Friday 25 August 2017

ఆర్జున్ రెడ్డి, షాలినిల పిచ్చి ప్రేమ

ప్రియురాలిని అసభ్యంగా తాకిన అమిత్ ని కొట్టడంలో లేదు వాడి ప్రేమ, కొట్టిన తర్వాత ఆమేని చూసి ఏడ్చిన కనులలో దాగుంది వాడి పిచ్చి ప్రేమ.

భౌతికంగా దూరమైన తన చెలి ఆలోచనలను అంతరాల్లోంచి చెరిపేయడానికి దేహన్ని గాయపర్చకోవడంలో లేదు వాడి వ్యక్తిత్వం, స్నేహితుడి చెల్లిని, “స్త్రీ కేవలం శరీరానికి ఆనందం ఇచ్చే ఒక వస్తువు అనే మెంటాలిటి” ఉన్న ఒక రోగ్ నుండి కాపాడిన  తెగువలో ఉంది వాడి వ్యక్తిత్వం .

ఏమి చూసి ప్రేమించావని తన ప్రేయసడిగితే, నువ్వు గాలి పీల్చుకునే విదానం నచ్చి అని చెప్పి, తుదిశ్వాస వరకు తనకోసమే పిచ్చిగా పరితపిస్తాననే భావన స్పురించేసిన వాడి కళ్లల్లో దాగుంది ఆ ఉన్మాదమైనప్రేమ.

ఆ పిల్లేమైనా తక్కువదా?
ఆ కోపపు మాటల్లో, మొరటు ప్రవర్తనలో కూడా ప్రపంచంలో ఎవరికి కనపడని నిష్కల్మషమైన ఒక ప్రేమికుడిని చూసింది. కాబట్టే మూడురోజులకే “పెళ్ళిచేసుకున్న పరాయివాడిని” వదిలేసి, తన వాడికోసం “ఏడడగులు వెనక్కి వేసింది” .

ఎన్నటికి సమసిపోని ప్రకృతిలా వాడితో పెనవేసుకుంది కాబట్టే, తొమ్మిది మాసాల కోపం ఐదారు చెంపదెబ్బలతో సరిపెట్టేసింది.

వారిద్దరు ఒకరినొకరు విడచి శాశ్వతంగా ఉండలేరని వాళ్లకి తెలుసు ఎందుకంటే చేతివేళ్ళు పేనవేసుకున్న మొదటిరోజే వాళ్ళకర్ధమయింది ఏంటంటే ఒకరు, ఇంకొకరి తనువుకి, మనసుకి extended part అయిపోయారని.

వీరిద్దరికి ప్రేమే ఒక పిచ్చి.
ఆ పిచ్చి ఎలాంటిదంటే ఏరోజుకైనా తప్పక కలుస్తామని అనంతంగా సాగిపోయే రైలుపట్టాల తీరని కోరిక లాంటిది.

వీరిద్దరికి ప్రేమే ఒక విప్లవం.
ఆ విప్లవం  ప్రాణాలు బలి కోరితే, ఒకరిని ఇంకొకరు  చంపుకునేంత  ప్రేమ ఎందుకంటే ఒకరు మరణించి, మరోకరిని శిధిలంలా  మార్చకూడదనే ఒక వెర్రి ఆరాటం ఇద్దరికినూ.

వారిద్దరు అర్జున్, ప్రీతి.


అర్జున్ రెడ్డి ప్రతిఒక్కరి అంతరాల్లో దాగున్న వెలుగు చూడని నిజం. ఆ నిజాన్ని సంఘవిలువలకి భయపడి, సమాజపు చీదరింపులకు బెదరిపొయి,లో లోపలే ఒక రూపం దాల్చకుండా చిద్రం చేస్తారందరు. కాని ఈ మనిషి అలా కాదు , తనకి నచ్చిన పిల్ల కోసం సంఘాన్నే ఎదురించి, తన రూపంలో ఆ అర్జున్ రెడ్డికి ఒక ఆయువు పోసాడు ఈ గడ్డం పిలగాడు విజయ్ .

ప్రీతి ఒక పిచ్చి పిల్ల. ప్రేమకు ఆస్తి,కులం యేమాత్రం అడ్డంకి కాదని నమ్మింది అందరికిమల్లే. కాని అందరిలా ఇష్టంలేని పెళ్ళికి బానిసైపోకుండా, ఆ బంధాన్ని తెంచుకోని తన పిచ్చోడికోసం ఈ పాడులోకపు విషపుకోరల కర్కషత్వాన్ని పంటిబిగువన భరించడానికి సిద్దపడింది ఈ చిన్నికనుల షాలిని.  

వాళ్ళ నాయనమ్మ చెప్పినట్టు వాడికి బాధొక్కటే వ్యక్తిగతం కాదు (Suffering is personal), ప్రేమకూడా వాడికి వ్యక్తిగతమే. బహుశా అందుకేనేమో ఎంతమందితో తన ప్రేమ ఊసులు చెప్పుకున్నా, మాటల్లో చెప్పలేని నిగూడ భావమేదో వాడిని మరణంలా వెంటాడుతూనే ఉంది.

 
వాడి వేదన కేవలం ప్రీతికి మాత్రమే బోదపడుతుందని అర్జున్ కి తెలుసు ఎందుకంటే తాను ఎలాగైతే ప్రీతి బాధని, ప్రేమను అర్దంచేసుకోగలడో, ప్రీతిమాత్రమే తన వెర్రిని, పిచ్చిని అర్దం చేసుకోగలదని .

అప్పటికి ప్రీతి ఏమి మూర్ఖపుపిల్ల ఏమికాదు, మహ గడుగ్గాయే!
సమాజపు విలువలు పట్టని అర్జున్ కి, ఆ విలువలు కేవలం ఆడవాళ్ళకి మాత్రమేనని అర్ధమయ్యేలా రెండు, మూడు లెంపకాయలు గట్టిగానే  వేసింది ఆఖర్లో.

కొందరనుకుంటునట్టు ఈ అర్జున్ ఏమి మోడరన్ దేవదాస్ కాదు, కాకపోతే ఒక కుక్క పిల్ల మాత్రం కామన్ గా ఉంది. ఈ అర్జున్ దేవదాస్ లా పారుని మరచిపోవడానికి మందు తాగలే, తన గుండేచీకట్లో దాగున్న ప్రీతికి చేరువకావడానికి ఈ మందు, డ్రగ్స్ ఒక మార్గంలా తోచాయి అంతే .
 
ప్రీతియేమి పారులా వెక్కి వెక్కి ఏడుస్తూ స్తబ్దుగా ఉండలే. ఆ మాటకొస్తే ఈ పిల్లలో ఆ చంద్రముఖి పోలికలే ఎక్కువున్నట్టునాయి, ఆ దేవదాస్ కోసం ఏఆడదిచేయని పనులు చేయడం ఈ ప్రీతికి మాత్రమే సాధ్యమయింది.

అర్జున్, ప్రీతి  స్వేచ్చమైన జంటపావురాళ్ళు. వారిని కుటిలమైన సంఘవిలువల దారంతో కట్టిపడేయాలనుకునే ఈ ధూర్తలోకానికి అందని అతీతమైన ప్రేమ వీళ్ళది.

ఎందుకంటే వీళ్ళ ప్రేమ, బాధ్యతతోకూడుకున్న మానవ సంబంధం. వీళ్ళ పిచ్చి అజరామరం.