళ్ళి చెయ్యాలిరా" అని ఆయన పరాచికంగా ఎప్పుడైనా ఎవరితోనైనా అంటే, అప్పుడుదాకా పాట పాడుకుంటూ  ఊడ్చి కసువు కుప్పేస్తున్నదల్లా, ఎర్రగా ఒక చూపుచూసి, చీపురు ఆయన మీదకి విసిరేసి వెళ్ళిపొయ్యేది. ముత్తయ్యతో జరిగింది చెప్పుకొని అలక నటించేది.      

ముత్తయ్య కనకాంబరాల మాల ఇస్తే, తననే జడలో గుచ్చమని వెనక్కి తిరిగి నుంచునేది. పూలు పెడుతుంటే, తనకి దగ్గరగా ఉండాలని కాళ్లవేళ్ళ మీద నిక్కుంటూ, వెనక్కి జరిగేది. కూలికిపోయినపుడు మాపటేల అన్నం దగ్గర, ముద్దలు కలిపి క్యారేజీ గిన్నెలో పెట్టి, ముత్తయ్యకి తినమని ఇచ్చేది. ప్రేమ ఎక్కువై ఎప్పుడన్నా ముత్తయ్య కౌగిలించుకోవాలని చూస్తే, రెండు చేతుల మధ్యలో దూరి, జుట్టుపట్టుకొని తలవంచి, మెత్తని చెవి భాగాన్ని  కొరికి పారిపొయ్యేది. ముత్తయ్య పొద్దస్తమానం వళ్ళు ఆగమయ్యేలా కష్టపడినా, రాత్రిళ్ళు నాగరత్నం వళ్ళో పడుకున్నపుడు మాత్రం, ఆ కష్టమంతా ఇట్టే మరచిపొయ్యేవాడు.

పసర ఎండిపోయినట్టుంది. చెయ్యిమంట ఎక్కువవుతుంటే, ముత్తయ్య నొప్పి భరించలేక మెలికలు తిరుగుతున్నాడు. నాగరత్నం పసర పిండాలని ఇంకొన్ని బెల్లపాకుల కోసం వెతుకుతుంది. నాగరత్నంని వెతుక్కుంటూ వచ్చిన జానకమ్మ ముత్తయ్య ఇంటి దగ్గర ఆగింది. కూతురి గొంతులా అనిపించేసరికి, మెల్లగా ఆ మాటలు విందామని తడికమాటున దాక్కుంది. ముత్తయ్యతో తన కూతురు ఇలా చనువుగా ఉండటం ఆమెకి ఇష్టం లేదు. ఇదివరకు ఓ రెండుసార్లు నాగరత్నంకి భయంచెప్పినా తన తీరు ఏమి మారలేదు. ఎవరు చెప్తే నాగరత్నం మాట వింటుందో, వాళ్ళదగ్గరికే వెళ్ళింది జానకమ్మ.

2

చిన కమ్మోరు జానకమ్మ చెప్పింది విని, నాగరత్నం బాగుకోరే వాడిగా ఒక ఇల్లరికం సంబంధం తెచ్చాడు. ఆ మనిషి మెతకగా కనిపించినా, సంబంధం కమ్మోరు తేవడంతో ఏమనలేకపోయింది జానకమ్మ. రెండురోజుల్లో పప్పన్నం, వారంలో పెళ్లిని ఖాయం చేశారు.  

వేరే మనిషితో పెళ్లి అనగానే నాగరత్నంకి ఊపిరాడలేదు. ఉన్నపాటుగా ముత్తయ్యతో పారిపోవాలనిపించింది. తీరా రెండురోజులకే పెళ్లిపీటల మీద కొత్త మనిషిలా కూర్చుంది. పెళ్ళైన కొత్తల్లో “ఒరే... ముత్తయ్యో” అని ఎవరు ఎవరిని పిలిచినా గుండె దడగా ఉండేది నాగరత్నంకి. అలా పిలుపు వినపడిన ప్రతిసారి కాళ్ళు ఇంట్లో నిలవకపొయ్యేవి. ఏదో ఒక సాకుతో పాక బయటకొచ్చి రోడ్డెంట వెళ్లే మనిషిలో తనకి తెలిసిన ముత్తయ్య కనిపిస్తాడేమోనని ఆశపడేది. 

ముత్తయ్య చివరిసారిగా  నాగరత్నంని ఎదురింట్లో నలుగేసేటపుడు చూసాడు. ఆమె ముఖంలో తను ఊహించిన బాధ కనిపించలేదు. అలా అని ఆనందం కూడా లేదు ఆ ముఖంలో. పసుపు రాసేది తనకి కాదన్నట్టు నేల చూపులు చూస్తూ మిన్నుకుండిపోయి కూర్చుంది. దగ్గరకెళ్ళి ఏ విషయమో తేల్చుకునేటంత తెగువ లేదు ముత్తయ్యకి. అసలు తనలోపలి భావాలు బయటకి చెప్పడం తెలీదు. కొన్నిసార్లు చెప్పాలని ఉన్నా, మాటలు కూర్చడానికి తడబాటు పడతాడు. ఈ రోజు మాత్రం అణచుకోలేంత దిగులు, మింగుడుపడని కోపం బయటకొచ్చేశాయి. సంచిలో గుడ్డలు పెట్టుకొని ఇంట్లో నుండి వచ్చేసాడు. ఎటు వైపు వెళ్తున్నాడని వాళ్ల నాన్నకి కూడా ఏ మాట చెప్పలేదు. అదే చివరిసారి, ఆ ఊరి గాలి పీల్చడం. తనదికానిదేదో పోగొట్టుకొని, ఆత్రంగా వెతుక్కునే పిచ్చోడికిమల్లే, పట్నం పారిపొయ్యాడు.

బతుకుతెరువనే నెపంతో తనకి దూరంగా ఎన్నో మైళ్ళు వచ్చేశాడు. రెండురోజులు పనికెళ్ళి, ఐదురోజులు నిషా మత్తులో ఉండేవాడు. డబ్బులు కూడబెట్టుకోవడం చేతకాక మేస్త్రీ దగ్గర మోసపోయాడు. ఊరికి, జీవితానికి దూరంగావచ్చేసి ఏడెనిమిది సంవత్సరాలయ్యాయి. ఈ ఎడబాటు కాలంలో, తన ప్రమేయం లేకుండానే తనవి కాని ఆలోచనలన్నీ తన మనస్సుమీద పేరుకుపొయ్యాయి. చుక్కల పమిటల్లో, ముడతలుపడిన చీరల్లో నాగరత్నంని ఎన్నోసార్లు వెతుక్కున్నాడు. రోడ్డుపక్క టిఫిన్ బండ్లలో అన్నం తింటున్నప్పుడో, రూంలో మిగిలిపోయిన పచ్చడిమెతుకులు తింటునప్పుడో, నిండు పున్నమి రోజుల్లో అన్నం తినమని బ్రతిమిలాడిన నాగరత్నం మొహం ఒక్కోసారి గుర్తొచ్చేది. అలా తను మదికొచ్చినప్పుడల్లా, అప్పటిదాకా భారంగా ఏరుకున్న బ్రతుకు జ్ఞాపకాలన్నీ ఖాళీగా తోచేవి ముత్తయ్యకి.

ఓ రోజు మూడో అంతస్తు పిట్టగోడకి సెంట్రింగ్ పెడుతున్నాడు. గోడ మూడు పక్కలయిపోయి, ఇంకో పక్కే ఇనుప షీట్లు కొట్టే పనుంది. అందుకే సూర్యుడు నెత్తిమీదకొచ్చినా అన్నానికి లేవకుండా పని పూర్తి చేయాలనుకున్నాడు. కిందనుండి ఇంకో మనిషి ఇనుప షీట్లు పైకి అందిస్తుంటే, వాటిని పట్టుకున్నప్పుడు, ఎండ వేడికి సుర సుర మని మండిపోతున్నాయవి. మేకుల డబ్బా పెట్టుకోడానికి జాగా లేకపోయేసరికి ఓ పదిమేకులు నోట్లో పెట్టుకొని, సుత్తితో షీట్ల మీద కొడుతున్నాడు. ఆ రేకుల శబ్దంలో కిందనుండి ఎంత పిలిచినా వినపడక పలక్కపోయేసరికి, చిన్న ఇటుకపెడ్డ తీసుకోని ముత్తయ్య వీపుకి తగిలేలా విసిరేశాడు మేస్త్రి. ఏంటి అని బదులిచ్చేసరికి మేకులన్నీ నోట్లోనుండి జారిపడ్డాయి. తొందరగా కిందకి దిగమని సైగ చేస్తున్నాడు మేస్త్రి. సుత్తి కింద పడేసి మెట్ల నుండి కిందకి దిగుతుంటే, తలపాగా పెట్టుకున్న చిన్నాన్న కనిపించాడు. పొద్దునెప్పుడో వచ్చాడట సిటీకి వెతుక్కుంటూ, రూంకి వెళ్లి అడిగితే ఇక్కడికి పంపారని ముత్తయ్యకి చెప్పాడు.     

కంకర మీదున్న ప్లాస్క్ నుండి టీ వంపుతుంటే, “నాన్న చనిపొయ్యాడురా ముత్తిగా” అని వాటేసుకొని పొగిలి పొగిలి ఏడ్చాడు. ఊర్లో బయలుదేరిన దగ్గరనుండి అణుచుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా బయకొచ్చేసింది వాళ్ళ చిన్నాన్నకి. ముత్తయ్యకి ఏం జరుగుతున్నదో అర్ధమయ్యేలోపు మేస్త్రి వచ్చి రావాల్సిన కూలిడబ్బులని కొన్ని నోట్లు జేబులో పెట్టాడు. తలకొరివి పెట్టాల్సిన ముత్తయ్య కోసం గూడెం జనం ఎదురుచూస్తున్నారు. ఇంటికి చేరుకునేలోగా పొద్దుపోతుందని ముత్తయ్య చెయ్యి పట్టుకొని వాళ్ళ చిన్నాన్న వడి వడిగా నడుస్తున్నాడు. ఊరికి పొయ్యే బస్సెక్కి రెండు టిక్కెట్లు తీసుకొని వెనక కూర్చున్నారు. రోడ్డు ఎగుడు దిగుడులకి బస్సు ఊగుతుంది. ఇవేమి ముత్తయ్య అనుభవంలోకి రావడంలేదు. కంటిరెప్ప కొట్టకుండా తదేకంగా దేనినో చూస్తున్నట్లుంది చూపు. ఊరు దగ్గర పడుతోంది. పక్కనుండి మెల్లగా చిన్నాన్న చలి వణుకులాంటి ఏడుపు. ముత్తయ్యకి మాత్రం తను ఇంటినుండి వచ్చేటప్పుడు నులక మంచంలో కూర్చుని తన వైపే చూస్తున్న వాళ్ళ నాన్న మొహం పదే పదే గుర్తొస్తోంది. ముత్తయ్య ఆయన్ని చూసింది అదే చివరిసారి. “ఇక్కడే ఉండరా” అని వాళ్ళ నాన్న ఎందుకు తనని అప్పుడు ఆపలేదని ఆలోచించాడు చాలాసేపు.

బొందలగడ్డకి ఎలా వెళ్ళాడో, పాస్టర్ గారు మట్టేసేటప్పుడు ఏమి చెప్పమన్నారో, దింపుడు కళ్లెం దగ్గర 'నాన్న…నాన్న' అని పిలిచాడో, లేదో, అసలు ఏమీ గుర్తులేదు ముత్తయ్యకి. కడుపు మాడినా నోరు తెరిచి ఎవరినీ అడగాలని కూడా అనిపించలేదు. ఇంటిముందు ఇసుకకుప్ప మీద పడుకున్న తను, పొద్దున్నే ఎండపొడకి లేచాడు. చెదలు పట్టిన తాటాకుల కప్పు, నెర్లిచ్చిన పందిరి గుంజలు, వాళ్ళ నాన్న చివరి రోజుల ఆనవాలుగా మిగిలిపోయాయి.

తెల్లారి పొద్దున్నే ఎర్రమట్టి తెచ్చి ఇల్లు అలకడం మొదలెట్టాడు, కూలిపోయిన జీవితానికి మళ్ళీ రంగులద్దుతున్నట్టు. వెనకనుండి ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించింది. తిరిగి చూస్తే, పూలగౌను పిల్ల. గాలికి మోహమ్మీద పడిన జుట్టుని సవరించుకుంటుంటే, కనిపించింది కుడిపక్క పన్నుమీద పన్ను, అచ్చం నాగరత్నం కి ఉన్నట్టే. సాయం చేసేదానిలా మట్టితీసుకొని, పలక చెరుపుతున్నట్టుగా, నేలమీద చేత్తో మట్టి రాస్తుంది. దగ్గరికి రమ్మని మట్టిచేత్తో సైగ చేసాడు. నవ్వుకుంటూ దూరంగా పారిపోయింది. ముత్తయ్యకి మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టింది.

***

పెళ్ళైన సంవత్సరానికే కడుపులో ఒక బిడ్డ. దాని మొహమన్నా చూడకముందే భర్త పురుగుల మందు కొడుతూ చనిపోయాడు. కమ్మోరు నోట్ల వెలుగులో, కల్తీ సారా మరణాల జాబితాలో ఇంకొక పేరు ఎక్కిందప్పుడు. అప్పటినుండి ఒక్కదాని రెక్కల మీద ముగ్గురు నెట్టుకురావటం. బ్రతుకు బాగుపడుతుందనే ఆశతో ఉన్న ఏ తోవని వదిలిపెట్టలేదు నాగరత్నం. ఆ దారిలో గాయాలు, వంటికి కొన్ని, మనసుకి ఇంకొన్ని. వెనక్కి రాలేనంత దూరంగా వేరే మార్గంలో వచ్చేసింది తను. అందుకే మళ్ళీ ఇంత కాలం తరువాత ముత్తయ్యని చూసినా కానీ "ఇన్ని రోజులు ఎక్కడున్నావ్" అని కళ్ళతో పలకరింపే గానీ, మునుపటి జ్ఞాపకాలు తనముందు ఏమి పరచలేదు.

ముత్తయ్య నాగరత్నం గురించి కొన్ని మాటలు విన్నాడు. విన్నవన్నీ నిజం కాకపోతే బాగుండు అని మొదట్లో అనుకునేవాడు. పట్నంలో గడిపిన సంధికాలంలో తను ఊహించుకున్న ఆమె రూపం ఇప్పుడు మాయమవుతుంటే యాతన పడ్డాడు. మాటలు ఎలా కలపాలి అని వేదనపడ్డాడు. జీవితంలో ప్రేమ తెలియని దారులనుండి, ఊహించని మలుపుల నుండి పలకరిస్తుంది. ఈసారి అది ముత్తయ్యకి నాగరత్నం కూతురి రూపంలో తారసపడింది. రెండురోజుల మాటల్లోనే ఏదో పాత మనిషితో ఉన్నట్టే, అల్లరిగా ఉండేది ముత్తయ్య దగ్గర ఆ చిన్ని పాప. తనవల్ల ముత్తయ్య, నాగరత్నం, ఇద్దరూ పాత మనుషులైయ్యారు కొద్దికాలానికే.

చిన కమ్మోరుకి ఈ కలయిక నచ్చలేదు. నాగరత్నం ధిక్కారం ఏ మాత్రం రుచించలేదు. తన అధికారం చూపే రోజు కోసం ఎదురుచూశాడు.

తెల్లారిగట్ట కిట్టయ్యని, ముత్తయ్యని, ఇంకా దొంగాదం ని కమ్మోరోల్లు, సవిటి పొలం దగ్గర టేకు దుంగలు ఎత్తుకెళ్లారని లాక్కెళ్లారు. ఆనవాయితీగా వస్తున్న, వాళ్లకు తెలిసిన న్యాయం అమలుపరచడానికి సిద్ధమయ్యారు. పెద్ద మాదిగలు ఇద్దరూ సర్ది చెప్పడానికి ప్రయతించినా వాళ్ళ మాట ఏ మాత్రం పడనియ్యలేదు.

భుజాలంత ఎత్తుగా చుట్టూరా ప్రహరీ గోడ. మిరపకాయ కళ్లమంత ఇంటిముందు ఖాళీ స్థలం. మధ్యలో ఏనుగంత లావుగా ఓ వేపచెట్టు. కొబ్బరి తాడుతో ముగ్గురునీ కట్టేశారు. సిగ్గుదాచుకోడానికి వంటిమీద కడ్రాయర్ తప్ప ఏమీ లేదు. గోడచుట్టూ గూడెం అమ్మలక్కలు, చిన్న పిల్లలు. కిందకి వేలాడుతూ వడలిన ముగ్గురి మొహాలు. ఎంత కొట్టినా వాళ్ళకి కావాల్సిన నిజం చెప్పకపోయేసరికి, పెద్ద కమ్మోరి భార్య దొడ్లో ఉన్న వరిగడ్డి మోకుని పట్టుకురమ్మన్నారు.

వెనక దారిన ఇంట్లోకి దూరి, చిన కమ్మోరికి సైగ చేసింది నాగరత్నం. “మాయ్యా, నీకు పసి పిల్లలున్నారు. కొడితే ఈ ఉసురు వాళ్లకు చుట్టుకుంటుంది. నువ్వు కొట్టొద్దు మాయ్యా ” అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. గడ్డం పట్టుకొని బ్రతిమిలాడినా ఎంతసేపటికి తనవైపు చూడకపోయేసరికి మోకాళ్ళమీద పడింది. గుండెలమీద కొట్టుకుంటూ గట్టిగా ఏడ్చింది. ఇదేమి పట్టనట్టు గుమ్మంకేసి నడిచాడు. గచ్చుమీద దొర్లుతూ కాళ్ళు పట్టుకుంది. రెండు చేతుల్తో కాళ్ళ చుట్టూ దండవేసేసరికి కదలలేకపోయాడు. చిన కమ్మోరికి, నాగరత్నం ముత్తయ్యతో మాట్లాడటం ఇష్టంలేదు. ఆ కోపమే ఇలా బయటకు వస్తుందనుకుంది ఆమె. ఇక ముత్తయ్య ఊసు ఎత్తనని, ఈ సారికి దయ ఉంచి వాడిని వదిలేయమంది నాగరత్నం.

కోపం అణుచుకోలేక గుప్పిళ్ళు మూసి వీపు మీద గుద్దాడు. జుట్టు పట్టుకుని పైకి లేపి, బుసలు కొడుతూ ఇంకో చేత్తో కుతిక పట్టుకున్నాడు." మాదిగ లంజముండా, నాకే నీతులు చెప్పేంతదానివా? నీకు ఈ మధ్య బాగా బలిసిందే" అని చేతి వేళ్ళు అచ్చు పడేలాగా బలంగా కొట్టాడు చెంపలమీద. ఊహించని దెబ్బతట్టుకోలేక తూలి కిందపడిపోతుంటే, జాకెట్ దొరకపుచ్చుకొని బయటకు లాక్కెళ్లాడు. ఒక్క ఉదుటున కుడికాలితో రొమ్ములమీద తన్నేసరికి, వంటగది గుమ్మం గుద్దుకొని, తలుపు బయటున్న కుడితి తొట్టె దగ్గర పడింది. పక్కనున్న రోకలిబండ తీసుకొని కొట్టబోతుండగా, "అయ్యా మీకు దండం పెడతా, దాన్ని వదిలిపెట్టండయ్యా" అని జానకమ్మ కూతురిమీద పడింది దెబ్బకాయడానికి.

రోకలితో కొడితే ముసల్ది చనిపోతుందని జానకమ్మని కూడా కాలితో తన్ని, అంతే ఆవేశంగా రోకలిబండ పట్టుకొని వేపచెట్టు దగ్గరకు వెళ్ళాడు. ముత్తయ్య వంటిమీద రోకలి దెబ్బ పడినప్పుడల్లా గోడ చుట్టూ ఉన్న జనం ఊపిర్లో తడి తగిలింది. ఇంటిముందు మోకు దెబ్బలు ముగ్గురి వంటిమీద చేస్తున్న శబ్దానికి, నాగరత్నం మెల్లగా మూలిగింది. గాలి పీల్చుకుంటున్న శబ్దం రాకపోవడంతో, ముత్తయ్యని కొట్టడం ఆపేసి, చిన కమ్మోరు ఇంట్లోకి వెళ్లిపోయారు. టేకు దుంగలు దొంగాదం ఇంట్లో దొరికాయని సాయంత్రం కట్లు విప్పారు ముగ్గురుకి.
***

ముత్తయ్య వీపుమీద ఉబ్బిన వరిగడ్డి మోకు వాతలు తగ్గిపోవడానికి ఓ మూడు నెలలు పట్టింది. కానీ, నాగరత్నం మంచానపడి మళ్ళీ కోలుకోలేదు. తలకి తగిలిన దెబ్బ, జాకెట్ గుండీలు దగ్గర పడిన వేళ్ళ అచ్చులు తొందరగానే తగ్గిపోయాయి. తగ్గడంతోపాటు ఇన్నిరోజులు చిన్న కమ్మోరుకి కేవలం తన వంటితోనే అవసరం అనే నిజంకూడా తెలిసొచ్చింది. కొంత బలం వచ్చి తన పని తాను చేసుకొనేలోపు, దగ్గు ఎక్కువయింది. 10 రోజుల తరువాత డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే, టీబీ అని కట్టల కట్టల మందులిచ్చాడు. చివరి రోజులంతా మంచం చుట్టూ మందు బిళ్ళల వాసన.

నాగరత్నం మర్నాడే కోలుకుంటుదని, ఇద్దరూ మళ్ళీ కూతురితో కలిసి ఆడుకుంటారని అందరికీ చెప్పేవాడు ముత్తయ్య. రోజులు గడిచేకొద్దీ, తనకి కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. ఓ రోజు పొద్దున్నే వచ్చి నాగరత్నం మొహాన్ని తడిగుడ్డతో తుడిచి, సిలకం బొట్టు పెట్టాడు. కూలిపోతున్న గుడిసెమీద సూర్యుని సన్న వెలుగులా, మిణుకు మిణుకుమంటుంది ఆ చుక్క బొట్టు. ఓపికలేక నిద్రపోతుంది నాగరత్నం. మళ్ళీ ఊర్లో కొచ్చిన ఇన్నాళ్లకు తనని చెంప మీద ముద్దుపెట్టుకున్నాడు.

ఇది జరిగిన రెండు రోజులకి, పొద్దు పొడవని చీకట్లో నాగరత్నం కలిసిపోయింది. "తల్లి చేసిన పాపం చుట్టుకొని పోయిందని" అందరన్నారు. మాయదారి రోగమొచ్చి, గట్టిగా లాగితే చెయ్యి ఊడి వచ్చేటంత బక్కగయ్యింది. ఎంత బక్కగానంటే, బొందలకాడికి తీసుకొని పొయ్యేముందు స్నానం చేయించి పాడె మీద పడుకోపెట్టినపుడు , ఇంకా ఎదగని చిన్నపిల్ల శరీరంలా అగుపించింది నాగరత్నం. “తల్లే అలవాటయ్యి, పిల్లని కూడా అలవాటు చేసింది అదే మనిషికి. మాయ రోగం రాదా మరి” అని దీర్ఘాలు తీశారు కొందరు. ముత్తయ్య ఇంటికొచ్చిన కొత్తలో విన్న మాటలన్నీ మళ్ళీ  రెండోసారి విన్నాడు. ఈసారి బిగ్గరగా.

దినం ఐన మరుసటిరోజు నుండే పొద్దున్నే పనికెళ్లేవాడు ముత్తయ్య. సాయంత్రం ఇంటికొచ్చి కూతురిని ఆడించేవాడు. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో వాళ్ళ నాన్న తనని పెంచడంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఇప్పుడు తెలుస్తోంది ముత్తయ్యకి. అప్పుడు వాళ్ళ నాన్నని తిట్టుకుంటూ నేర్చుకున్న పనులు- బూడిదతో బొచ్చలు రుద్దటం, కట్టెలతో కూరలు వండటం, చేతివేళ్ళ తోలూడొచ్చేలా బట్టలు ఉతకటం- ఇప్పుడు అక్కరకొచ్చాయి.      

కారణం ఏంటో గానీ, ఓ రెండేళ్లు ముత్తయ్య జుట్టు కత్తిరించుకోలేదు. వీపుదగ్గర వరకు వెంట్రుకలు పెరిగిన తరువాత ముడేసుకోవడం మొదలెట్టాడు. నాగరత్నం కోసం తెచ్చిన సిలకం బొట్టు ఇప్పుడు తను వాడటం మొదలెట్టాడు. మొదట్లో వింతగా చూసినా తరువాత అందరూ పట్టించుకోవడం మానేశారు. ఊరి చిన్నబడిలో కూతురి చదువైన తరువాత హాస్టల్ లో చేర్పించాడు.

చిన కమ్మోరికి కూడా మాయ రోగం వచ్చిందని, మందులు, మంచి మాంసం తిని కొద్దిగా కోలుకున్నాడని గూడెంలో మాట. ఒకటి రెండు సార్లు నాగరత్నం పిల్లని దగ్గరికి తీసుకోవాలని చూసాడు కూడా ఆయన. ఆ వెంటనే తన చేతులకి అంటిన రక్తం గుర్తొచ్చి దూరంగా పొయ్యేవాడు. ముత్తయ్య దారెంట కనిపించినప్పుడల్లా మాత్రం చిన కమ్మోరి కళ్ళు ఎర్రగయ్యేవి.

కూతురు హాస్టల్ లోకి పోయిన కొత్తల్లో మనుషులెవరు లేనట్టుగా ఉండేది ముత్తయ్య ఇల్లు. పొద్దున గంజి తాగటం, ఆ తర్వాత వెలితి గురించి ఆలోచించుకోడానికి కూడా క్షణం తీరికలేని పనిలో కూరుకుపోవడం. రాత్రిళ్ళు నీళ్లు పోసుకొని ఆరుబయట పడుకునేవాడు. ఊహసరిగా లేని వయసులో నాటేసిన పొలం దగ్గర పంచుకున్న కొబ్బరి ముక్కని, ఇంటికి తెచ్చిచ్చిన అమ్మ; తను చనిపోయిన తరువాత “ఆకలి...ఆకలి..” అని ఏడ్చినప్పుడు, తడిసిన కట్టెలు సరిగా మండక కళ్ళల్లో పొగ దూరినా, లెక్కచేయకుండా ఉడుకుబువ్వ వండి తినిపించిన నాన్న, చావుకెదురెళ్ళి దాచుకోలేనంత ప్రేమ కురిపించిన నాగరత్నం, వీళ్ళందరూ గుర్తొచ్చినప్పుడల్లా, ఎడం పక్కన కొద్దిగా  నొప్పిగా ఉండేది తనకి. సంక్రాంతి సెలవులకు కూతురు ఇంటికొచ్చినపుడు, బొద్దుగా ముద్దుగా ఉందని సంతోషపడ్డాడు. బెంగపడకుండా అక్కడే ఉండి మంచిగా చదువుకోమని రాత్రుళ్ళు నిద్ర జోకొట్టేవాడు.

కూతురు హాస్టల్ కి వెళ్లిన రాత్రి, ముత్తయ్య పెద్ద మాదిగతో కలిసి తాగాడు. అది కూడా ఐదేళ్ల తరువాత. పళ్ళు సలపరిస్తున్న చలి. వంట్లోకి వెళ్తున్న మందుకు తోడుగా బయట మంటసెగ. మంచుకు తడిసిన కట్టెలనుండి ముదురు గోరింటాకు రంగు నీళ్ల బురుజు పొగలు. మందుచుక్క లోపల పడటంతో, ఇద్దరి మధ్య మాటలు తేలికయ్యాయి. వెలిగించిన చుట్ట ఆరిపోవడంతో నిప్పు తీసుకొని, కాళ్ళు బార్లా చాపుకున్నాడు. "పిల్లని బడికి పంపినావ్ రా" అని పెద్ద మాదిగ అడగ్గానే, పళ్ళు కనబడేలా తలూపాడు ముత్తయ్య. మిగిలిన మందుని కళ్ళు మూసుకుని ఒక్క గుక్కలో తాగి, ఏదో ముఖ్యమైనది చెప్పాలన్నట్టు దగ్గరికి రమ్మని సైగ చేశాడు ముత్తయ్యని- అరే ముత్తిగా ఈ రోజు పొద్దున్నే, పిల్లా, ముసల్ది ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నార్రా మా ఇంట్లో. "మనవరాలు, అమ్మమ్మ గుసగుసలు ఏంటే అని అడిగితే", "ఆడోళ్ల యవ్వరాలు నీకెందుకయ్యా" అని మా ముసల్ది కసిరేసింది అని చుట్ట నోట్లో పెట్టుకొన్నాడు పెద్దమాదిగ. ఈ మధ్య కొన్ని రోజులుగా ముత్తయ్యని ఒక బాధ వెంటాడుతుంది. తన కూతురికి ఆడాళ్ళతో మాత్రమే చెప్పుకునే విషయాలు ఉంటాయి కదా. బాగోగులు చూసుకోడానికి ఇంట్లో ఒక ఆడ మనిషి లేకుండా పోయిందే అని తెగ కలవరపడ్డాడు. పెద్దమాదిగ మాటలకి తాగింది దిగిపోయినట్టయింది ముత్తయ్యకి. ఆరిపోయిన మంట ఎగదోస్తూ, "మామ, నా పిల్లని ఒక కంట కని పెట్టుకుండవే" అని సన్నగా మాట్లాడాడు. అప్పటిదాకా పిల్ల పెళ్లికని కూర్చిన డబ్బు ఎక్కడుందో చెప్పాడు పెద్దమాదిగకి. ఆ తరువాత మంటసెగ సాక్షిగా వాళ్ళిద్దరికే అర్థమయ్యే బాషలో ఏదో మాట్లాడుకున్నారిద్దరు. నాగరత్నం ఇచ్చిన బాధ్యత బరువు దింపేసుకుని, ముత్తయ్య తను ఇంకా చెయ్యాల్సిన పనేదో మిగిలిపోయిందని నిశ్చయంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు, సూర్యుడు ఉదయించే దిక్కువైపు. 
 
నారుమడి దగ్గర చినకమ్మోరు చచ్చిపోయాడని జనం గుమిగూడారు. కుడికాలు మనిషితో సంబంధం లేనట్టుగా పక్కన పడుంది. ఆ దగ్గరలో చిలుం పట్టిన కత్తి. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న చావు, ఊహించని విధంగా పలకరిస్తే, బ్రతుకు చెట్టు కాండం పట్టుకొని ఉధృతిగా పెనుగులాడినట్టుంది ఆయన మొహం. ఘర్షణ జరిగిందనడానికి గుర్తుగా శవం పక్కన ఓ మూలంతా వేసంగి వరినారంతా చెల్లా చెదురయింది. రాత్రంతా కాలువలో పారిన రక్తానికి పొలమంతా ఎర్రబారింది.

ఆరోజు ముత్తయ్య జుట్టంతా కత్తిరించుకున్నాడు. దువ్వెనతో తలదువ్వి, సిలకం బొట్టు పెట్టుకున్నాడు. ఇంట్లోనుండి బయటకొస్తుంటే పెద్దమాదిగ ఎదురొచ్చాడు. అప్పుడు ముత్తయ్య 'రాత్రి చెప్పింది మర్చిపోవద్దన్నట్టుగా' బాధగా పెద్దమాదిగ వైపు చూశాడు . ఒప్పుకోలుగా తల ఆడించేసరికి కుదుటపడ్డాడు. ఖాళీ అయిన సిలకం డబ్బా జేబులో అదుముకున్నాడు. సరిగ్గా అప్పుడే గూడెంలోకి పోలీసు జీపు వచ్చిందని ఎవరో కేకేశారు.

సారంగలో ప్రచురితం అయ్యింది . లింక్

Friday 6 September 2019

రెండో మరణం

మెట్లెక్కి పైకి పోగానే పిట్టగోడమీద వళ్లెరగకుండా ఊగుతున్న గుల్మొహర్ కొమ్మలు. అవి నీ దృష్టిలో పడకుండా బిత్తరచూపులు చూస్తూ నడుస్తావ్. డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ఇంకా బద్దకంగా నిద్రపోతూ ఉంటుంది. చేసేదేమీ లేక కారిడార్లో మందారరంగు పూలదగ్గరే వదిలేసిన నీ మనసు దగ్గరకి శరీరాన్ని కరుకుగా లాక్కొనిపోతావ్. అక్కడనుండి కిందకిచూస్తే ఆటోమేటిక్‌గా ఒక ఊహ తొలుస్తుంది. ఇదేమీ మొదటిసారి కాదు. చూసిన ప్రతిసారీ ఇంతే. ఆ రాతిగచ్చుపై నిన్ను నువ్వు నిభాయించుకోలేని తత్వం. దూకేయాలనే ఉబలాటం. ఒకసారి నీ ఫ్రెండ్‌కి ఇదే మాట చెప్తే–“చాలామందికి ఇలానే అనిపిస్తుందేమోరా! కానీ మనకి రీజన్ అంటూ ఒకటి ఏడ్చింది కదా. దూకితే పైకిపోతామనే భయం కూడానూ.”–నీ సానిటీ లెవెల్స్ తగ్గుతున్నాయని సూచనగా మాట్లాడాడు వాడు.
దూకాలని నీకు మొదటిసారి ఎప్పుడు అనిపించిందో గుర్తు చేసుకుంటావు. లాస్ట్ ఎండ్ సెమ్ ఎగ్జామ్స్‌లో ఇండియన్ ఫిలాసఫీ పేరుతో తన నమ్మకాలని, ప్రెజుడిసెస్‌ని, మీ మీద రుద్దిన ఒకానొక బట్టతల ప్రొఫెసర్‌ని పిట్టగోడ మీద కూర్చొని బండబూతులు తిడుతున్నావ్. ‘సత్కార్యవాద పొజిషన్ తాలూకా మెటాఫిజికల్ అజంప్షన్స్’ అనే ప్రశ్నకు ఏమి రాయాలిరా? అని అడుగుతున్న మీ ఫ్రెండ్‌గాడి ముఖం చూళ్లేక కిందకి చూశావ్.సరిగ్గా ఆ క్షణం నీకనిపించింది దూకెయ్యాలని. ఆ ఆలోచన మెదడులోకి రాగానే జివ్వుమనే ఒక కేక. అది వీపు కిందనుండి పక్కటెముకలోకి దూరి కాళ్ల కింద దాక్కొని పాదాలను అటూ ఇటూ ఊపింది. పిల్లర్‌ను ఆనుకొని నిల్చొన్న కళ్లజోడమ్మాయి నీ రెక్క పట్టుకొని లాగకపోతే, ఇలాంటి వింత ఆలోచనలు రావడానికి నువ్వంటూ ఉండేవాడివి కాదు లోకంలో ఈ రోజు.
అదిగో అలాంటి టర్బులెంట్ టైమ్‌లో పరిచయం అయింది తను నీకు. లెక్చర్ హాల్లో మూలన కూర్చొని రాసుకుంటున్న నిన్ను చూసి నవ్వింది. ‘ఏదో పరధ్యానంలో ఉండి అలా చేసిందేమో’ అని నీ పని నువ్వు చేసుకుంటూ పోతావ్. బ్రేక్‌లో టీ తాగుతుంటే వచ్చి “అంత బోరింగ్ టాక్‌లో కూడా నోట్సు రాస్తారా” అని నవ్వుతుంటే, నువ్వు గీసిన పిచ్చి కార్టూన్ గీతలు చూపెడతావు. అలా ఇబ్బందిగా మొదలైన మాటలు ఇష్టంగా మారి మీ ఇద్దరినీ దగ్గర చేశాయి.
మొదట్లో తనతోనే ఉండాలని, తన మాటలే వినాలని ఉండేది. ఈ మధ్య చిన్న మార్పు. కప్పిపుచ్చుకోవడానికి దొంగవేషాలు, నంగి మాటలు, అబద్ధాలు. నీకు తనంటే ఇష్టం లేదని కాదు. కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, నీతో నువ్వే మాట్లాడుకోవాలని, నీతో నువ్వే ఉండాలని. అదిగో అలాంటిదే ఈ ఫేజ్. మభ్యపెట్టడం ఎందుకని తను ఇంటినుండి రాగానే చెప్పేద్దామనుకుంటావ్.
తన నుండి ఫోన్. నిశ్శబ్దంగా వింటున్నట్టు నటిస్తుంటావ్. అవిరామంగా పొర్లుతున్న తన మాటల సందడి మధ్యలో అడుగుతుంది “నన్ను మిస్ అవుతున్నావా?” అని. తను చెప్పే కబుర్లకి సమాంతరంగా నీ మనసులో మెదులుతున్న ఆలోచనల కొసలని మూటగట్టి, ఏమి చెప్పాలా అని ఆలోచిస్తుంటావ్.
నీ నిశ్శబ్దం వెనుక ఒక బరువైన ఎమోషన్‌ని తనే ఊహించేసుకున్నట్టుగా తడబడిన మాటలు. “ఎంత కష్టంగా ఉందో కదా! నేనే ఎక్కువ బాధపెడుతున్నా నిన్ను.”
తడికళ్ళల్లో ఓ మెరుపు. తన కల్పనని నీది చేసుకొని, మాటలు అల్లడం మొదలెడతావు–నిన్న రాత్రి కలొచ్చిందని, పొద్దు పొడిచేదాకా ఎర్రటిచూపుల్తో ఒకరి దేహాన్ని ఇంకొకరు కోసుకు తిన్నారని, పాదం అడుగుభాగం నుండి చెవివెనక నున్నటి చర్మం వరకు తడిగుర్తులు వదిలావని. ఇలా తన అమాయకపు ఊహకి, నీవొక్కడికే సొంతమైన అనుభవాలను అలుకుతావ్.
ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు, సిగ్గుతో నవ్వి, ఆ తరువాత తనొదిలే వేడిగాలి తాకేలా, తను వీపునానుకొని కూర్చోవాలనుకుంటావు.
కొన్ని నిమిషాలు అయిష్టంగా మాట్లాడిన తరువాత, ఫోన్ పక్కన పెట్టేసి నీ లోకంలోకి జారుకుంటావు.
స్పాంటేనియస్‌గా ఇంతకుమునుపు అల్లిన కథలో, సగం చెక్కి వదిలేసిన జ్ఞాపకాలకి, నీ వెర్రితనంతో కొంత మెరుగులు దిద్దే పనిలో పడతావ్. వంటి మీద ఏ రంగు దుపట్టా ఉంది, నుదుటి మీద ముద్దు పెట్టేటపుడు కళ్ళు మూసుకుందా లేదా, తన వేళ్ళు నీ జుట్టులోకి పోనిచ్చి ముద్దు చేసిందా లేదా, మెడ కింద ముద్దు పెట్టేటపుడు కంఠపు నరం అటూ ఇటూ ఊగిందా లేదా… ఇదిగో ఇలాంటి నీకు నచ్చే డిటైల్స్ అన్నీ గుంభనంగా అద్దుతావు ఆ కలకి. సరిగ్గా అప్పుడే కలకి-నిజానికి, కల్పనకి-యథార్థానికి మధ్య ఉండే అడ్డుగోడ చిన్నగా నెర్రెలిస్తుంది.
ఇదివరకొకసారి ఇలాగే నువ్వు కట్టుకున్న గూడులో ఏముందో తనకి చూపించాలనుకున్నావ్. తూకం వేసినట్టు అతిజాగ్రత్తగా మేలిమి పదాలు వాడుతూ, మబ్బుల్లో చుక్కలు పరిచినట్టుగా తన ముందు నీ లోపలి జీవితాన్ని పరిచావు. నీ మనసు సరిగా తెలియక, తన ముందు రాశిగా పోసిన నీ ఊహలను కూడా, మీరప్పుడప్పుడు ఆడే ప్రేమ దాగుడుమూతల్లో ఒక అంకంలాగా భావించి నవ్వి ఊరుకుంది. రెండడుగులు ముందుకేసి నీ ఆరాటాన్ని అర్థం చేసుకోలేకపోయింది. వెల్లువలా సాగుతున్న ప్రవాహాలకి ఆనకట్టేసి నిశ్శబ్దంగా ఉండిపోయావప్పుడు.
తను లేని ఖాళీతనాన్ని లైబ్రరీ అరల దగ్గర మరచిపోతావు. అప్పుడప్పుడు రాత్రివేళల్లో నీకు ఏవేవో గుసగుసలు వినిపిస్తాయి ఆ షెల్ఫుల దగ్గర. దగ్గరగా వెళ్లి చూస్తే మడతలు పడిన పుస్తకాలు, చినిగిన పేజీలు తప్ప ఏమి ఉండవు. కానీ ఆ పక్కన కిందపడిన రెండు పుస్తకాలూ ఏదో చెప్తున్నట్టు ఊగుతాయి. ఊహకందని కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు ఈ లోకంలో ఏదో ఒక మూల కాచుకొని ఉంటాయి కొంతమంది కోసం. అలాంటివారు ఎదురైనప్పుడు ఇదిగో ఇలా వడిలో వాలిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి వాళ్ళని.
వారం తరువాత నీ పలకరింపులో అనాసక్తి కనిపెట్టేసింది తను. బరువైన మాటలు, నెమ్మది అడుగులు, అసందర్భమైన నవ్వు అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంది. పక్కనచేరి మోయలేనంత ప్రేమని చూపిస్తుంటే నీలో నీకే ఏదో గిల్టీ ఫీలింగ్. ధైర్యం తెచ్చుకొని కొన్ని రోజులుగా ఇబ్బందిపెడుతున్న విషయాన్ని తనతో చెప్పేశావు–మొన్న నువ్వు కూడా ఇంటికి వెళ్లావని, మళ్ళీ ‘ఆ అమ్మాయిని’ కలిశావని. తను ఊఁ కొట్టి మౌనంగా ఉంది. తన మూగసైగ అర్థమయ్యి ఇదిగో ఇలాగ జరిగిందని చెప్తూ తన పొట్టమీద ఏవో పిచ్చిగీతలు గీస్తావ్.
…నువ్వు ప్రేమించావనుకున్న అమ్మాయింటికి తన పెళ్ళైన మూడో రోజుకే వెళ్తావ్. గుమ్మందగ్గర కట్టిన మామిడి తోరణం ఇంకా ఎండిపోలేదు. గోడమీద లవ్ సింబల్‌లో తన పేరు మాత్రమే చూసుకుంటావ్. వెడ్స్ కింద ఏముందో కూడా పట్టించుకోవు. టీవిలో ఏవో ఫైటు శబ్దాలు. కొత్తగా అంటుకున్న బాధ్యతల వల్ల చిక్కులు పడిన జుట్టుకి నూనెరాసి మెత్తగా దువ్వుకుంటుంది తను. ఇటుగా వచ్చి కూర్చోమన్నట్టు వడలిపోయిన రెప్పలను మూస్తుంది తను.
అసలు తనంటే అంతలా ఎందుకిష్టమో గుర్తుచేసుకుంటావు నువ్వు. అప్పట్లో నిన్ను సివిల్స్ రాయమని మీ నాన్న ఒకటే పోరు. తీరా నిన్ను ఒప్పించకుండానే నిశ్శబ్దంగా సమాధిలోకి జారుకున్నాడు ఏ హెచ్చరిక ఇవ్వకుండానే. పోతూ పోతూ నీలో సగభాగాన్ని కూడా తీసుకెళ్లాడు. మరణం నీ జీవితంలోకి వచ్చింది అప్పుడే. మీ నాన్నదే కాదు, నీది కూడా. ఆయనతో పాటు నువ్వు కూడా చనిపోయావప్పుడు. నీ మొదటి మరణం.
అప్పుడొచ్చింది నీ లోకంలోకి తను. నిర్జీవమైన నీ సగభాగాన్ని తన దగ్గర కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పింది. జ్వరంలో మాట్లాడే నీ డెలీరియస్ మాటలకి ఊ కొట్టి, తన భుజాన్ని తోడు ఇచ్చింది. మాటల మధ్య మౌనాన్ని, ఒంటరి క్షణాల నిర్వేదాన్ని నీతో పాటే అనుభవించి, నిన్ను పూర్తిగా తనలోకి లాగేసుకుంది. పోయినేడాది యూనివర్సిటీలో జాయినయిన కొత్తలో వచ్చిన కలహం మిమ్మల్ని దూరం చేసింది. ఆశ్చర్యమేమిటంటే ఆ తరువాత ఎప్పుడూ మీరు ఆ గొడవ ఊసు ఎవరిదగ్గరా ఎత్తలేదు. సంవత్సర కాలం ఎడబాటు తరువాత ఇదిగో మళ్ళీ ఇలా.
‘నాలా ఈ లోకంలో నిన్నెవరూ ఇష్టపడరులే’ అని నీతో చెప్పిన ముఖాన్ని వెతుక్కుంటావ్ నలుగైనా ఆరని తన పసుపు ముఖంలో. మౌనం ఇద్దరిలోనూ. కాలం గడ్డకట్టింది. ముందుకు నెడదామని గతం గుర్తుచేస్తావ్. ఉరుముల వానొచ్చి ఇంకా కుదుటపడని తన జీవితంలో మీరిద్దరూ కలిసున్న శకలాలు మసకబారిపోయినట్టు చూస్తుంది తను. విరిగిపోయిన చెక్కకుర్చీలా నిర్జీవంగా చూస్తావ్ తనవైపు.
నీ పక్కగా వొచ్చి మంచమ్మీద పడుకుంటుంది.
తనకిష్టమైంది గుర్తొచ్చింది. అటుపక్కకి ఒరిగి ఎడమచేతి వేళ్ళని తన జుట్టులోకి పోనిచ్చి తలని నిమురుతావ్. ‘బావుంటుందే నువ్వు ఇలా చేస్తే’ అనే మాటకోసం ఎదురుచూస్తావ్. కానీ తను మాత్రం అలానే పడుకొని ఉంది. ఏ అలికిడి, స్పర్శ లేదు, నిశ్చలంగా ఊగని చెట్టులాగా. ఇంతకుమునుపు ఇలా చేసినప్పుడల్లా నీ నరాలు కూడా తిమ్మిర్లెక్కేవి మైకంతో. ఈ సారి నీలో కూడా ఏ కదలికా లేదు.
‘ఆ అమ్మాయితో’ మాట్లాడటం అదే చివరిసారి అని, తరువాత నీకు మెస్సేజ్ పంపినా రిప్లై కూడా ఇవ్వలేదని చెప్తావ్ ఈ అమ్మాయితో…
ఈ విషయం చెప్పకుండా దాచినందుకు మన్నించమని బెడ్ కిందకి జరిగి మెల్లగా తన పాదాలు నొక్కుతావ్. చాలాసార్లు తనకి కాళ్లునొప్పులంటే ఇలానే చేశావ్. నువ్వు ఇలా చేయడం తనకి ఇష్టం కూడా. ఈసారెందుకో తను కాళ్ళు లోపలికి మునగదీసుకుంది.
ఆ రోజు నుండి ముభావంగా ఉంటుంది తను. నీదే తప్పంతా అని రియలైజ్ అవుతావు. తను మాట్లాడే సమయం కోసం ఎదురు చూస్తుంటావు.
తన దగ్గర ఇంకొక విషయం దాచిపెట్టావ్ నువ్వు. ఆ ‘అమ్మాయిని’ కలిసిన రోజు రెండోసారి నీకు చావు సెగ తగిలిందని, పొరలు పొరలుగా నువ్వు కాలిపోతున్నావని.
ఈ లోపు ఇంటికి రమ్మని ఫోను, నాన్న రెండో సంవత్సర స్మరణ కూడిక కోసం. వెళ్తే ఆయన జ్ఞాపకాలన్నీ వెంటాడతాయని భయం. మళ్ళీ మామూలుగా మారాలంటే నీకు సమయం పడుతుంది. ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుంటావ్. ఆ రోజు సాయంత్రం తను నీ హాస్టల్ గది దగ్గరికి వచ్చింది. బెడ్ మీద పడుకుని నువ్వుంటే, తల తీసుకొని తన వళ్ళో పెట్టుకుంది. పట్టలేని దుఃఖం. కూర్చోని తనని గట్టిగా వాటేసుకుంటావు.
నీకు నాన్నకి మధ్య ఏర్పడిన అంతరం గురించి తనకి చాలాసార్లు చెప్పావ్. జీవితంలో వెలితి గురించి తనకొక్కదానికే చెప్పుకున్నావ్. ఎవరి దగ్గరా లేంది, తన దగ్గర కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు.
ఏమైందో కానీ తను ఒక మాట అనేసింది. “మీ వాళ్లేమో ఇంటిదగ్గర, నువ్వేమో ఇలా వెచ్చగా నా కౌగిట్లో.”
ఆ మాట వెనుక దాగున్న తన అంతరంగం ఏదో నీకు బోధపడుతుంది. నీకు బాహాటంగా బాధపడటం రాదు. కానీ నీకు అది ఎలా కలుగుతుందో తెలుసు తనకి. పైపెచ్చు నాన్న ఊసెత్తెసరికి అణుచుకోలేని కోపం కూడా వచ్చింది. బలవంతంగా తోసేసి చెంపమీద గట్టిగా కొట్టావ్. అక్కడనుండి బయటకొచ్చేశావ్, తనని పట్టించుకోకుండానే.
బాధ ఎవరికీ తెలియకూడదు. ఏడుపు ఎవరూ చూడకూడదు. మనుషుల గందరగోళమైన ఫీలింగ్స్‌కి ఎటువంటి సంబంధం లేని చోటు ఏదైనా ఉందా అని నీ జిడ్డుతల చుట్టూ ముసురుతున్న ఈగలు. మూడు గుప్పిళ్ళ పొగతో ఓ ఐదుక్షణాల ట్రాన్స్‌ని కొనుక్కున్న తరువాత, కళ్ళుమూసుకొని చూపంతా చీకట్లు నింపుకుంటావ్. నీకు నచ్చని ఒక జీవి నీ వైపే నడుస్తూ వస్తుంది. కక్కడానికి దాచుకున్న మొహమాటమంతా ఇంకిపోయుందని తెలిసి, చీకట్లో తొక్కిన పాములా సర సరా వెలుగులోకి పారిపోతావ్. ఎదురుగా సోషల్ సైన్స్ జంక్షన్. కుడివైపు తిరిగి హాస్టల్‌కి పోవాలని నిశ్చయించుకుంటావ్. తీరా, మలుపు దగ్గర ఏదో గుర్తుకొచ్చినట్టు ఆగి ఎడంవైపు అడుగులేశావ్.
మొద్దుగా నిద్రపోతున్న బిల్డింగ్ పేరు మనసులో చదువుకుంటావ్. ఇందిరాగాంధీ మెమోరియల్ లైబ్రరీ.
వీకెండ్ కాబట్టి పుస్తకాల గుంపుల మధ్య రెండు, మూడు తలలు… అక్కరకురాని పాతవస్తువులు విసిరేసినట్టుగా. ‘నీకేం పనిలేదు రా’ అన్నట్టు చూస్తున్న మెట్లపక్క ఒక లడ్డు పుస్తకం. మెట్లెక్కుతూ బోర్లాతిప్పేస్తావ్ దాన్ని ఊపిరాడకుండా. ఫస్ట్ ఫ్లోర్‌లో సైన్స్ గోలలు తప్పించుకొని, రెండో ఫ్లోర్‌లో చివర వరస హిస్టరీ షెల్ఫుల దగ్గర, వెలుగుపడని చోటులో జారిపడతావ్.
ఏదో లోపలికి గూడు తవ్వుకున్నట్టు రెండు కాళ్ళమధ్య తలకాయ. మిరపకాయల టిక్కీలు కాలినట్టు పంజెంట్ స్మెల్. ఎదురుగా ఉన్న పుస్తకాల రూపాలను చిన్ని చిన్ని చుక్కల మెరుపుల్లా చేస్తూ కళ్ళలో ఇంకుతున్న నీళ్లు. ముక్కుల్లోంచి ఊరుతున్న వేడి ఆవిరి. ఎంతసేపు అలా ఉన్నావో తెలీదు. కానీ ఆ తరువాత ఏదో హాయి. చలికంతా మొద్దుబారి ముడతలు పడిన చర్మానికి పొగలు కమ్మే వేడినీళ్లు తాకినప్పుడుండే హాయి అది.
నువ్వున్నావనే స్పృహలేకుండా లైటాఫ్ చేస్తారెవరో. అలవాటైన స్థలం కాబట్టి తడుముకోకుండా మెట్లదగ్గరికొస్తావ్. మేడ కిటికీలోంచి చూస్తే చీకటి కప్పుకున్న బిల్డింగ్ రూపం. చెక్కమెట్ల బల్ల పట్టుకొని దిగుదామనేలోపు థీసిస్ సెక్షన్‌లో వెలుగు గమనిస్తావ్. ఎవరో అని కుతూహలం. లోపలికెళ్తావ్. కుడివైపు గది తలుపు తీసి ఉంటుంది. వెలుతురు నీడ లోపలికి పడుతుంది కానీ ఏమీ కనిపించదు గదిలో. మామూలుగానైతే ఆ గదిలోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పుడా బోర్డు కిందపడి ఉంటుంది. తలుపు నెడతావ్. అదేమో పెద్దశబ్ధం చేస్తూ లోపలి లోయలోకి పడిపోతుంది. లోపలంతా చీకటి శూన్యం. ఎడమకాలు గుమ్మం ఆవల పెట్టి నేలకోసం గాలిలో తచ్చాడతావ్. వెనువెంటనే లోపలికి దూకేయాలనే ఇంపల్సివ్ థాట్. ఆలోచన లేకుండా రెండో కాలు కూడా గాల్లో వేస్తావ్.
…’ఆ అమ్మాయి’ వీధిలో నడుస్తున్నావ్. వాకిట్లో తడిక వేసుంటుంది. కానీ లోపలనుండి కూనిరాగాలు. మెల్లగాదూరి కిటికిలోనుండి తొంగి చూస్తావ్. ఒక్కత్తే దానిమ్మగింజలు వొలుస్తూ ఉంటుంది. నువ్వు రావడం చూసి, తినమని గిన్నె నీ ముందు పెడుతుంది. ఇంట్లో ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక దగ్గరగా లాక్కొంటావ్ తనని. ఊపిరాడకుండా వెనకనుండి వాటేసుకుంటావ్. ఇబ్బందిగా చెయ్యి వదిలించుకోవాలని చూస్తుంది. చెయ్యి వెనక్కివిరచి పెనుగులాడతావ్ ముందుకి, వెనక్కి. అరిస్తే ఎవరైనా వస్తారని కాబోలు గింజుకోవడం తప్ప గోలచేయదు తను. నీ పట్టు విడిపించుకోవాలని కలబడుతుంది. తన మెడ మీద నీ సొల్లంతా కార్చుతావ్.
చివరకి తను గట్టిగా అరుస్తుంది. “నా పర్మిషన్ లేకుండా నా బాడీని ఏమిచేస్తున్నావ్‌రా?”
మిత్రుల దగ్గర నీ ‘ప్రోగ్రెసివ్’ బడాయిలు, ఫేస్‌బుక్‌లో నీ ‘ఫెమినిజం’ నురగలు, డిబేట్లలో నీ ‘విప్లవాల’ మురుగు మాటలు గుర్తొస్తాయి.
తననొదిలేసి మంచంలో కూలబడిపోతావ్. అప్పటికే ప్యాంటు మీద కొంచెం జిగట తడి. తలుపు తీసుకొని గాబుకాడికి వెళ్తుంది తను. రెండు క్షణాల్లో మొహం కడుక్కొని లోపలికొస్తుంది. అప్పటికే వరండాలో కూర్చొని నేలచూపులు చూస్తుంటావ్.
ఇన్ని రోజులూ నీ గురించి నీకే తెలియంది ఇప్పుడు తెలిసొస్తుంది. ఈ అమ్మాయి స్నేహంవల్ల నీలో దాగున్నవే కాదు, ఇంకా మిగతా విషయాలెన్నో తెలుసుకున్నావ్ ఇదివరకు. చర్మానికి అతుక్కున్న పనికిరాని చెడు కుబుసాలెన్నో విదిలించుకున్నావ్. కానీ ఇప్పుడు తెలిసిన విషయం, అంగీకరించడానికి నీకు టైమ్ పట్టేలా ఉంది. చేదు నిజం నిన్ను అసహనానికి గురిచేస్తుంది. తన వైపు చూడటానికి కూడా నీ దగ్గర శక్తి లేదు.
కండువతో మొహం తుడుచుకుంటూ కుర్చీ వేసుకుంది నీ వెనకాల. అటొక కాలు, ఇటొక కాలేసి నిన్ను మధ్యలో కూర్చోపెట్టుకొని నీ తలమీద చెయ్యేస్తుంది.
రెండునిముషాల ఎడబాటు మౌనం తరువాత నోరు తెరుస్తుంది. “పిచ్చి… నువ్వు దూరంగా ఉంటే నేను బానే ఉంటా. ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి? అసలు నీ మొహం కూడా గుర్తు లేదు. తలకి నూనె రాసుకుంటున్నపుడో, కాలికి రాయి తగిలినపుడో, అన్నం ముద్దలు ముద్దలు కలిపి తింటున్నపుడో, నీ తోడు తాలూకా సాన్నిహిత్యం మదికొస్తుంది. మొదట్లో ఇలా గుర్తొచ్చినపుడల్లా ఏడ్చేదాన్ని. ఆ ఏడుపుకు నాకు నేను కారణం చెప్పుకోవాలని ఇలా పిచ్చిగా గోళ్ళతో గిచ్చుకునేదాన్ని (నల్లటి ఇసకగీతలు చేతిమీద). తరువాత తరువాత ఇలాంటి తలంపు రాగానే, నీ మీద కోపం రావాలని, ఏ తెల్లతోలుదానికో నువ్వు అన్నం తినిపిస్తున్నట్టు, ఏ రింగుల జుట్టున్నదానితోనో నువ్వు ఊరేగుతున్నట్టు ఊహించుకునేదాన్ని. కొంచెం మనసు కుదుటపడేది.”
కుర్చీలో కూర్చున్నదల్లా వంగోని నీ జుట్టుమీద గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. ఎప్పుడు తనని ముద్దు పెట్టుకున్నా నీ వేడి తగ్గించుకోవాలనే ప్రయత్నమే కానీ అందులో ప్రేమ ఎప్పుడూ వెతుక్కోలేదు నువ్వు. తన ఇప్పటి ముద్దులో మాత్రం ఈ జన్మకి సరిపోయేంత ప్రేమ నీకిచ్చేసిందేమోనని అనిపిస్తుంది.
మళ్ళీ మాట్లాడటం మొదలెడుతుంది- “…ఇదంతా నువ్వు దగ్గరలేనప్పుడే. నువ్వు కనిపిస్తావా, మళ్ళీ అదే కథ. అదే నువ్వు చెప్తావ్ కదా, నువ్వు యూనివర్సిటీ నుండి ఇంటికొచ్చినపుడు నీకు దానికి సంబంధించిన రూపురేఖలు ఏమీ గుర్తుండవని, ఆ స్పేస్‌తో పూర్తిగా బంధం తెగిపోతుందని, అసలు అటువంటి ఒక ప్లేస్ ఒకటుందా అనేంతలా మరచిపోతావని. ఇది కూడా ఇంతే.
ఇదిగో నువ్వు కనపడగానే, వేపకొమ్మకి కట్టిన చీర ఊయల్లో మన పోట్లాటలు, తొలకరి చినుకుల వేళ జంటగా కిందకి వేలాడుతూ దూసిన చింతచిగురు, మట్టిపొయ్యి గడ్డకు కాళ్ళు నిగడదన్ని ఒకరి వెచ్చని చేతులతో ఇంకొకరి చెంపలను తడమడం, ఇలా గొంతుకోసి దాపెట్టిన అనుభవాలన్నీ మరల చిగురిస్తాయి.
నీకొక విషయం చెప్పాలిరా. మా ఆయనకు నా మనోగాడి స్టోరీ అంతా చెప్పేశా. కోపం లేదు, తిట్టు లేదు. గట్టిగా నన్ను కౌగిలించుకొని ఏడ్చేశాడు. ఇంక అలాంటి పిచ్చిపనులు చెయ్యొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఆయన అలా నన్ను కౌగిలించుకున్నపుడు నువ్వే గుర్తొచ్చావ్‌రా. నీకు చెప్పినప్పుడు కూడా అలానే దగ్గరకు తీసుకొని ముద్దు చేశావ్ గుర్తుందా నీకు?”
ఆ రోజు జరిగింది నీకు గుర్తొస్తుంది. తన చెంపమీద వదలిన నీ విషపుగుర్తులు, అసహ్యమైన బూతుమాటలు. ఇవేమి గుర్తు పెట్టుకోకుండా చివర్లో ఆ రెండు నిముషాల కౌగిలింతను మాత్రమే గుర్తెట్టుకుంది తను.
తన ఆలోచనలకి నీ ఆలోచనలకి, తన ప్రపంచానికి నీ ప్రపంచానికి తేడా నీ ఎరుకలోకి స్పష్టంగా ఇప్పుడే వస్తుంది.
చాలాసేపటిగా నిన్ను ఇబ్బందిపెడుతున్న మాటొకటి బయటికొచ్చేసింది. “నేను నిన్ను బలవంతం చేసినట్టు, ఐ మీన్ ఐ ట్రైడ్ టు రేప్ యూ కదా.”
తడిసిన నీ మొహాన్ని తనవైపుకు తిప్పుకుంటుంది. కళ్ళమీద ముద్దు పెట్టి “అంతకుముందు ఇంకా పిచ్చిగా, మృగంలా ఉండేవాడివిలే. ఇప్పుడే కొంచెం మేలు,” అంటుంది.
బయటకు ఏడ్చేస్తావ్ అప్పుడు.
“ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావ్‌రా!” అని పైకి లేపుతుంది.
….కళ్ళు తెరచి చూస్తే మసక మసకగా కొన్ని ఆతృతతో నిండిన మొహాలు.
నేలమీద పడుకున్నావేంటి? అసలు మాకంటే ముందు లోపలికెలావచ్చావ్? రాత్రి తాళాలేసేటపుడు సెక్యూరిటీ చూసుకోవద్దా? ప్రశ్నల పరంపర. లైబ్రరీ స్టాఫ్ ఒకామె నిన్ను చెయ్యిపట్టుకొని పైకి లేపుతుంది.
తల తిమ్మిరిగా ఉంది. పాచి వాసన. మోకాళ్ళ దగ్గర ప్యాంటు చినిగుంది కొంచెం. చొక్కా వీపుకంతా దుమ్ము. అడుగులో అడుగేసుకుంటూ బయటకి మెల్లగా నడుస్తుంటావ్.
హడావుడిగా తను. ఎర్రగా కందిపోయిన చెంప. నిన్నటి గొడవ గుర్తొచ్చింది. ‘ఐయామ్ సారీ’ అని నీలో నువ్వే ఏదో గొణుక్కుంటావ్.
ఇదేమి తనకు పట్టనట్టు నిన్ను దాటుకొనిపోతుంది రాత్రి తెరిచి ఉంచిన గది తలుపు వైపు.
ఆ రాత్రే నీ రెండో మరణం తాలూకా చితి పూర్తిగా ఆరిపోయింది.
ఈ కథ ఈ మాట లో పబ్లిష్ అయింది. లింక్ 

Tuesday 21 May 2019

ఇత్తరాకుల తట్ట


తడికవతల ఉన్న వీధి స్తంబం లైటు వెలుతురు నీడ సుబాబాకుల్లోంచి టెంట్ మీదకి పడుతోంది. వర్షసూచికగా ఈదురుగాలి చిన్నగా మొదలైంది. ఆ గాలికి టెంట్ నీడ ఎవరో ఊయల ఊపుతున్నట్టుగా అటు ఇటు విసురుగా ఊగుతుంది.


రాళ్ళ పొయ్యి పెట్టి వంటచేసిన జాగా కాడ ఎవరో ఆడమనిసి ఒక్కతే కూర్చొని అన్నం తింటునట్టుంది. ఎవరో చూద్దామని తింటున్న ఇత్తరాకుని ఎడం చేత్తో పట్టుకొని అటుగా నడిచా.


వెంట్రుకల చివర్లు సాంబారన్నంలో నానుతున్నాయనే పట్టింపే లేకుండా తలొంచుకొని ముద్దలు కలుపుకొంటోంది. తన దగ్గరగా వొచ్చి ఆగిపోయిన రెండు చెప్పుల శబ్దాన్ని చూడటానికి తలెత్తింది. ఆ ఎరుప్పచ్చని బల్బు ఛాయలో మేరి పిన్నంని గుర్తుపట్టలేకపోయా. చూసి చాలా రోజులైపోయింది. మునుపటిలా ముఖం తేటగా లేదు. చంద్రుడి మీదుండే ఎన్నటికి మాసిపోని మచ్చలు తన చెంపలమీద, అక్కడక్కడా.


నేనే అని కొంచెం స్థిమితపడి నీరసంగా నవ్వుతూ “చిన్నోడా, వంటలు భలే కుదిరాయి రా. ఎంతైనా శనగపాటోడి కొడుకువనిపించుకున్నావ్ రా.”


ఎవరైనా నాన్న ఊసు ఎత్తితే శబ్దం లేకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకునేవాడిని. కానీ, ఇవాళెందుకో ఏమి మాట్లాడాలో తెలీక అలా నిల్చుండిపొయ్యా.


చీకటి నిశ్శబ్దంలో నా ఇబ్బందిని గ్రహించిందనుకుంటా! ఇత్తరాకుని బల్లమీద పెట్టి చేతికున్న ఒక్క గాజుని వెనక్కనుకొని జగ్గుతో మంచినీళ్లు తాక్కుంటూ “చిన్నె, అమ్మ యాడుందిరా? పొద్దున్నుండి ఒక్కసారి కూడా సరిగా మాట్లాడలే. నాకోసం పిల్సకొత్తవా రా?.”


గొంతులో నాకోసం ఇక్కడ ఎవరూ లేరనే భాద.


తిన్నది చాలనుకొని నా చేతిలోని ఆకుని తట్టలో విసిరేసి చెయ్యి కడుక్కోకుండానే అమ్మకోసం వెతికా. తాటాకు పందిరి నడిమిట్లున్న సధివింపు పాన్పుపై పెళ్ళైన రాజిగాడోళ్ల జంట. వాడికెదురుగానున్న పళ్ళెంలో నిండుగా మడతలు పడిన నోటు కాగితాలు. ఎడంపక్క కూసున్న గుంపులో అమ్మ ఎవరితోనో ముచ్చట్లు. వెనకనుండి మెల్లిగా వెళ్లి కొంగుపట్టుకొని లాగి, ఇటురా అని తలతో సైగ చేశా.


మందిలో మాట్లాడటం ఇష్టంలేదు, చిన్నప్పుడు, ఇప్పుడు కూడా.


అమ్మ అక్కడనుండి వస్తుంటే, టీవీ సీరియల్ మాంచి రసపట్టులో ఉంటే మధ్యలో చిత్త వస్తే ఎలా ఉంటుందో, అలా ఉంది ఆ గుంపు సంగతి.


ఉలుకు పలుకు లేకుండా నడ్సుకుంటూ పోతున్న నన్ను చూసి “యాడికి రా?....మిగిలిపోయిన అన్నం, కూరలు, గిన్నెల్లో తోడారా? తిన్న ఆకులన్నీ పారేసారా...?” - నేను కనిపిస్తే అడగాలనుకున్న ప్రశ్నలన్నీ అడిగేసింది నా జవాబులతో సంబంధంలేకుండా.


“అమా...  పిన్నం నీతో మాట్లాడాలంటే”- పెళ్ళిపనుల గందరగోళంలో ఎవరిమీదో చూపించాల్సిన అసహనం, అమ్మ మీద.


నన్ను దాటేసుకొని పెద్ద పెద్ద అంగలేస్తూ టెంట్ కాడికి ఉరికింది అమ్మ. బాబాయోళ్ల గాబులో చెయ్యి కడుక్కొని పొయ్యేసరికి పొయ్యి గడ్డల మీద బాసంపట్ల వేసుకొని మాట్లాడుతున్నారిద్దరు. సీరియస్ గా ముఖం పెట్టి పిన్నం ఎదో చెప్తుంటే, అమ్మేమో పిన్నం భుజాలమీద చేతులేసి, పడీ...పడీ నవ్వుతుంది.


ఆడమనుషులు, వాళ్ళ మాటలు వినడానికి ఒక తోడు దొరికితే చాలనుకుంటా, ఎక్కడలేని నవ్వులను దుఃఖాల బావుల్లోంచి కూడా తోడుకుంటారు.


సప్పిడి చేయకుండా అమ్మపక్కన చతికిలపడ్డా. నేను వెళ్లడం చూసి మళ్ళీ తినడం మొదలెట్టింది పిన్నం. ఇత్తరాకులో మిగిలిన ఆ చారన్నం తిన్న తరువాత నాకెళ్ళి చూసి “మా అయ్య కదరా, కొంచెం మజ్జిగన్నం పోసుకొని రా రా చిన్ని,” అంది.


చిన్నప్పుడు ఇంట్లో రెండే కూరలుండేవి- అయితేనేం ఎల్లిపాయ కారం లేకపోతే ఉల్లిగడ్డ కారం. ఇంకా గుర్తు నాకు ఐదో తరగతి ఎండాకాలం సెలవులు అనుకుంటా. అప్పుడేమో నాకు విరోచనాలయ్యి బైటికిపోతే ముడ్డి మొత్తం మంట. పైపెచ్చు ఆకలయినపుడు తినడానికి మళ్ళా ఆ కారమే దిక్కు. ఎక్కణ్ణుంచి సంపాదించిందో తెలీదు కానీ నా భాద చూడలేక సాయంత్రానికల్లా మజ్జిగన్నం తెచ్చింది పిన్నం. అలా నా జీవితంలోకి ఒక కొత్త మనిషి నా ప్రమేయం లేకుండానే వచ్చింది. ఆ రోజు మొదలుకొని ఏ పొద్దైనా మా ఇంట్లో కూరలు బాగోకపోతే పళ్ళెంలో బువ్వేసుకొని, సంక్రాంతి పండగప్పుడు చర్మాన్ని చర్నాకోలుతో హింసించుకొనే డూ డూమ్ బండోడిలా, గూడేమంతా తిరిగి... తిరిగి ... పిన్నం ఇంటి దగ్గర ఆగిపోయేవాడిని.


చిన్నప్పటి సాయంత్రాలంతా తన కోసమే ఎదురుచూసేవాడిని. చిన్నబడిలో ఇంటిబెల్లు కొట్టిన తరువాత, పుస్తకాల సంచి ఇంట్లో పడేసి పొలాలకు వెళ్లే దారిలో ఉండే మోరిమీద కూర్చునేవాడిని.
పత్తికిపొయ్యి గట్టుమీదున్న కందికాయలో, మిరపకోతకి పొయ్యి వాగొడ్డుమీదుండే రేగ్గాయలో, వడ్లగింజల పరిగెకి పొయ్యి కాలవబాటలో చిన్న ఈతకాయలో, అలా ఎదో ఒకటి సాయంత్రానికల్లా నా లాగు బొందిజేబులో మచ్చటంగా వేసేది పిన్నం.


రాజిగాడు పుట్టేంత వరకు నేనే తన కొడుకుని. తీరా, వాడు పుట్టి ప్రేమనంతా లాక్కెళ్ళు పోతున్నాడని అలిగినవేళ, ఒళ్ళో పడుకోబెట్టి తలా నిమురుతూ చిత్రపు కథలు చెప్పేది. ఒక రోజు జోకొడుతూ పిన్నం ఒక మాట చెప్పినట్టు లీలగా గుర్తు నాకు- “వాడు నా చిన్న కొడుకు, నువ్వు నా పెద్దోడివి రా.”


రోజులన్నీ ఒకేలా ఉండవు కదా! కారణం ఏంటో సరిగా తెలియకుండానే పిన్నం దూరంగా వెళ్ళిపోయింది. మళ్ళా నా ప్రమేయం లేకుండానే.


అప్పుడు నేను తొమ్మిదో తరగతి. కమలాకర్ సార్ తొడపాశం పోరు పడలేక రాత్రుళ్ళు కూడా కిరసనాలబుడ్డి వెలుగులో రేఖగణితం చతుర్భుజాలతో కుస్తీపట్టేవాడిని. ఏవో అరుపులు వినిపిస్తుంటే అమ్మ ఊదురుగొట్టం పొయ్యికాడ పడేసి బయటకెళ్లింది. ఒక పదినిమిషాలు వృత్తమానినితో నేను తంటాలు పడిన తరువాత ఎంతకూ అమ్మ రాపోయేసరికి నేనూ బయటకొచ్చా . అమ్మ మాట గట్టిగా వినపడుతోంది. గోలంతా పిన్నం వాళ్ళ ఇంటివైపు నుండి వస్తుంది.


చేతిలో తోడుతెచ్చుకున్న పెన్సిల్ ముక్కని విసిరేసి ఉరికా. సూరుకింద అమ్మ నించొని లోపలున్న ఎవరినో తిడుతుంది. పిన్నం రోలు పక్కన మట్టిలో కూలబడి ఉంది. తన చుట్టూ ఉన్న అరుపులు వినిపించట్లేదనుకుంటా చూపులన్నీ నేల మీదే. నేను పక్కన నిల్చోన్నాననే ఊసు కూడా లేకుండా తనలో తానే ఎదో గొణుక్కొంటుంది.


అమ్మ గుడిసెలోనుండి బయటకొస్తూ చేతిలోనున్న ముళ్లుగర్ర పారేస్తూ “ఏమి పుట్టింది రా నీకు? ఏమి లంజరికం చేసిందని దాన్ని సంపుతున్నావ్ ఇప్పుడు? గూడెంలో ఉన్న పత్తిత్తులకంటే ఆ బోడి రంకుతనం ఏమి చేసిందిరా ఇది?” అని, రాజి గాడిని భుజంమీద జోకొడుతుంది. వాడు బరువవుతున్నాడనుకుంటా కాలు కింద సరిగా ఆనక అమ్మ బ్యాలన్స్ తప్పుతూ అడుగులు తడబడ్డాయి.


“ఇంకా ఏమి చేయాలి ఈ లంజది?గూడెంలో ఏ నాకొడుకుని అడిగినా దీని బాగోతం బయటపడుద్ది. పిల్లగాడు పెద్దోడయిండే ఏ మాత్రం సిగ్గు పెట్టలేదు దేవుడు దీనికి అసలు” ఊడిపోతున్న లుంగీ సరిచేసుకొని మళ్ళా కొట్టడానికొస్తున్నాడు బాబాయి.


“ఎవడ్రా ఆ నా బట్ట దీని సంసారంలో నిప్పులు పోసింది? ఎవరైనా కుశాలుగా బతికితే కంట్లో నిప్పులు పోసుకునే రకాలు ఈ గూడెం మంద. అసలు, మందిమాటలు వినడానికి సిగ్గు లేదురా నీకు...” పిన్నంని రెక్కపట్టి పైకి లేపింది అమ్మ.


ఇంటికి తిరిగి నడిచేటప్పుడు, చీకట్లో కుక్కల అరుపులకి భయపడి అమ్మ కొంగుపట్టుకుని కాళ్ళీడిస్తున్నా. పిన్నం మాత్రం, మౌనంగా మా వెనకాల నడుస్తుంది. ముక్కు ఎగదీసుకున్నప్పుడో, చెదిరిన జుట్టుని ముడేసుకున్నప్పుడో తప్ప, మా వెనకాల ఒక మనిషి ఉన్నట్టు జాడే లేదు.


బహుశా ఆ రోజే, వానగుంటలాటలో నా మీద గెలిచి గట్టిగా అరిచి గోలపెట్టే మనిషి, ఉప్పుబిర్ర ఆటలో చీర అంచంతా మట్టి పూసుకునే మనిషి చనిపోయిందనుకుంటా….


ఆ రాత్రి ఈతాకు చాపమీద ఒక చివరన నేను పడుకుంటే, మధ్యలో రాజిగాడు, ఆ చివరన పిన్నం పడుకుంది. ఓ పక్కకి ఒత్తిగిలి పడుకునేసరికి చెంప ఆనించిన దిండంతా ముద్దముద్దగా తయారయింది తెల్లారేసరికి. ఆ రాత్రే తెలిసింది నాకు పిన్నం కళ్ళల్లో కూడా కన్నీళ్లొస్తాయని. రాత్రంతా రాజి గాడు మెసులుతూనే ఉన్నాడు. ఏ అర్ధరాత్రప్పుడో నా మీద కాలేసి సోయలేకుండా పడుకున్నాడు.


గాలివానోచ్చిన తెల్లారి చెట్లన్నీ ఎలా చలనం లేకుండా స్తబ్దుగా ఉంటాయో, అలా ఉంది గూడెం అంతా పొద్దున్నే. లేచేసరికి పక్కలో ఎవరూ లేరు. అమ్మేమో ఊళ్ళోకిపొయ్యి వస్తూ కంట్లో ఎదో నలక పడిందానిమల్లే, కొంగుతో తుడుసుకుంటుంది. బాబాయోళ్ల మొత్తలకాడ ఇద్దరు, ముగ్గురు పెద్దోళ్ల ఉన్నారు.


వేప పుల్ల నోట్లో వేసుకొని బయటకి నడుస్తుంటే, “యాడికి రా?” అని అమ్మ అరిచింది. చెవుడొచ్చిన వాడల్లే ఏమి పట్టనట్టు గంపు కాడికి నడుచుకుంటూ పోతుంటే రాజిగాడు వెనకనుండి వచ్చి కాళ్ళకి చుట్టుకున్నాడు.


ఎక్కిళ్ళ మధ్య ఏడ్చుకుంటూ కూడ పలుక్కొని చెప్పాడు- “అమ్మని తీస్కరా... పో అ... న్నా”.


చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ ఇంటికి పొయ్యేసరికి అమ్మ గుమ్మంలో దిగాలుగా ఉంది. రాజిగాడిని దగ్గరికి రమ్మని చెప్పి, ఒళ్ళో కూర్చుపెట్టుకొని వాడి బుగ్గకంటి ఎండిపోయిన చీమిడిని తుడుస్తుంది.


“చిన్నోడా, పిన్నం వెళ్ళిపోయింది రా. వీడిని కూడా తీసుకపోతానని ఎంత ఏడ్చిందో పిచ్చిది. ఆ పెద్దోళ్లు దాని మాట పడనిస్తేగా...ఇక రాదు రా అది”అని, రాజిగాడిని ముద్దుపెట్టుకుంటుంది.


తెల్లారగట్లప్పుడు బాబాయి ఇంటికొచ్చాడని, మళ్ళీ ఎదో గోడవపెట్టుకున్నారని, ఈ సారి రొకలిబండతో వీపుమీద కొడితే పిన్నం పది నిముషాలు సృహ తప్పి పడిపోయిందని.....ఇంకా వినరాని బూతుమాటలని....  “ఇవన్నీ పడేకంటే వెళ్లిపోవడమే మంచిదని” పిన్నం అంటే, బాబాయేమో చీరలన్ని బయట పారేసాడని, రాజి గాడిని ఎత్తుకొని పోతుంటే, పెద్దోళ్లొచ్చి వాడిని చంకలోంచి లాక్కొని “నీతో పెరిగితే, అన్నీ నీ బుద్దులే వస్తాయే..వాడిని ఇక్కడే పెంచుతాం” అని ఇక్కడే ఉంచారని...ఇలా నేను నిద్రపొయ్యినప్పుడు జరిగిన విషయాలన్నీ ముక్కలు ముక్కలుగా, ఒక క్రమమంటూ లేకుండా అతికించి చెప్పింది అమ్మ.


ఎందుకోగానీ, ఆ రోజునుండి బాబాయి గూడేమోళ్లతో కలవడం మానేశాడు. నలుగురు కూడిన చోట తన గురించే మాట్లాడుకుంటున్నారని భయం అనుకుంటా.


చీకటి తెరలు పూర్తిగా వీడకముందే పనికిపోవడం, మళ్ళా కర్రి చీకటి గుప్పుమనేదాకా ఇంటికి రాకపోవడం. తెల్లారుజామున పనికేల్లెలోపు అన్నం వండి, ఇద్దరిడిచిన బట్టలు ఉతికేవాడు. రాత్రి వచ్చిన తరువాత రాజిగాడికి నీళ్లు పోసి అన్నం తినిపించి నిద్రపుచ్చేవాడు.


ఆదివారం ఇంట్లో ఉన్నా బయటకొచ్చేవాడు కాదు. మా ఇంట్లో ఎప్పుడైనా సియ్యకూర వండినపుడు బాబాయికి ఇచ్చిరమ్మని అమ్మ చెప్పేది. పిన్నం లేని ఇల్లంతా శూన్యంలా, బూజుపట్టిన దండెం మీద వేలాడుతున్న బట్టలన్నీ లోపలికి వెళ్లిన మనుషులందరిని వెక్కిరిస్తున్నట్టు ఉండేవి.


ఎప్పుడైనా నేనో, రాజిగాడో, పిన్నం ఊసు తీస్తే, పొగచూరిన తాటాకుకప్పు వైపు చూస్తూ తనలో తానే నవ్వుకునేవాడు బాబాయి, భాదని దిగమింగుకుంటూ.


రాజిగాడు హాస్టల్కి వెళ్లినతరవాత మనిషి ఒంటరయ్యాడు. ముసలోడయిపోతున్నాడనే దానికి గుర్తుగా జుట్టంతా తెల్లబడటం మొదలెట్టింది.


ఎన్నో సార్లు అమ్మని అడిగినా పిన్నం ఎక్కడుందని, ఎందుకు వెళ్ళిపోయిందని. కానీ, ఎప్పుడడిగినా ఎదో ముక్తసరిగా ఒక మాటచెప్పి తప్పించుకునేది. వాళ్ళు, వీళ్ళు చెప్పుకుంటుండగా విన్నది ఏంటంటే, పిన్నం మధిరలో ఎదో హోటల్ లో పనికి కుదిరిందని అక్కడే ఎదో ఇంట్లో అద్దెకు ఉంటుందని.


ఆ పదేళ్ల కాలంలో పిన్నం ఊరొచ్చిన ఊసే లేదు. కానీ, నెలకోసారైన రాజిగాడి దగ్గరికెళ్లేదట. పొద్దున గేటు తీసేసరికి అందరికంటే ముందే ఉండి రోజంతా వాడికావాల్సినవన్ని కొనిపించి, అందరికంటే చివరిగా వెళ్లెదట ఇంటికి. ఏడ్చుకుంటూ.


రాజిగాడు తొమ్మిదిలో ఉన్నప్పుడు బాబాయికాలు విరిగింది. పైగా, తాగుడెక్కువై సరిగా తినక మంచాన పడ్డాడు. టైంకి ఇంత వండి పెట్టేవాళ్ళు లేక పస్తులుండేవాడు జబ్బుచేసిన రోజుల్లో.


బాబాయికి పిన్నం విలువ తెలిసొచ్చిందో లేక తోడు కావాలని అనిపించిందో తెలియదు కానీ తన కోసం ఒక పెద్దమనిషిని పంపించాడు. ఇంకొకసారి తనే వెళ్ళాడు తీసుకురావడానికి.


“నిన్ను పెళ్లి చేసుకున్న మనిషి సచ్చిపొయ్యి చాలా రోజులయింది. ఇప్పుడు ఆ ఊరూ, ఆ ఇంటికి నేను ఎలా రావాలి? శవంతో కాపురం చెయ్యడానికి వచ్చావా ఇప్పుడు” అని, లోపలెవరికో చట్నీ వెయ్యడానికెళ్లింది. హోటల్కి వచ్చే మనిషితో మాట్లాడినట్టు ఒక మాట అనేసి తన పనిలో తాను మునిగిపోయిందట పిన్నం.


కొత్తగాకట్టిన మధిర ఫ్లైఓవర్ కింద కూర్చొని బిత్తరచూపులు చూస్తున్న బాబాయిని, ఎవరో ఆటో డ్రైవర్ ఊరికి తీసుకొచ్చాడు. అప్పటికే తాగి ఉన్నా, మళ్ళా తాగటానికి సారాయి తెమ్మని రాజిగాడిని కొట్టుకాడికి పంపాడు. రాజిగాడికి జరిగిందంతా చెప్పి చిన్న పిల్లోడిలా ఏడ్చాడట ఆ రాత్రి బాబాయి.


రాజిగాడు పదోతరగతి గట్టెక్కపోయేసరికి కరెంటు పని నేర్చుకునే పనిలో కుదిరాడు. ఓ మూడేళ్లు డక్కి మొక్కీలు తిన్న తరువాత సొంతగా ఊళ్ళో పొలంకాడుండే బావి మోటార్లు బాగుచేయడం మొదలెట్టాడు.


అమ్మ ఏరోజైనా మనేదగా ఉన్నప్పుడు మాత్రం దగ్గర కూచోపెట్టుకొని సందర్భానికి పొసగని మాటలు చెప్పేది నాకు - ” చిన్నోడా, రేపు ఎవరైనా నిన్ను నమ్ముకొనిచ్చినప్పుడు వాళ్లనెప్పుడు సూటిపోటి మాటలనక. నాకు నువ్వు ఎట్లా ముద్దో, ఆ మనిషి వాళ్ల అమ్మోళ్ళకి అంతే ముద్దు కదా. ఆ పిల్లకి కొన్ని ఇష్టాలుంటాయి. ఏ మనిషిని కష్టపెట్టకుండా బతకాలి చూడు నువ్వు, చిన్ని... ”


అమ్మ నోటెంట ఎప్పుడు ఇలాంటి మాటలొచ్చినా నాకు మాత్రం ఒక్కటే గుర్తుకొచ్చెది. ఆ రోజు రాత్రి  నేను అలా మూగగా పడుకోకుండా పిన్నంని అడిగిఉంటే, బహుశా ఇలానే మాట్లాడేదేమో తను కూడా!


పోయినేడాది నాన్న చనిపోతే, 14 ఏళ్ల తరువాత పిన్నం ఊరుకొచ్చింది.


పిన్నం ఊర్లో ఉన్నంతకాలం నాన్నతో రోజూ పరాచాకాలాడేది. వయసుతో పాటు పెరిగిన నాన్న పొట్టని చూసి “చిన్నోడో, నీ తమ్ముడో, చెల్లో, మీ అయ్య పొట్టలో దాసుకున్నార్రో” అని, గెలిచేసేది.


చావు కబురెవరు చెప్పారో తెలీదు కానీ ఉదయం ఎనిమిదిన్నర కల్లా వచ్చేసింది. రోజంతా ఎవరితో మాటా లేదు, పలుకూ లేదు. నాన్నని పడుకోబెట్టిన మంచం ఎడం పక్కన ఉన్న పందిరిగుంజనానుకొని మౌనంగా ఏడుపు. బొందలగడ్డకి పోతూఉంటే నా చేతిలో చెయ్యేసి నా వెంటే నడిచింది. మట్టేసేంత వరకు నాతోనే ఉండి నాన్నకి నేనెంత ఇష్టమో చెప్పి “తన పేరు గుర్తుండేలా ఎదో ఒకటి చెయ్యాలి రా చిన్నోడా నువ్వు” అని, చెప్తూనే ఉంది.


సాయంత్రం ఇంటికొచ్చి చూస్తే ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయింది.


మళ్ళా, ఇదిగో ఈ రోజు ఇలా నన్ను మజ్జిగ పోసుకురమ్మని బ్రతిమిలాడుతుంది.
లైట్ వెలుతురుకు పురుగులు పడకుండా డెర్సా గిన్నెలన్నింటికి మూతలేశారు. పెరుగు చట్నీ మూత తీసి అన్నంకి రెండింతలు అయ్యేలా పెరుగు పోసా. నిండుకున్న పళ్లెం ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని టెంట్లోకి నడిచా. ఆ లోపు అమ్మేమో, పిన్నం కుడిచేతికి పసుపు రాస్తోంది. పొద్దున గొడవలో గాజులన్నీ చిట్లి రక్తం కారింది ఆ చెయ్యే కదా.


రాజిగాడి పెళ్లిచూపులప్పుడు కానీ, పప్పన్నమప్పుడు కానీ, పిన్నంని పిలవాలనే ఆలోచన ఎవరికి రాలేదు. కానీ, చర్చిలో పెళ్లిచేసేటపుడు అబ్బాయి తల్లితండ్రులు ఖచ్చితంగా ఉండాలి కదా అని ఎవరికి చెప్పకుండా అమ్మే పిన్నంకి ఫోన్ చేయమంది.


ఇవాళ పొద్దునెప్పుడో వచ్చినా పెళ్లితో తనకేమీ సంబంధం లేనట్టు ఎక్కడో మూలన కొంగు ముసుగేసుకొని కూర్చొని పెళ్లి చూస్తోంది.


పెద్ద పాస్టర్ గారు అప్పటిదాకా పెళ్లిజంటతో పరిశుద్ధ వాక్యాలు చదివించి అసలు పెళ్లి తంతు ఇక మొదలవుతుందని, మేళగాల్లని రెడీగా ఉండమని సైగ చేసాడు. అమ్మాయి తల్లితండ్రులని ముందుకు రమ్మని చెప్పి “ఈ అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడం ఇష్టమేనా” అని, అడిగాడు . వాళ్ళు అంగీకారంగా తలలూపడంతో అబ్బాయితరపు పెద్దల్ని ముందుకు రమ్మని మైకులో చెప్పాడు.


గుంపులో ఎదో గుసగుస మొదలైంది. బాబాయి ముందుకు నడుస్తుంటే ఎవరో పిన్నంని పేరు పెట్టి పిలిచి ముందుకు పో అని అరిచారు. పక్కనున్న ఎవరో లెమ్మని వత్తిడి చేస్తున్నారు. అందరి ముందు దోషిగా, మెల్లగా నిలబడింది పిన్నం.


ముందుకు నడుద్దామని అనుకునేలోపు ఎవరో అమ్మాయి తరపు మనిషి “నీలాంటి లంజలు దీవిస్తే మా అమ్మాయి కూడా నీలాగే పరాయి ఊర్లో బిచ్చ మెత్తుకుంటుందే. అసలు ఎవడు పిలిచాడే నిన్ను పెళ్లికి? నీ బాగోతమంతా మాకెరుకే” అని, పిన్నం జుట్టుపట్టుకొని లాగి కిందపడేసాడు.


ఎక్కడో ముందు కూచున్న అమ్మ అందరిని తోసుకుంటూ వెళ్లి పిన్నంని కొట్టిన మనిషిని కోపంతో నెట్టింది.


“నువ్వేవడ్రా దీని మీద చెయ్యెయ్యడానికి? నీ  కళ్ళల్లో ఎవరూ కారంపొయ్యలేదేరా ఇంకా, సిగ్గుమాలోకం తప్పిన చెడ్డ నా కొడకా ” అని, పిన్నంని పక్కకి తీసుకపోతుంది.


ఈ లోపు అమ్మాయి తరపు కొందరు, గూడెం పెద్దోళ్లు కొందరు మాటా మాటా అనుకున్నారు. అమ్మ ఇంకా ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటే అవతల గుంపులోనున్న మనిషేవరో అంది- “ఎందుకమ్మా నీకు మాలా రోషం పొడుసుకొస్తుంది? కన్న కొడుకే సప్పిడి చేయకుండా ఉంటే మధ్యలో నీకేమొచ్చింది”.


పిన్నం అక్కడనుండి బయటకు నడిచింది. అమ్మ నన్ను ఉండమని చెప్పి తనతో పాటే నడుచుకుంటూ వెళ్లింది. అప్పుడు వెళ్లిన తరువాత ఇదిగో ఇలా ఈ చీకటి టెంట్లో కూర్చొని అన్నం తింటూ కనిపించింది.


“చిన్నోడా, పెళ్లి బాగా జరిగింది కదా రా! అమ్మాయి కూడా చూడటానికి సుక్కల్లే ఉంది.”


“……………”


“సరే కానీ ఈ ఇత్తరాకులేందిరా ఎవరు తియ్యలే?”


“............”


పిన్నం మాట్లాడుతున్నంతసేపు ఎందుకో ఒకటే దృశ్యం లోపల తిరుగుతుంది. ఎందుకు ఆ రోజు నేను పిన్నంని ఏమి అడగకుండా పడుకున్నానా అని? ఒకవేళ అడిగినా ఏమైనా చెప్పి ఉండేదా అని?


“అసలెందుకు పిన్నం నువ్వు వెళ్లిపోయావ్ ఆ రోజు?”


ఎన్నో రోజులు నలిగిన ప్రశ్న, అనాలోచితంగా వచ్చేసింది బయటికి.


తింటున్న మనిషల్లా కాస్త ఇత్తరాకుని పక్కనెట్టి చాలాసేపు చూసింది నావైపు.


“కొన్ని విషయాలు మనతోనే పుట్టి మనతోనే సచ్చిపోవాలి చిన్నోడా. ఎవరికీ తెలియకుండా ఉంటేనే మంచిది అలాంటి మాటలు”


ఎన్నో రోజులు దాచుకున్న కష్టం, భాద బయటకొచ్చేసాయి.


ఓ పది నిముషాలు ఉరుములు మెరుపులు తరవాత కరెంట్ పోయింది. చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి.


“చిన్నోడా వాళ్ళు ఇంకా సధివింపు పాన్పు మీదే ఉన్నారా? వెళ్లి వాళ్ళకి ఆ గ్యాస్ లైట్ బుడ్డి వెలిగించుపో రా” అని, పిన్నం చేతులు కడుక్కోవడానికి లోటా వెతుక్కుంటుంది.


“పోద్దున అంత గొడవుతున్నా తాళి కట్టాలనే ధ్యాసే కానీ ‘నా అమ్మని ఎవడ్రా కొట్టేది’ అని, ఒక మాట కూడా అనలేదు వాడు. వాళ్లకోసం ఎందుకు నువ్వు ఇంకా తపనపడటం పిన్ని” అని, కోపంగా కుర్చీని తన్నా.


తిన్న ఇత్తరాకు తట్టలో వేస్తూ చెప్పింది- “చిన్నీ...నీకు  నేను చెప్పిన మాట గుర్తు లేదా? నువ్వు నా పెద్ద కొడుకు, ఎంతైనా వాడు చిన్న కొడుకు కదా రా”.


నేను లైట్ ఇచ్చి వచ్చేలోపు ఆ ఎంగిలి ఇత్తరాకుల  తట్ట నెత్తినెత్తుకొని పోతుంది. వానకి ఆ తట్టలోని ఆకుల్లో ఉన్న ఎంగిలి మెతుకులంతా పిన్నం మోహమ్మీదకి కారుతున్నాయి.


ఓ మెరుపు మెరిసి వెలుగు వెలిసిన తరువాత, పిన్నం ఆ చీకట్లో  ఎవరికి కానరాకుండా మాయమైపోయింది.

మే నెల సారంగలో ప్రచురితం.