Saturday 16 February 2019

చిట్టి తాత.





రోజంతా వంగోని నాటేసిన అమ్మ, పొద్దుగూకినాక ఇంటికొచ్చి అలా అడ్డపడదామనుకొంది. మంచంలో పేడపూసుకుని దూడలా ముడుసుకొని పడుకున్న చిన్ని గాడిని రొడ్డ చేత్తో జరిపి దిండుమీదకి ఒరిగింది. నులక మంచం ఇరుకయ్యి నిద్రలేచి చూస్తున్న చిన్ని గాడిని, “తానం పేడతో చేసినావు రా సిన్నోడా” అని, కొంగుకు కట్టిన కొబ్బరిముక్కలు తీసీచ్చింది అమ్మ.


ఒత్తుగొస్తున్న ఉచ్చనాపుకోలేక కళ్ళు నులుపుకుంటూ వాకిలి బయటకొచ్చిన చిన్నిగాడికి, ఈత పొదల దగ్గరకూసోని ఉచ్చబోసుకుంటూ, ‘గుడ్డి కొంగనిస్తా గానీ, గుడిసెలోకి రానిస్తావా’ అని రాగం తీస్తున్న చిట్టి తాత కనిపించిండు. మాటేలపూట ఆయన కొట్టిన రెండు దెబ్బలు గుర్తొచ్చాయి వాడికి, తెల్లారే తిందామని రాత్రికి దాచుకునే  పాశంబువ్వ మేల్కొగానే గుర్తొచ్చినట్టు.


జంగుబిల్లిలా సప్పిడి చేయకుండా నక్కి నక్కి పొదల దగ్గరికి నడిచి చిట్టి తాత ని పొదల్లోకీ నెట్టిండు. వెనక్కి తిరక్కుండా ఒక గెంతులో ఇంట్లోపడ్డడు. అన్నెం, పున్నెం ఎరగనోడిలా  అమ్మ పక్కలోకి దూకి వాటేసుకొని పడుకుంటుంటే, తాత గసపోసుకుంటూ మొత్తల్లోకొచ్చాడు. జారిపోతున్న లుంగీని ఒక చేత్తో పట్టుకొని పైకి కట్టుకుంటూ “జమలమ్మా, ఒసే జమలమ్మా, ఏడే నీ సిన్న కొడుకు? వాడుచేసిన పనికి దడుసుకొని కాళ్ళమీద పోసుకున్నానే ఉచ్చా” అని అనుకుంటూ, గాబుకాడికిపొయ్యి కాళ్ళు కడుక్కుంటున్నాడు.


నాటెత్తున్నపుడు కంట్లోపడిన నారుమడి బురదనీళ్ళు సలపరిస్తుంటే, అప్పుడే మూతలు పడుతున్న కళ్ళని బలవంతంగా తెరచి, ఒక క్షణంలో ఏమి జరుగుతుందోఅని, గట్టిగా వాటేసుకున్న చిన్నోడిని చూసి ఒక అంచనాకి వచ్చి, నోరుతెరిచింది అమ్మ -“ఎందే, చిట్టా? ఇప్పుడే పొడుకుంటుంటే నీ కొంటోళ్ళ గోల?” అని మంచంమీదుండి లేచింది. కర్రి తపేలాలో నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టింది.


“బాగుందే సంబడం తల్లా! అది నన్నడుగుతావే? ఈతకు వళ్ళంతా ఎలా చీరకపోయుందో చూడు. తీరా ఏమి ఎరగనట్టు గుడ్లెల్ల బెట్టి చూస్తుండు కదా, నీ సిన్నకొడుకునడుగు చెప్తాడు” అని అమ్మ రాజేసిన మంటదగ్గర ముడ్డాన్చాడు తాత.


“చిట్టా, మేత్రి ఇయ్యాల డబ్బులిచ్చిందే. నీ కూలీ డబ్బులు తెచ్చుకో ఆ సిలికి దగ్గర” అని, పొయ్యిలో ఒక కట్టెపుల్ల తీసుకపోయింది పాక లోపల కిరసనబుడ్డి వెలిగించడానికి అమ్మ.



“ముంగిస సెవులోడా , నీ సంగతి తరువాత చెప్తా ఆగు” అని, పందిరిగుంజ పట్టుకొని లేచి, డబ్బులకోసం చిన్నిగాడోళ్ల సిలకత్త ఇంటికి పొయ్యాడు చిట్టి తాత.


తాత తడకవతలకి పోగానే మంటగాడికి పోతున్న చిన్నిగాడిని, “నికరిప్పి రా పో, నీళ్లు పోసుకుందువు గాని” అని, వాళ్ళిద్దరికి మాత్రమే అర్ధమయ్యే భాషలో, అమ్మ సైగచేసింది.


అప్పుడప్పుడే మెదళ్ళో మొలుస్తున్న సిగ్గుకి , ఆయేడే హాస్టల్కి పోవడం వల్ల వంటిమీదకొచ్చిన కొత్త  తైలా కడ్డాయర్లు ‘రక్షణగా’ మారాయి. “సుబ్రం, సూచ్యం” అని రిన్ సొబ్బు పెట్టి, దానిని కసా బిసా బండకేసి బాదగా పడిన రెండు చిల్లులు ఎక్కిరించకుండా చెయ్యడ్డం పెట్టుకొని గాబుకాడికి పొయ్యిండు చిన్నిగాడు. పొద్దున తలకంటిన ఎండిపోయిన పేడను గోళ్ళతో దారలు దారలుగా పీక్కుకుంటుంటే, ఉడుకునీళ్ళు తెచ్చి అమ్మ బకెట్లో గుమ్మరించింది.


చీర పంచలాగా దోపుకొంటూ “సిన్నోడా, చిట్టితో ఏందిరా నీ వేశాలు? అది ఒక చేత్తో లేపి అవతలి పడేసిద్ది కదరా నిన్ను” అని, నీళ్ళుగుమ్మరించిది. చిట్టి తాత చాలా ఎత్తు. ఎంత ఎత్తంటే  చిన్నోడు రెండు చేతులు నిటారుగా పైకెత్తినా ఆయన పొట్టవరకు కూడా వచ్చేవి కావు వాడివేళ్ళు.


“మరీలుగాడు, నేను మాటెలపూట డొంకలో తూనీగలు పట్టుకుంటుంటే, బరేగొడ్డొచ్చి పొడవబోయిందే. రాయి తీసుకోని దానిని గదిమిచ్చేసరికి, అది బిత్తరకబొయ్యి, దొడ్డికిపొయ్యి లోటా ఊపుకుంటూ వస్తున్న తాత మీదకి ఉరికింది. దాన్ని తప్పించకోబొయ్యే సందడిలో, ఆయన లుంగీ సరుకారు కంపకి చుట్టుకొని పరుక్కుమంటే, మరీగాడు ఒకటే నవ్వు. నేనేదో మంత్రవేసి దానిని ఆయన మీదకి పంపినట్టు, నన్ను రెండు పీకులు పీకిండే వీపుమీద గట్టిగా.” అని చిన్నిగాడు వాడి గోడు చెప్పుకున్నాడు అమ్మకి.  కిందబడి ఏడ్చినందుకు గుర్తుగా, చిన్నిగాడి వళ్ళంతా పేడ పౌడర్ లా అద్దింది ఆ డొంక,  ఏ అమరికలు లేకుండా.


పొద్దున్నుండి కాళ్లతో జతకట్టిన మట్టిని నీళ్లుబోసి వెళ్లగొడుతుంటుంటే, ఎప్పట్నుంచో అడగాలనుకుంటున్న మాట బయకొచ్చేసింది వాడికి-”అమా, తాతేందే మా మాగోళ్ళలాగా నించొని ఉచ్చ బొయ్యకుండా, ఆడోళ్లలా లుంగీ చీరలాగా పరచి పోసుకుంటుండు?”


నీళ్లుబోసేదల్లా లోటా బకెట్లోవేసి, పండుగరోజు చియ్యకూర వడ్డించేటపుడు పెట్టె నవ్వే మొకం పెట్టి, ముడ్డిమీద టప్ మని ఒకటేసి, “నీకెందుకురా పెద్దోళ్ల యవ్వారాలు? గింతలేవు కానీ...  నా కొడకా” అని సొబ్బు మోకానికి రుద్దింది.


ఇపుడు చెప్తావా చెప్పవా అని గాబుకాడ సబ్బురొచ్చులో పొర్లుతుంటే , “చ్చో చ్చో చ్చో” అనుకుంటూ ఎర్ర మడతాలు పట్టి పైకి లేపింది అమ్మ.


ఏడుపు పడలేక తాత గురించి చెప్పింది- “ఆడంటే ఆడ కాదు, మగంటే మగా కాదు. ఆడోళ్లలో ఆడమనిషి. మొగోల్లలలో మొగమనిసి”. అమ్మ మాటలు వాడికేమి అర్ధం కాలేదు అచ్చం ఇందీ గౌస్ సారి పాటాల్లా. 


బొక్కలన్ని బయటపడేట్టు నీలుక్కుంటూ, వళ్ళు తుడుసుకోకుండా పొయ్యిదగ్గర పీటమీద కూసోటానికి ఉరికిండు చిన్నిగాడు.  ‘మమ్మ చెప్పిన మాటలకు మరమం ఏందిరా’ అని వాడు అనుకుంటుంటే, నిన్న మరీగాడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వాడికి- “చిట్టి తాతకు బాయలున్నయ్ చూసినవా అమ్మోళ్లలాగా?”.  దుక్క బలిసినట్టు వళ్లంతా కండలున్నా, ఆయన  చిన్ని తలకాయ,  పీచు గొంతు వాడి అనుమానాన్ని బలం చేసాయి.  


ఆరోజు నడిజాంకాడ నాన్నొచ్చి వాడి పక్కబొంతని లాక్కుంటుంటే, మెలుకువ వచ్చి, సారాయి వాసనకు ముక్కుమూసుకుంటుంటే, దగ్గరకు లాక్కొని గడ్డం గుచ్చుకునేలా ముద్దుపెట్టుకున్నాడు. అదేంటో తెలియదు కానీ, వంట్లో సుక్కపడిన రోజుల్లో అప్పుడప్పుడు, వాడికి, వాళ్ళ నాన్న చిన్నపిల్లాడిలా అగుపిస్తాడు.


చిన్నోడు ఇదే అదుననుకొని, “నాన, మరేం, చిట్టి తాత నాలా అబ్బాయా?లేక అక్కలాగా అమ్మాయా?”అని, పొట్టమీదెక్కి ఊగిండు. నాన్నకి వాడు ఆలా ఊగడం బలే ఇష్టం. తొందరగానే ఆయన వాడి బుట్టలో పడిపోయి, తిమ్మిరెక్కిన కళ్ళతో, తాత సంగతి చెప్పాడు.


చిట్టి తాత సరసన నలుగురు ఆడోల్లు, నలుగురు మగోళ్ళు. అందరికి పెళ్లిలయ్యి, వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఉన్నా, తాత మాత్రం వాళ్ళమ్మతో పాటు తన చిన్న తమ్ముడు దగ్గర ఉంటున్నాడట. వాగుకి పొయ్యే దార్లో, మోరి పక్క ఇంట్లో ఉండే కలకల జాను తాత, చిట్టి తాత స్వయానా రెండో అన్న అని,  వాళ్లిద్దర మధ్య అసలు మాటలులేవని, ఇంత వయసొచ్చినా వళ్ళు పగిలేటట్టు కష్టం చేసి, డబ్బులు వాళ్ళ అమ్మకో, లేక తమ్ముడి పిల్లలకో ఇయ్యడం తప్ప, రూపాయి దాచుకునే మనిషి కాదని... ఇలా ఎదో చనిపోయిన మనిషి తాలూకా జ్ఞాపకాల తుట్టుని ఎవరో కదిపినట్టుగా మాట్లాడుకుంటూ పోతున్నాడు నాన్న.


వాడిక్కావాల్సినది కాక ఏదో మందు బురుజు మాటలు కక్కుతున్న నాన్న నోటికి చెయ్యడ్డం పెట్టి, “నీయమ్మ, నాకియ్యేమీ వద్దు. చిట్టి తాత మొగోడా, ఆడదా?” అని గట్టిగా గదిమిచ్చాడు వాడు.


నాన్న లోపల్నుంచి వస్తున్న నవ్వుకు, పొట్టమీద పడుకున్న చిన్నోడు, పచ్చడిరోట్లో పత్రంలా, అటు ఇటు ఊగుతుంటే, చెయ్యి పక్కకి తీసేసి, “నీకెందుకే సిన్నమ్మా? పెళ్లి చేసుకుంటావా ఏందీ?” అని వాడి గాలిమొత్తం తీసేసాడు.


ఆ రాత్రి అలిగి ముసల్దాని దగ్గర పడుకున్న చిన్నోడిని, పొద్దున్నే నాన్న లేపిండు, తొందరగా బయల్దేరమని. ఆ వారం రోజులు ఆటల సందిట్లో పడి, దసరా సెలవులు నిన్నటితో అయిపొయ్యాయని, ఈ రోజే హాస్టల్ కి పోవాలని గుర్తే లేదు వాడికి. సరిగ్గా మూణ్ణెల్ల కిందట అమ్మ మోకాళ్ళేసి చేసిన ప్రార్ధన పాపానికి, ఆ యేసయ్య పెబువు వాడి మీద కచ్చ కట్టి  ప్రొద్దున బయలుదేరితే సాయంత్రానికి కూడా చేరుకొనేంత దూరంగా పడేసాడని వాడి నమ్మకం. హాస్టల్ కి పొయిన కొత్తల్లో పెడ్తున్న రకరకాల కూరలు బాగానే అనిపించినా, తర్వాతర్వాత రాత్రిపూట ఎన్నెల ఎలుగుల్లో ఇంటికాడ తిన్న ఎల్లిపాయకారం ముద్దలే రుచిగా అనిపించేవి వాడికి.


కనుగుడ్లలో నీళ్లు నింపుకుంటున్న చిన్నోడిని ఏమనలేక, “నేను ఊళ్లోకి పొయ్యేచ్చేలోగా ఈడి గుడ్డల సంచి పాక బయటుండాలి” అని అమ్మకి కేకేసి, బస్సు ఛార్జీల కోసం కమ్మోరింటికి పోయిండు నాన్న.


హాస్టల్ కి పొయ్యేది ఇష్టంలేక ఏడ్సుకుంటూ చింతచెట్టు రాపులకాడికి పొయ్యిండు చిన్నోడు. వెనకనుండొచ్చి, చిట్టి తాత వీపు మీద చెయ్యేసేవరకు, ఎంతసేపు గుక్కపెట్టి ఏడ్చాడో వాడికే తెలీదు. భుజం మీదున్న కండవతో మొఖం తుడిచి, అట్నే నోటికాడవరకు కారిన చీమిడి తుడుస్తూ,” ఏమైంది రా” అన్నాడు తాత. దుఃఖం కమ్మిన మబ్బులు ఉరిమినట్టుగా, పొరలుపొరలుగా ఏదేదో చెప్తుంటే, చిట్టి తాత “ఊ” కొట్టుకుంటూ వాడి ముఖంకెళ్లే చూస్తున్నాడు. అదేంటో తెలీదు కానీ, అప్పటిదాకా గట్టిగ అరుస్తున్న నాన్న, చిట్టితాతతో చిన్నిగాడు ఇంటికి పోగానే, అరవడం ఆపేసాడు.


తాత వాడిని ఇంట్లోకిపొయ్యి మంచినీళ్లు తాగమని చెప్పి, “ఏరా ఆదం? ఇయ్యాల ఎట్టాగూ సుక్రోరమే కదా, ఈ రెండురోజులు ఉండి, ఒకేసారి సోమవారం పోతాడులే” అని, కాలుమీద వాలుతున్న ఈగలను కండవతో కొడుతూ నాన్న పక్కన కూర్చున్నాడు.


“అది కాదే మామ, అప్పుడుబోతే వాళ్ళ సారు ఎదో పయును అంట, 50 రూపాయలు కట్టాలని చెప్పిండే. రెండురోజుల కూలిడబ్బులే అవి” -ఇనిపించి ఇనిపించనట్టు నోట్లోనే గొణుకుంటున్నాడు నాన్న.


“ఆ సిలికి దగ్గర నా డబ్బులు తీసుకోవే జమిలా” అని అమ్మకి చెప్పి, చిన్నోడిని రమ్మని సైగచేసి బయటకు నడిచిండు తాత. కొట్టుకాడ కొనిచ్చిన గొట్టాలు, వేళ్ళకి తగిలించి మెల్లగా నడుత్తుంటే “ఏందిరా, ఆ నీటకపు నడక?” అని వాడితో కలవడానికి అడుగుల ఊపు తగ్గించాడు తాత.


ఏదైతే అది అయితదని, రెండు రోజులనుండి బుర్రలో తిరుగున్న మాటని అడిగేసాడు చిన్నోడు- “చిట్టి తాతా, మరేమో నిన్ను తాత అని పిలవాలా? లేక అమ్మమ్మ అని పిలవాలా?” అని, నోట్లో నలుగుతున్న గొట్టం కరకరల్లో, వాడి భయాన్ని కలిపేసుకున్నాడు.


పొగాకు నమిలీ నమిలీ లేత గోధుమరంగులో మారిన పళ్ళవరసని బయటపెట్టి గట్టిగా నవ్వాడు తాత. ఆ నవ్వు, నలక్కళ్ళేని చింత చిగురుకుమల్లే, భలే స్వచ్ఛంగా అనిపించింది వాడికి.


ఆ సెలవుల్లో మొదలయిన వాళ్ళ సావాసం, హాస్టల్ నుండి వచ్చిన ప్రతి సెలవుల్లో ముదిరిన బెల్లం పాకం రుచిలా ఎక్కువయ్యుంది. చిన్నోడు పదో తరగతి వచ్చేదాకా, ప్రతి సెలవుల్లో, ఏవేవో నేర్పించాడు వాడికి తాత.


సిటికెన పుల్ల పట్టుకోవడం వచ్చినోడికే డప్పుక్కు కొట్టడం వచ్చినట్టని, ఏడో తరగతి ఎండాకాలమంతా పీటలమీద డప్పు నేర్పాడు. ముడుసుబొక్కల్లో తెల్లగుజ్జు రుచివచ్చేలా ఎలా పీల్చాలో, ఆరేలో దారం ఎక్కించి చెప్పులెలా కుట్టాలో, తోలుకి ఉప్పురాసి ఎలా ఊరబెట్టాలో, పచ్చిమాంసాన్ని ఎలా కోసి ఎండుతునకలు చేస్తారో, నిక్కరు, చొక్కా మురికి లేకుండా ఎలా ఉతుక్కోవాలో, గజ్జల్లో మురికి పేరుకుపోకుండా సుబ్బరంగా ఎలా తానం చేయాలో, ఇలా ఒకటేంది, వాడు పదో తరగతికి వచ్చేలోపు, తాత లోకంలోకి చిన్నోడిని లాక్కొనిపోయాడు.


చిన్నోడు ఇప్పుడు చదువుతున్న కాలేజీ జాయినైన కొత్తల్లో, “నాలాంటోళ్ళు మీ కాలేజీ లో ఉంటారట కదా రా? వాళ్ళ సావాసంలో పడి, ఈ ముసలోడిని మర్సిపోతావా ఇక” అని, వేళాకోళం మాటలు అన్నట్టు నవ్వినా, వాడు బదులేమి చెప్తాడనే మాటకోసం, చుట్ట కాల్చే మనిషిలో ఉండే శ్రద్ధ తాత కళ్ళలో కనిపించిందపుడు వాడికి. ఒక మొహమాట నవ్వుతో, బ్యాగ్ తగిలించుకొని కాలేజీకి వచ్చేసాడు వాడు. కొన్నిరోజులకే ‘హోంసిక్’ సెలవులకి ఇంటికి పోయినపుడు, “తాత నీకు నేనొక కొత్త పేరు పెట్టనా మరి” అని చెప్పి,  “తాతమ్మ” అని పిలవగానే, వాడి భావం అర్ధమయ్యి, చెవిమెలేసాడు దగ్గరకొచ్చి తాత.


వాళ్ళిద్దరి మధ్య స్నేహం, చిన్నిగాడు హైదరాబాద్ కి వచ్చిన తర్వాత పలచబడింది. సెలవులకి ఒక రోజో, రెండు రోజులో ఇంటికి పోయినపుడు ఇది స్పుష్టంగా కనిపించేది వాడికి. ఈ మాయనగరం, ఈ వింత కాలేజీ కల్చర్ వాడిని ఒక కొత్త మనిషిగా మార్చేశాయేమో బహుశా మరి, ఆ విషయం వాడికి కూడా సరిగ్గా తెలియదు ఇప్పటికి కూడా.   


కొత్తగా చుట్టుముట్టిన గాలిదుమారపు తీవ్రతతో, అనిర్దిష్ఠమైన యూనివర్సిటీ జీవిత ఆలోచనల ప్రవాహం దాటికి, ఇన్నిరోజులు వెంటవచ్చిన గూడెపు ఊసులు మసకబారిపోయ్యాయి. కాలం తెచ్చిన కుదుపులు కొన్ని, వాడు కొని తెచ్చుకున్న విష వలయాలు కొన్ని, వానపడిన చలికాలపు రాత్రుల్లో వచ్చే ఇగట మంచుపొగలా, చిన్నోడి జీవితాన్ని ఆవరించాయి. ఇప్పటి చిన్నోడి నుండి, ఒకప్పటి చిట్టి తాత చిన్నోడు, దూరమయ్యాడని గుర్తించేలోపే, గూడెపు బతుకులనుండికూడా వాడు ఎంత దూరమయ్యాడో తెలిసొచ్చింది. పై పెచ్చు ఈ నగరం తెచ్చిన ఉరుకుల బతుకు, చదువులు రుద్దిన ‘ఆధునికత’, గుండెపోలల్లందరిని, పరాయోళ్లగా నిలబెట్టింది వాడి ముందు.


లాస్ట్ సెమిస్టరు పరీక్షల తరువాత, ఇంటికిపోయిన చిన్నోడికి మిన్నుకుండిపోయిన గూడెం ఎదురువచ్చింది. ఆ రాత్రి అమ్మ చెప్తేనే కానీ తెలియలే, చిట్టి తాత చనిపోయాడని. “నీకు చెప్పడానికి నీ దగ్గర ఫోన్ కూడా లేదు కదా రా” అని అమ్మ బట్టలు మడతబెట్టుకొంటోంది.


“ఏమైందో ఏమో గానీ మనిషి బాగా బక్కగయిపొయ్యాడట, సరిగా తిన్నాడో, తినలేదో చివరి రోజుల్లో” అని అమ్మ ఉసూరుమంది. కడుపు చింపుకుంటే కాళ్ల మీద పడ్డట్టు, ‘నాకీ భాద ఉందని’ ఎవరికి చెప్పుకొనే మనిషి కాదు తాత.


అసలు ‘నాతో కూడా ఎందుకు ఏమీ చెప్పలేదో’ అని చిన్నిగాడు కొత్తగా పెబుత్వం కట్టించిన వాళ్ళింటికున్న సిమెంట్ వెంటిలేటర్ కిటికీతో గొడవపడి లోపలికస్తున్న చెంద్రుడి వెలుగు వైపు చూస్తున్నాడు ఆ చీకట్లో.


“మిరపతోటలో కల్పుకి పోయినపుడో, తెల్లారుజాము కుప్ప నూర్పులకు పోయినపుడో, ఎండాకాలం మొక్కజొన్న విరవడానికి పోయినవుడో, తాత ఎందుకలా ఉన్నాడని ఎవరైనా సూటిపోటు మాటలన్నప్పుడు, తన గోడు చెప్పుకోడానికి ఒక మనిసైనా ఉన్నాడా గూడెంలో అసలా? ఇంతకాలం తాత గురించి మొత్తం తెలుసని ఒక వెర్రోడిలా ఉన్నానేమో నేను?” అని లోపల లోపల తిట్టుకుని, నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు వాడు. చిన్నోడికి ఇంతకాలం వినపడని మాటలు మెల్లగా వాడి దరిచేరుతున్నాయి.


తెల్లారి రెండు జాముల కాడ, మైకులో పాట  వినపడగానే, “పేస్టరు గారు వచినట్టు ఉన్నాడు, నేను పోతున్న సిన్నోడా” అని, కొత్తగా కట్టిన రంగుల బిల్డింగ్లోకి, అమ్మ ప్రార్ధనకి పొయ్యింది.


మర్చిపోయిన దారిలో అడుగులు అటు ఇటు తడబడ్డాయి కొంచెంసేపు. రాళ్లు తేలిన కంకరరోడ్డు బొందలగడ్డకి దారితీసింది.  మొన్ననే పూడ్చారన్న దానికి గుర్తుగా, ఎండిపోయిన బంతిపూల దండ గాలికి శబ్దం చేస్తూ రాయికి కొట్టుకొంటుంది. ఒక చివరన నిలబెట్టిన ఆ రాయిని చూసి, ఇంకో చివరన కాళ్ళు ఉంటాయని నిర్ధారించుకొని, ఆగడ్డ పక్క కూలబడ్డాడు, విసురుగాలికి విరిగిన చెట్టుకొమ్మలాగా.


జ్ఞాపకాలు గుప్పుమంటున్న వేళ, చివరిసారిగా చిట్టి తాత ఉన్న ఆ కాళ్ళ కాడ మట్టి, చేతిలోకి తీసుకోని గుండెలనిండా పీల్చుకొన్నాడు ఆయన వాసనని. మోకాలిమీద కూర్చుని, కళ్ళు మూసుకొని చిట్టి తాత రూపం గుర్తుతెచ్చుకుంటే, తాటాకు తోపుల పెడగాలికి ముందుకి తుల్లిడినపుడు, పోయినసారి ఇంటికొచ్చినప్పుడు తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి- “సిన్నోడా, ముడ్డికింద 20 ఏళ్ళు వచ్చిన వంటిమీద కేజీ కండలేదు. ఇలా ఐతే, ఎవత్తి చేసుకునుద్ది?  నాలా పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిపోతావా ఏందీ?”


పట్టలేనంత దుఃఖం పొగిలివస్తుంటే, ప్రమేయలేకుండానే కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి. తట్టుకోలేక బొందమీద పడి మౌనంగా తాతతో ఎదో మాట్లాడుతుంటే, ఇదే బొందలగడ్డలో ఏడో తరగతి ఎండాకాలం రోజుల్లో, తాత వాడితో అన్న మాటలు ఎదురుగా వచ్చి నిశ్శబ్దంగా నిల్చున్నాయ్.


చావు దరువు ఎవరైతే సిర్ర తప్పకుండా కొడతారో వాళ్ళకే దరువు వచ్చినట్టని, గూడెంలో ఓ లెక్క. తాత వాడికెందుకో ఈ దరువు అస్సలు నేర్పించలే. పెళ్ళికొడుకు నలుగు దరువు, పెద్ద మనిసైతే వేసే దరువు, చాటింపు దరువు, ఆకరికి ఉప్పలమ్మల దగ్గర రాత్రంతా జాగారం చేసి కొట్టే దరువు నేర్పాడు కానీ, చావు దరువు మాత్రం ఎప్పుడు నేర్పించలే.


ఆ ఏడు చుట్టింటి గోపులు తాత చనిపోయినపుడు, ఆ తాత మీదున్న ప్రేమతో గూడెంలో ఉన్న 43 గడపలనుండి  డపుక్కులు తెచ్చి, ఊరు సాంతం వినబడేలా దరువుల, బాంబుల శబ్దాల మధ్య బొందల గడ్డలకి తీసుకెళ్లారు గోపుల తాతని. బొంగుపేలాలు, పచ్చి సెనగపప్పు చిన్నోడి నోట్లో పెడుతూ “సిన్నోడా, నేను సచ్చిపోతే నా సావు దరువు నువ్వు కొడతావు రా?” అని దిగాలుగా అడిగాడు చిట్టితాత. పంచదార కొబ్బరిముక్కలు బుక్కడంలో మునిగిపోయిన వాడు, తాత మాటకి బదులివ్వడమే మరచిపోయాడప్పుడు.   


ఇప్పుడు నోరు తెరచి చెప్పాలనుంది వాడికి- “చిట్టి తాత , నీకు తెలియకుండా చావు దరువు ఎప్పుడో నేర్చుకున్నానని, ఒక్కసారి తిరిగొచ్చి నా సిటికెన పుల్ల వరసను  సరిచేయమని.”


సమాధానం లేని ప్రశ్నని అడుగుతున్నట్టుగా చుట్టూ ఓ విషాద నిశ్శబ్దం అలుముకుంది.

   


-ప్రజాసాహితి, 2019 ఫిబ్రవరి లో ప్రచురితం.