అనువాద కవిత.
ప్రియా, ఒకప్పటి మనదైన ప్రేమని ఇవ్వమని మళ్ళీ అడగకు.
కేవలం నీ వల్ల అప్పుడు లోకమంతా బంగారం రంగు కాంతులతో తళుక్కుమనేది. అదే నిజమని నమ్మా కూడా.
నీ ప్రేమ తాలూకా గాయాలకోసం కాకుండా వేరే వాటికోసం ఎవరు కుమిలిపోతారు చెప్పు?
అసలు ఇంకా ఈ లోకంలో బాధపడాల్సినవి ఏముంటాయి చెప్పు నువ్వు జ్ఞాపకంగా వదిలెళ్లిన బాధలు తప్ప?
ఈ ఆందోళనలు, అన్యాయ ఆక్రందనల గోల ఏంటి?
నీ మొముపై గునిసియాడే ఆ వెలుగే కదా వసంతకాల రాకకి గుర్తు.
అదేంటో కానీ, ఆకాశాన్ని ఎప్పుడు చూసినా నీ రెండు కళ్లలాగే తోచేది.
నా ఒడిలోకి నువ్వు జారిపడితే, ఆ తలరాత కూడా స్తబ్దుగా, అసహాయతతో చూస్తూ ఉండిపోదా చెప్పు.
నీ మీద ఉన్న ప్రేమవల్ల ఇవన్నీ ఆలోచించేవాడిని, ఇవి నిజమని నమ్మేవాడిని కూడా.
కానీ, ప్రేమే కాకుండా ఇంకా వేరే బాధలు, ఆనందాలు ఉన్నాయ్ ఈ లోకంలో.
ధనికులు ఒక మాయ ముసుగుని చరిత్ర మీద కప్పేసారు ఎప్పుడో.
చీకటి రహస్యాలన్నీ తీగల్లా చుట్టి అందమైన అలంకరణలాగా అల్లారు లోకం గోడలమీద.
ఎప్పుడైతే నేను వెలుగు ప్రసరించని ఇరుకు సందుల్లోకి, మార్కెట్ స్థలాల్లోకి వెళ్లానో,
మింగుడుపడని, ఇప్పటివరకు బయటపడని నిజాలన్నీ నా ముందు వచ్చి వాలాయి.
ఆ గల్లీల్లో నేను సగంకాలిన మనుషులను, రక్తమోడుతున్న ప్రాణాలను చూసా.
వాళ్ళని అక్కడే పదే పదే అమ్మడం, కొనడం నే చూసా.
ఈ కఠోర వాస్తవాలు కూడా గుర్తించాల్సిన సమయం వచ్చింది.
అక్కడనుండి తిరిగొచ్చిన తర్వాత వాళ్ళకోసం “నేనేం చేయాలనే” అనే ఆలోచన తప్ప ఇంకో తలంపే రావట్లేదు నాకు.
ప్రేమ మిగిల్చే భాదలు, ఆనందాలు కన్నా ఇంకా వేరే చీకటి వాస్తవాలెన్నో ఉన్నాయ్ ఈ లోకంలో.
ప్రియా, తిరిగిరాని మన ఆ ప్రేమ కావాలని మళ్ళీ అడగకు నన్ను .
No comments:
Post a Comment