ఈ కథ నా రెండవది (2014). లింక్
గతం, ఉషస్సు వెంట ధ్వాంతపు తెరలా, సంద్రపు ప్రశాంతతలో దాగుండే భీకర అలలా, వెలుతురు పంచే భానుడిని మింగేయడానికొచ్చే నిశీధి బంధువులా ఎప్పుడూ వర్తమానాన్ని వెంటాడుతుందేమో!
మహా నగర మాయ మొహాలను దాటుకొని, ముఖానికేసుకున్న రంగులను కడిగేసుకొని ఇంటికి బయల్దేరాను. వినిపిస్తున్న నాగరికత నవ్వులను దాటుకొని, కనిపిస్తున్న ‘నిషాధునికత’ కళ్ళ వైపు పరికించకుండా రైలుపెట్టెలో నుండి ఒక్క గెంతుతో చిందరవందర ఫ్లాట్ఫారంపై పడ్డా. నగరాలే కాదు మా జిల్లా కుడా అభివృద్ధి అయినట్టుంది, ఫ్లాట్ఫారం చివరన బిచ్చగాళ్ళు పెరిగారు కదా….
ఇంక ఆటో ఎక్కడమే ఆలస్యం. 5 కి.మి దూరంలో నన్ను వెక్కిరించి, పడదోసి, జుట్టు పట్టుకొని పైకి లేపి జీవితపు విలువలు నేర్పిన నా ఊరు. ఆటోలో ఎక్కి ఒక మూలగా కూర్చున్నా.
అతడు తాగాడనుకుంటా, తప్పటడుగులు వేస్తున్నాడు, ఆమేమో మొగుడు వదిలేసిన మాసిన బట్టలమూటను చేతిలో పట్టుకొని ఉంది.
“ఇక్కడ తగలేసిన సంసారం చాలదా… అక్కడకెల్లి ఏమిరగేద్దామని ఇప్పుడీ పయానం” విసుక్కుంటూ అక్కడే నించొని కదలకుండా అంది.
తను విసురుగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు నాతో వస్తావా? రావా?… పైశాచికపు పరుష పదాలు ఆ చొంగ కార్చిన నోటెంట.
“పని, పని అంటూ సారా పాకల్లోనే గడుపుతున్నవ్, గొడ్డుకారం పెడుతున్నానని కుల్లబొడుస్తున్నవ్. ఇక్కడైతే కడుపుకో ముద్దైనా నా అనే వాళ్ళు వేస్తున్నారు. పేరుతప్ప ఇంకేమీ తెలియని ఆ ఊరుకెళ్ళి ఏంచేద్దాం…” పాలిపోయిన పెదాలెంట ఆర్ధ్రతతో కూడిన దీనమైన గొంతు.
ఆమెవైపసలు చూడట్లేదు తను, బహుశా భర్త తాలుకా ధైర్యమనుకుంటా.
ఏమీ చేయలేని తన అసహాయత్వాన్ని తన మనసులోనే పొగిడేసుకొని, విషాదపు నవ్వుతో ఆమె భర్త వైపు చూసిన ఆ చూపు నా కళ్ళను తాకింది. మౌనంగా వచ్చి కూర్చుంది. కళ్ళెంబడి నీటి ధార. పోనీలే ఆ ప్రవాహంలోనైనా తన గుండెల్లో దాచుకున్న బాధంతా కరుగుతుందేమో! చీర కొంగుతో మోహం తుడుచుకొనేసరికి, కొంగుకున్న మసి, ఆ మొహంలో భావాలను నల్లమబ్బులా కమ్మేసింది. మరో ఇద్దరాడాళ్ళొచ్చి కూర్చున్నారు. కొంచంసేపటి తర్వాత ఆ ఇద్దరాడాళ్ళతో మాట కలిపాడతను. జేబులో ఫోను తీసి గొప్పలుచెప్పుకుంటూ, వాళ్ళ తాత, ముత్తాతల చరిత్రను చెపుతున్నాడు.
ఎంతమార్పు క్షణాలలో… భాధ్యతలు గుర్తు చేస్తే భార్యతో మాట్లాడలేదు కానీ ఆడోళ్ళు కానరాగనే ‘మొగతనం’ గుర్తొచ్చినట్టుంది.
వాళ్ళ మాటలు వింటుంటే నాకు మా గూడెపు చరిత్ర గుర్తుస్తోంది. చరిత్రలో ఎక్కడా చెప్పని చరిత్ర. ఎన్నో ‘గూడేల’ తరతరాల అణగదొక్కబడిన చరిత్ర. నేనెరిగిన నా ‘గూడెపు’ చరిత్ర. అది తెల్వాలంటే నా బాల్యంనాటి గూడెపు బదుకులు, ఇప్పుడు బదుకులు చెప్పాల్సిందే. నాతో బాటుగా మారిన గూడెపు జీవనమే చరిత్రని నా భావం.
చీముడు ముక్కును చొక్కాతో తుడుచుకుంటూ, జారిపోతున్న చిల్లుల లాగును ఎగదోస్తూ, సంకలో పలకెట్టుకొని, మరొక చేతిలో నల్లగైన బలపం ముక్కలని చప్పరిస్తూ బడికెల్లిన రోజులు నాకు గుర్తే. బర్రెతోలు తీసి చెప్పులు కుట్టాల్సిన పొలగాడు బడిలో చేరిండని పెదకమ్మోరు వెటకారపు నవ్వొకటి నవ్వి నాకెల్లి చూశాడు. నీకొడుకు బాగా చదువుతాడని సారు అయ్యకు చెపుతుంటే గుంట పడిన కళ్ళలోంచి కారిన కన్నీటి బొట్టు, యుగయుగాలుగా మా జాతి దాచుకున్న కన్నీటి సంద్రంలా తోచింది. నీ కొడుకు ‘పయోజకుడవుతాడని’ అమ్మలక్కలందరంటుంటే, నాటేసి మట్టంటిన మొద్దుబారిన చేతులతో నన్ను తీసుకొని ఎండిపోయిన పెదాలతో నుదుట ముద్దెట్టుకొని, కొంగులో దాచిన పొలంకాడపంచిన కొబ్బరిముక్క ఇచ్చి, నా కళ్ళలో అపుడు మెరిసిన వెలుగులో తన భవిష్యత్తు వెతుక్కుంది. సైకిల్టైరు తిప్పుకుంటూ బడికెల్లడం, సెలవుల్లో అమ్మెంబడి కలుపుకెల్లడం, ఆదివారాల్లో అర్థం కాని ఫాదరీ గారి ప్రార్థన వినడం, ‘గుంటాటలో’ వచ్చిన గోళీలను పదేపదే లెక్కేసుకోవడం, వేడిగానున్న ముడుసును పీటమీద కొట్టి దాంట్లో తెల్లగుజ్జుతినడం, రాత్రైనాక కిరసనాయిలు బుడ్డి కింద వెలుతురు కోసం పురుగులతో పోటీపడుతూ ‘అచ్చరాలు’ నేర్చుకోవడం. ఇదే నాగ్గుర్తున్న చిన్నప్పటి బదుకు.
ఐదోతరగతి ఐనంకా పంతులమ్మ సోషల్వెల్ఫేర్ ‘పరిచ్చ’ రాయిస్తానంది. ‘పరిచ్చ’ ముందు రోజు రాతిరి ఫాదరి గారి మల్లే అమ్మ మోకాళ్ళ మీద పడి ఏదో మాట్లాడింది పైకి చూస్తూ. పరిచ్చకెల్తుంటే నా సోపతిగాండ్లు గట్టు చివరన దండం పెట్టుకుంటుంటే నేను ఒక కన్ను మూసి మొక్కిన. ఏమి రాసిన్నో గుర్తు లేదు. నాకొక్కడికే సీటొచ్చిందని ఆయాసపడి చెప్తుంటే, అమ్మ ఇచ్చిన లోటాలోని ‘మా నీళ్ళొద్దని’, బాటిల్లో ఉన్న ‘ఆయన నీళ్ళను’ తాగాడు సారు. ‘పెద్దమాదిగ’ ఇంటికొచ్చి ‘పోరగా’ నువ్వైనా చదివి మన జాతి ‘పరువు’ నిలబెట్టాల్రా అని నాకేసి గర్వంగా చూసినప్పుడు, చింత నిప్పుల్లాంటి ఆ కళ్ళల్లో ‘పరువు’ అనే పదానికి అర్థం ఇప్పటికీ నేను వెదుకూతూనే ఉన్నా.
నూనె కారుతున్న చెంపతో రెండు జతల బట్టలున్న కర్రల సంచితో నేనెడుతుంటే, నావెనుక ఎవరూ రాలేదు. నాలుగు మెతుకులు నోట్లోకెళ్ళాలంటే, పదివేళ్ళు మట్టిలోకెళ్ళాల్సిన బదుకులలో ఎవరుంటారు ఇళ్ళల్లో, సూరీడు నడినెత్తి మీదకొచ్చాక. ఐతేనేం మా ‘జేజి’ బోసినోటి బోలెడు కథలు, రాతిరి కంజెరతో వేసిన కోటిగుండెల ఆకలిదరువులు, నాకు తెలీకుండా అమ్మపెట్టిన ‘పబుయేసు’ బైబిలు నా వెంటొచ్చాయి.
ఒకసారి అమ్మనడిగినట్టు గుర్తు, అమ్మా నీకు చదవటం రాదు కదే, మరీ ఈ ‘పుత్తకం’ నీకెందుకని?
“చిన్నయ్యా, అది పక్క నుంటే ఏసయ్య మనకష్టాలన్ని ఇంటున్నట్టే లెక్క. నీవు ఏది కోరితే అది ఇత్తడు ఆ ఏసయ్య” అని చెప్పిందమ్మ.
హాస్టల్లో కొత్తలో ఎన్ని రోజులేడ్చానో తెలీదు, ఐనా అయ్య మాత్రం నన్ను చూడ్డానికి రాలే. తర్వాత్తెలిసింది వాళ్ళు నాకోసం ఎంతేడ్చారన్నది. సెలవులకు ఇంటికెళ్తే, భుజంమీదున్న పుస్తకాలసంచీ, చేతిలోని కర్రలసంచి ఇంటికి నా కంటె ముందే వెళ్ళేవి. నా బాగోగులు గురించి, చదువెట్ల సాగుతుందని అందరూ అడుగుడే. గడ్డిమోపు నెత్తినెట్టుకెల్తున్న పెద్దకమ్మోరు జీతగాడు కిట్టయ్య మాయ్య కష్టాలన్నింటిని పక్కనెట్టి, జేబులో నున్న ‘సారబెల్లం’ ముక్కనిచ్చి, నాకు చదువు చెప్పమని చుట్టతో పొగవదుల్తూ నవ్వేవాడు.
ఎన్నికష్టాలున్నా, సందేళ చిన్న మంటేసుకొని చింతచెట్టుకింద కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అందరు చేసే కష్టమొక్కటే, అందర్లో పారేది ఆ రత్తమే అన్నట్టు అందరూ కలిసుండి ఒకరికొకరు సాయం చేసుకొనేవాళ్ళు.
సెలవుల్లో ఈ సారి సర్పంచి వోట్లొచ్చాయి. ఎప్పుడూ పోటీ లేకుండా గెలిచే పెద్దకమ్మోరికి ఈ సారి చినకమ్మోరు పోటీగా నిలబడ్డాడు. అన్నదమ్ములిద్దరూ పైకి కత్తులు దూస్తునే, రోజూ చీకటి మాటున ఒకరింటికొకరు వెళ్ళి కబుర్లు చెప్పుకునేవారు. అప్పుడొచ్చింది మాదిగ గూడెంలో తంటా. చిన్న కమ్మోరు జీతగాడు పెబుదాసుకి, పెద్దకమ్మోరు జీతగాడు వెంకడికి గొడవ, మా కమ్మోరు గెలుస్తారంటే మా కమ్మోరు గెలుస్తారని. ఫలితం ఆ ఏడు రెండింతలు ఎక్కువగా కాపుసారా వెల్లువలా పొర్లింది గూడెంలో. మాదిగగూడెం రెండు వర్గాలుగా చీలిపోయింది. వోట్ల ముందు రోజు రాతిరి చింతచెట్టు బోసిపోయింది. ఆ పదిరోజులు ఒకరింటికొకరు ఎవరూ పోలేదు. ఫాదరీగారు మాత్రం వచ్చి పెబు పాటలు పాడి, అందొచ్చిన చందా తీసుకెళ్ళాడు. పెబుగుడి కొచ్చారనే మాటేగానీ ‘రందంతా’ వోట్ల సంగతి మీదే. ‘చ్చణంచ్చణం’ బిక్కు బిక్కుమంటూ మాదిగోళ్ళంతా వోట్లేయడానికెళ్ళారు. కొందరేమో కమ్మోరు చెప్పినట్టు దొంగోట్లు కూడా వేశారు. మంచాన పడి మూలుగుతున్న కోటయ్య తాత ఆరోజు అందరికి గుర్తొచ్చాడు, ఆయనకు కూడా వోటుంది కదా మరి! బ్రతికినంత కాలం అందరికి మంచిచేసిన ఆయనను, మావాడంటే మావాడంటూ వోటు దగ్గర గొడవెట్టుకొని, ఇద్దరి తరపున వోటేయించుకున్నారు.
ఆ ఏడు మాత్రం ఎర్రజెండా చిన కమ్మోరు గెలిచారు. ఊరేగింపు జరుపుకుంటూ బుక్కాయి చల్లుకున్నారు. సరిగ్గ అప్పుడే మొదలయింది గూడెంలో గొడవ. చినుకు, చినుకుకు గాలి వానతోడై తుఫానైనట్టు, ఒక్కొకళ్ళు జతకూడి మొరిల దగ్గర గుమికూడారు. అప్పటి దాక స్తబ్దుగా ఉన్న రాళ్ళల్లో, కర్రల్లో జీవమొచ్చింది. అవి రక్తాన్ని – దాహంతో నోరు తెరిచిన భూమి లోపలికి నీళ్ళలా అందిచాయి. కర్రల శబ్దాలు, పిల్లల ఏడుపులు, ఆడవాళ్ళ కీచుగొంతులు, రక్తమోడుతున్న తలలు. అంతలోనే పెద్దకమ్మోరు, చినకమ్మోరు ఇద్దరు కలసిపోయి పోలీసులకు కబురంపారు. అరగంటలో జీపొచ్చి అందరిని తీసుకెళ్ళింది. కమ్మోరు మొత్తం 56 మంది మీద కేసు పెట్టారంట ఎలెక్షన్ల రోజు గొడవచేస్తున్నారని! నాన్నని, అమ్మని కూడా తీసుకెళ్ళారు. అమ్మ ఇచ్చిన బైబులు గుర్తొచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ నా కొచ్చిన విధంగా ప్రార్థన చేశా. ఏసుపెబువుకి నా ఏడుపు వినిపించలేదనుకుంటా, అమ్మా నాన్న ఎంత పిలిచినారాలే. ఒక నెల రోజుల తర్వాత గాని అందరిని విడిచిపెట్టలే.
చిన కమ్మోరింట్లో కలరు టీ.వీ వచ్చింది. నాగళ్ళు పోయి టాక్టరొచ్చింది, ఎంతైనా శ్రమ జీవుల పార్టీ నాయకుడు కదా! మనుషులనెందుకు కష్టపెట్టాలని కొన్నాడేమో! చినకమ్మోరి, పెదకమ్మోరి ఇద్దరి పొలాల్లో మోటారు బావులొచ్చాయి. గూడెంలో మాత్రం అందరిళ్ళ ముందు నెల రోజుల కశువంతా అంతే ఉంది. నెలరోజులూ పిల్లలు ఆకలితో మాడారు. వీళ్ళనెందుకు తీసుకెల్లలేదు పోలీసులు మరి? పాపం! కమ్మోరు గొడ్లని ఎవరు కాస్తారు వీళ్ళని తీసుకెళ్తే?
అందరూ బయటకొచ్చారు. అంతా సద్దు మణిగింది. గూడెంలో మరోపెబు గుడి మొదలయింది చిన కమ్మోరు వేయించిన పాకలో. గూడెంలోనున్న రెండు పెద్ద కుటుంబాలలోంచి ఒక్కరు చొప్పున ఇద్దరు పెద్ద మాదిగలైనారు ఎన్నడూ లేని విధంగా! ఆ రాతిరి నుండి చింత చెట్టు కింద రెండు మంట లెలుగుతున్నాయు. రెండు వర్గాల ఇల్ల మధ్య గోడ అప్పుడే మొదలయింది.
కాలం గడిచే కొద్దీ పాత గాయాలు మానిపోయి ,’శలీలాలన్నీ’ కొత్త గాయాలకు సిద్ధమవుతాయనుకుంటా!
కొత్తగా వచ్చిన ఎర్ర పార్టీతో మా జీవితాలేమీ మారలేదు, మేము చేసే కష్టం కూడా. అంతకు ముందు అందరూ కలిసి పనికెల్లే వారు. ఇప్పుడేమో చిన్నకమ్మోరు, పెద్దకమ్మోరు మమ్మల్ని పంచుకున్నారు రెండు వర్గాలుగ, అంతే తేడా. అదే పని, అదే బతుకు.
ఇంటరు పూర్తి చేసి డిగ్రీ చదవడానికి ఓ.యు. క్యాంపస్కు వచ్చా. ఈ సారి సర్పంచి పదవి ఎస్.సి. రిజర్వేషన్ అయింది. గూడెంలో నున్న ఎం.ఎస్.సి చదివిన కృష్ణమామయ్య ఈసారి నేను నించుంటాను, ఎవళ్లూ ఏ పార్టీ తరపున నుంచోద్దని బ్రతిమాలాడాడు. దాస్యశృంఖాలలో మొద్దుబారిన వాళ్ల మెదళ్ల సంగతి కృష్ణమామయ్యకు తెలియదు కదా. కాస్తో, కూస్తో చదివిన వాడిని నిలబెడితే వాళ్లు పెట్టమన్న చోట సంతకం పెట్టకుండా ప్రశ్నలేస్తాడని, పార్టీలు కూడా తెలివిగా అక్షరాలు నేర్వని నత్తి ఉన్న ఆనందంబాబాయిని త్రివర్ణపతాకం పోటీకి నిలబెట్టగా, బర్రెల మందే లోకంగా బతికే శాంతయ్యమామయ్యను ఎర్రజెండా పోటీకి నిలబెట్టింది. ఇద్దరూ కూడా వేర్వేరు వర్గాలకు చెందిన వారే సుమా. ఒకరికేమో సరిగా మాటలురావు. ఇంకొకరేమో పదిమందిలో అసలేమాట్లడలేడు. మానాయకుడని చెప్పుకునేటోడు ఏకంగా పచ్చపార్టీలో చేరి పోటిచేస్తానని రాయబారం నడిపాడు. పాపం పదోతరగతి చదువుకున్నాడు కదా, తోక కత్తిరించేశారు. ఇప్పుడు ఆయనగారే త్రివర్ణపతాక గూడేంమందికి అధ్యక్షుడు. రోజూ గొడ్లుకాసే శాంతయ్యమామయ్య గడప, గడపకు తిరిగాడు ఓటెయ్యమని, ఆ ఓటు విలువ తెలియకుండానే. ఆ నెల రోజుల్లో బర్రెగొడ్డులన్నీ బక్కచిక్కాయి. నాగలి దున్నే ఆనందంబాబాయి ఊరు, ఊరంతా తిరిగి తన పాంప్లెట్లన్నీ పంచాడు, పాపం అందులో ఏముందో తెలియకుండానే! ఓటు వేయకుండానే కాలేజీకి వచ్చేశా. తర్వాత ఆనందం బాబాయి గెలిచాడని తెలిసింది. శాంతయ్యమామయ్య ఇల్లు దాటి బయటకు రాలేదు.
మునుపటి గొడవలో గూడెం రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ సారి మనిషి, మనిషికి శత్రువైనాడు. అందరి మొహాల్లో ఏదో తెలియని భావాలు కనిపిచటం మొదలయింది.
కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగి, మన జీవితాలలో పెను మార్పులు తీసుకొస్తాయి. మొదటి దశలో ఒక సమూహాంలానున్న మా జాతి, రెండు వర్గాలుగా విడిపోయింది. రెండో దశలో మనిషికి మనిషికి మధ్యనే కాకుండా, మనిషి లోపలే విధ్వంసాలను సృష్టించారు.
ఎర్ర జెండా చిన్న కమ్మోరు ఓడిపోయి వేదాంతయినట్టున్నాడు.
“ఇంతకాలం మీ అందరి బరువును నేనే మోశాను. ఇంత అభివృద్ధి చేశాను (ఎంత అని అడగ కూడదు సుమా) ఇక మీరే చూస్తారు కదా వీళ్లు ఎలా వెలగబెడతారని”
ఇంటికి కొత్త రంగులు వేయిస్తున్నడు, రంగులు మార్చాలి కదా వంటిదే కాదు ఇంటిది కూడా.
తరతరాలుగా మాదిగజాతి చరిత్రగాథలకు సాక్షిగా నిలిచిన చింతచెట్టు, పార్టీ ఆఫీసుకు అడ్డొచ్చిందట, దాన్ని కొట్టేశారు. కులానికో ఫాదరుగారు ప్రత్యక్షమైనారు, ఐదారు గుళ్లు లేచాయి, కొత్తగా వీధికో సారాయి కొట్టు వెలిసింది. ఇది ఇప్పటి వరకు సాగిన నే నెరిగిన చరిత్ర.
మా ఊరొచ్చినట్టుంది, ఆటో ఆగింది. డబ్బులిచ్చి మూలనున్న గూడేనికి బయల్దేరా. ఈ సారి మాత్రం భుజం మీదున్న పుస్తకాలసంచి బరువైతుంది. ఎవరూ తెలిసిన వాళ్లు రోడ్డు మీద లేరు. అన్నీ తెలియని ముఖాలే నాకు ఎదురౌతున్నాయి. రత్నంపెదనాన్న ఎక్కడ నేను పిలుస్తాననే భయంతో పరుగు, పరుగుగా నడుస్తున్నాడు. రత్తయ్యతాత చుట్టకాలుస్తూ, నేనెవరో ఎరుగనట్టు పెద్దకమ్మోరు ఇళ్లు కప్పడానికి వెళుతున్నాడు. పదేళ్లముందు నేనుండిన ఊరేనా ఇది అనిపించింది.
పొద్దున్నే వేపపుల్లతో ‘మొకం కడుగుతుండగా’ సర్పంచి బాబాయి, ఇంకో ముగ్గురితో కలిసి పాడైపోయిన బోరును అభివృద్ధి పేరిట బాగుచేస్తున్నాడు. మోటరు కేసిన పైపులను భుజాలపై మోస్తూ, మట్టిని పారల్తో ఎత్తి తీస్తున్నాడు. పక్కనే పెద కమ్మోరు స్కూటర్ మీద కూచొని పనులన్నీ చుస్తూ, “ఏరా(‘సర్పంచిగారినే’మరి) కొంచెంసేపైన తర్వాత పంచాయితి ఆఫీసుకు రా” అని అంటున్నడు. బలిచ్చే మేకలాగ తలూపాడు బాబాయి.
నన్నుచూసి, “ఎప్పుడొచ్చావురా, కనీసం ఓటు వేయడనిక్కూడా రాలేదు” అని అడిగాడు వంటికున్న చెమటలు తుడుచుకుంటూ. NOTA (None of the above) option లేదు కదా, ఎలా నేను ఓటు వేసేది?
“బాబాయి సర్పంచిగిరీ అంటే ఇదే నా బాబాయి?”
“ఇదే గదరా, మన పనులన్నీ బాగు చేస్తా ఉన్న కదరా” అన్నడు.
“సర్పంచి పనులు చేయిస్తాడు కానీ ఇలా పని చేయడు బాబాయి. మన పెద్ద కమ్మోరు సర్పంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పలుగు, పారా పట్టిండా బాబాయి” అని అడిగే సరికి, నేను కూడా చిన్న కమ్మోరు మనిషినని ఒక చూపు చూసి విసురుగా వెళ్లిపోయాడు.
కథల్లో, సినిమాల్లో పల్లెటూరంటే పచ్చని పొలాలని, పెరుగన్నం ముద్దలనో, వెంటపడి అల్లరిచేసే మరదల్ల సయ్యాటలనో, లేక గ్రామాల్లో ఉన్న కుటుంబ బాంధవ్యాలు నగరాల్లో మాయ మవుతున్నాయనో వర్ణిస్తే నాకు నవ్వొస్తుంది మరి.
మా ఊరి చరిత్ర ఒక్కటే కాదిది. సమూహంగా ఉండే జాతులను స్వలాభం కోసం విడగొట్టిన వ్యక్తులెందరో! ధనార్జనే లక్ష్యంగానున్న వ్యక్తుల అంతరంగిక కుతంత్రం సరిగా గమనించక బుగ్గిపాలైన జీవితాలకు సాక్ష్యాలైన గ్రామలెన్నో!
పార్టీ ఏదైనా కావచ్చు, జెండా ఏదైనా కావచ్చు.. త్రివర్ణమైనా, ఎరుపైనా.. ప్రతీ జెండా ముసుగునా అదే తంతు. ఆధిపత్యకులాలు ప్రజాస్వామ్యంలో కూడా కింది కులాల వాళ్ళని వంచిస్తున్నారు. ఇదంతా కొత్తదేం కాదు.. ఆనాడు దోపిడి కులవ్యవస్థమాటున జరిగింది.. ఈనాడు ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతోంది అంతే తేడా.
ఇన్ని చిక్కులలో కూడా ‘పుస్తకం’ నాకు వెలుతురులా కనిపిస్తుంది. దాని ద్వారానే మరి మా గూడెంలో మార్పు రావాలిక…
ఈ కథ కినిగే పత్రికలో మే 8, 2014 లో ప్రచురితం.
ఈ కథ కినిగే పత్రికలో మే 8, 2014 లో ప్రచురితం.
No comments:
Post a Comment